ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అధ్యాయము 31
భగవాన్ ఉవాచ
ఇక్కడి నుండి భగవాన్ కొన్ని ముఖ్యమైన విషయాలు తమ బోధనల ద్వారా తెలియపరిచారు . ఈ భగవాన్ చెప్పిన అమూల్యమైన ఉపదేశాన్ని గ్రహించినచో గ్రహింప బడినవారు తప్పక జ్ఞానిగా మారుతారు . కావున భగవాన్ చెప్పిన బోధలు ఏమిటో చూద్దాం .
ఒక భక్తుడు భగవానుని ఎప్పుడు “ దేనినో చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంటారు కదా . మీరు ఎవరిని చూస్తూ ఉంటారు ” అని ప్రశ్నింపగా , *భగవాన్ , “ నన్ను నేనే చూసుకుంటున్నాను . నాకంటే అన్యము లేదు చూడటానికి* ” అని జవాబు చెప్పారు . భగవాన్ చెప్పిన దానిని బట్టి వారు దేనిని బాహ్య చూచుటలేదని ఒక జ్యోతినో లేదా సాక్షాత్ ఆ అరుణాచలేశ్వరునో కూడా కాదని తనను తానే చూస్తున్నారని తనకంటే అన్యము ఏదీ లేదని కావున తానే భగవానుడని ప్రతి వారికి సూచన నిచ్చారు . ఇది నిరూపించుటకు మరియొకసారి ఒక భక్తుడు దేవుడున్నాడా అని ప్రశ్నించగా ఒకవేళ ఉంటే ఆ దేవుని చూచారా అని అనగా , *భగవాన్ దేవుడు ఉన్నాడని ఒక విధముగా నిలబడి , “ నేనెవరునకున్నావ్* " అని అన్నారు . ఇంకొకసారి భగవాన్ కి భక్తులు ఎన్నో కానుకలు , ప్రసాదాలు అర్పించుట చూసిన ఒక భక్తుడు “ మీరు ఎందుకు వాటిని స్వీకరిస్తున్నారు . అసలు మీ గొప్పేమిటి ? " అని ప్రశ్నించగా భగవాన్ , " *బెల్లం వినాయకుని నుండి చిన్న ముక్కను తుంచి నైవేద్యం పెట్టినట్లుగా వీరు నాకు ఇస్తున్నారు . అంతా నేనేకదా మరియు అంతా నాదేకదా* ” అన్నారు భగవాన్ . అలాగే మరియొక భక్తురాలు తాను విదేశాలకు వెళ్తున్నట్లు భగవాన్ కి చెప్పి “ మీరక్కడికి వస్తారా " అని అనగా *భగవాన్ " నేను కాలాన్ని , దేశాన్ని అధిగమించి ఉన్నాను . కావున నేను అక్కడున్నాను " అన్నారు* .
భగవాన్ కి ఒక భక్తుడు పళ్ళు తెచ్చి ఇవ్వగా , భగవాన్ , “ *ఈ ఆశ్రమములో ఎంతోమంది ఫలహారం చేసేవారు ఉన్నారు . ఇన్ని ముఖాలతో తినగా , ఈ ముఖంతోనే తింటేనే తిన్నట్లా* ” అని అన్నారు . అందరి ఆకలి తీరితే తన ఆకలి తీరునని భగవాన్ ఉద్దేశం . ఒక భక్తులు పాండురంగని పూజించే వాడగుటచే పండరీయాత్ర చేసి ఆశ్రమానికొచ్చి భగవానుని ఆనందముతో కౌగిలించుకోగా భగవానుని శరీరమంతా కమిలిపోయింది . భగవాన్ అతనితో ఇట్లనెను , “ *పండరీపురములోని దేవుడిని కౌగిలించుకొన్నట్లుగా నన్ను కౌగిలించుకున్నావు . అక్కడి దేవుడు రాయి . కాని ఇది సజీవం , ఇలా అవుట దీని ధర్మం* " అని అన్నారు . హిమాలయంలో శ్రీ రామకృష్ణ పరమహంస పరమభక్తుడైన శ్రీ శంకరానంద ఆ పరమహంసను నిరంతరము ధ్యానిస్తూ అలాంటి పరమహంస దర్శనము కావాలని ప్రార్థంచగా హఠాత్తుగా వారి కుటీరములో భగవాన్ వచ్చారు . వారితో చాలాసేపు చర్చించి రమణులు వెళ్ళిపోయారు . శ్రీ శంకరానంద తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆశ్రమానికి ఒక లేఖ ద్వారా పంపినపుడు ఆ సంఘటన జరిగిన రోజున భగవాన్ ఆశ్రమములోనే ఉన్నట్లు ఋజువైనది .
