# వీనులవిందుగా మాటలు
🍁మాట్లాడే విధానం వక్తను సమాజానికి సన్నిహితుణ్ని చేస్తుంది. విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ సంభాషించే పద్ధతి తెలియక చాలామంది శ్రోతల్ని ఆకట్టుకోవటంలో విఫలమవుతారు. మాటలు బాణాల్లా హృదయంలో నాటుకున్నాయనడం తరచుగా వింటుంటాం. బాణం లక్ష్యాన్ని తాకి, ప్రయోగించిన వ్యక్తి కార్యం సఫలమయ్యేలా చేస్తుంది. మాటైనా అంతే. అయితే, అది శ్రోత హృదయాన్ని తాకిందా లేదా అనేది వక్త సంభాషణానైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది.
🍁మాటతీరులో స్పష్టత ఉండడాన్ని వాక్యజ్ఞానం అంటారు. శ్రీరాముడు హనుమంతుణ్ని తొలిసారి చూసినప్పుడు అతడు వాక్యజ్ఞుడనీ, వాక్య కోవిదుడనీ లక్ష్మణుడికి పరిచయం చేస్తాడు. రామాయణంలో అనేక పర్యాయాలు ఆంజనేయుడి వాక్ కౌశలాన్ని చూడొచ్చు. సంభాషణ రక్తి కట్టడానికి వక్తకు తను మాట్లాడే భాషతోపాటు శారీరక భాష పట్ల
కూడా అవగాహన ఉండాలి.
🍁రామాయణ భారతాలతో పాటు అష్టాదశ పురాణాలను- సంభాషణాదక్షుడైన ఎవరో ఒక మహర్షి, తక్కిన రుషులు ప్రశ్నించినప్పుడు. అందుకు సమాధానంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఆయా గ్రంథాల్లో అనేక కథల్ని ఉపకథల్ని అనేక ప్రశ్నలకు సమాధానాల్ని నాటి మహర్షులు చేర్చారు. వారికి వాక్ చతురత ఉంది కాబట్టే శ్రోతలకు విసుగు కలగకుండా రోజుల తరబడి కథలను చెబుతూ సందేహాలు నివృత్తి చేశారు. క్లిష్టమైన ధర్మసూక్ష్మాలు వివరించేటప్పుడు సైతం విసుగును ప్రదర్శించకుండా తగిన సమాధానాలతో ప్రశ్నించిన వారిని తృప్తి పరచగలిగారు.
🍁 అసహనంలాంటి భావాల్ని పైకి వ్యక్తం చెయ్యకపోవడం గొప్ప సంభాషణాపరుడి అతి ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఒక్కొక్కరి ఉపన్యాసం శ్రోతల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. జీవితంలో నిర్లక్ష్యం చేసిన ఏ లక్ష్యాన్నో తిరిగి సాధించమంటూ పురికొల్పుతుంది. మాట్లాడుతున్న అంశం పట్ల అవగాహన, సందేహాలకు తావులేని స్పష్టత, లోకజ్ఞానం, ఏ విషయం మాట్లాడితే శ్రోతలకు నచ్చుతుంది. పసిగట్టగల నేర్పు... ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఉపన్యాసాలకు ప్రధాన దినుసులు.
🍁పూర్వం యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ అది ఇష్టం లేని మహారాజులు దూతలను పంపి సంధి కుదుర్చుకునేవారు. మాట్లాడటంలో దూత ఎంత నేర్పరి అయితే సంధి అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. అతడు ముందుగా మెరుగైన సంబోధనలతో. పొగడ్తలతో ఎదుటివారి మనసును గెలవాలనేది నియమం. తన మాటలతో మహారాజు ఆత్మాభిమానం కోల్పోకుండా మధ్యేమార్గంలో సంధి కోసం దూత ప్రయత్నాలు సాగేవి. మాటలు ఎక్కువయ్యేకొద్దీ మనిషి పలచబడి పోతాడు. కొంతమంది నేర్పరులు పదాల్ని తూకం వేసినట్లు అవసరమైనంత మేర మాత్రమే సంభాషిస్తారు.
🍁ప్రాచీన రుషులు తక్కువ మాటల్లో విస్తృత భావాల్ని తెలియజేశారు. తమ ఆధ్యాత్మిక జీవితానుభవాలను రంగరించడంవల్ల ఆ మహానుభావుల పలుకులు భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలుస్తున్నాయి. దీని ద్వారా సంభాషించేటప్పుడు సందర్భోచితంగా స్వీయానుభవాల్ని వ్యక్తీకరించడం వల్ల ప్రసంగం ఆకట్టుకుంటుందని అర్థమవుతుంది.
🍁పదాల్ని పంచదార పలుకుల్లా మార్చి
ఉపయోగించే వక్త అందరికీ
మిత్రుడవుతాడంటారు.🙏
-✍️గోలి రామచంద్రరావు
No comments:
Post a Comment