కొందరు భక్తులు రమణాశ్రమములో కొన్ని పుస్తకాలను కొని వాటిని భగవాన్ చేతిలో ఉంచి ఆశీర్వదిస్తూ పేరు రాయమని కోరగా *భగవాన్ " ఏం పేరు రాసేది నాకు పేరా ఊరా ఏదైనా ఉంటేకదా ! " అని అన్నారు* . భగవాన్ ఎట్టి పరిస్థితిలోను తాను ఒక శరీరమని తనకొక పేరు మరియు ఊరు ఉన్నదని ఎన్నడూ భావించలేదు . ఏ రోజైతే వారికి ఆత్మ సాక్షాత్కారము కలిగినదో అప్పటినుంచి వారు తమ పేరును చెప్పలేదు . భగవాన్ తల్లి అలగమ్మ ఒకరోజున శ్రీ రమణ మహర్షి గారి దేహము మాయమై ఆ స్థానమున శివలింగాన్ని స్వయముగా చూచినదని ఆ తల్లి చెప్పినారు . ఒకసారి ఒక భక్తురాలు పుట్టు కురుపుతో చివరి స్థితిలో భగవానుని చూసి తన బాధను భరించక దుఃఖముతో తన తలను గోడకు కొట్టుకొనగా భగవాన్ ఇట్లనినారు , “ *ఈ దేహమే రమణుడు అనుకుంటున్నారు . ఈ దేహ వికారాలన్ని నాకు అంటగడుతున్నారు . ఎంత చెప్పినా వినరు . నేను ఎక్కడికి వెళతాను . అసలు వెళ్ళటానికి చోటేది* ” అని అన్నారు . ఇంకొక భక్తునికి భగవాన్ తమ దేహత్యాగము చేసిన పిదప వారికి రక్షకుడెవరని తలంపగా భగవాన్ ఇట్లనినారు , “ *మీరు ఈ శరీరమే నేను అని తలుస్తున్నారు . నేను ధరించి తిరుగుతున్న ఈ శవమే మీకు కనబడుతోంది . ఇది మీ తప్పు . నేను సర్వత్రా నిండి వున్న ఆత్మను . ఎక్కడికి వెళతాను , చోటేది ? ఇక్కడే ఉంటాను* " అని సెలవిచ్చారు . సద్గురువు శ్రీ సాయినాధుడు తమ దేహమును వదిలేముందు కూడా వారివద్ద వచ్చిన భక్తులు తమ తదనంతరము రక్షకులు మాకెవరని ప్రశ్నింపగా శ్రీ దత్త అవతారమగు శ్రీ సాయినాధుడు నేను సర్వత్రా నిండియున్నాను నన్ను శరణుజొచ్చిన వారికి నా సమాధియే మాట్లాడునని వచ్చిన భక్తులకు సమాధాన మిచ్చునని చెప్పినారు . ఒకసారి భగవాన్ కి ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో వెనుక ఏదో రాసి ఉండగా ఆ రాసినది ఏమిటని ఒక భక్తురాలు భగవాన్లో ప్రశ్నించగా భగవాన్ ఇట్లనినారు , “ *శరీరాన్నెరుగని పెద్ద ఆత్మ , ఆత్మనెరుగని పెద్ద శరీరము ఒకే స్థలములో ఉన్నవి* ” అని అన్నారు . అలాగే ఒక భక్తుడు తన ఊరికి వెళ్ళబోవుముందు స్వామి ఆశీర్వచనమునకు రాగా ఆ సమయమున భగవాన్ తమ శరీరాన్నంతా దుప్పటితో ముసుగు కప్పుకుని ఉన్నారు . వచ్చిన భక్తుడు భగవాన్ నిద్రపోతున్నారేమో అని భావించి మెల్లగా ముసుగు తీయగా భగవాన్ ఆ భక్తుని చూసి ఇట్లనినారు . “ *ఆత్మ కంటిలో మాత్రమే ఉన్నదనా ? కళ్ళు మూసుకుంటే చూడలేనా ? వస్త్రము ఆత్మను కప్పుతుందా ? " అని చెప్పారు* . భగవాన్ ఏ క్షణమునైనా తానొక శరీరమని భావింపక తానొక ఆత్మ అని ప్రతి నిమిషము గుర్తుచేస్తూ తానే కాక ప్రతివారు కూడా ఆత్మేనని బోధిస్తు తాను శరీరము కాదు ఆత్మ అనే ఎరుక ఎల్లప్పుడు ఉండవలెనని సూచిస్తూ ఉండేవారు . భగవాన్ చెప్పిన విషయాలు జ్ఞప్తికి చేసుకుంటూ మనము కూడా వారి అడుగుజాడలు మ్రొక్కుతూ వారి దారిలో నడిచేందుకు శరణు వేడుదాం .
రమణ శరణాగతి
అరుణాచల శివ.
No comments:
Post a Comment