🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
నా ఆజ్ఞా చక్ర అనుభవాలు - 2
మూలం : కపాల మోక్షం అనే గ్రంథం
అనుభవం : పవనానంద సరస్వతి
...ఆగస్టు 15: ఈరోజు నాకు ధ్యానంలో విచిత్రంగా నేను పూజించే దుర్గా యంత్రం కనిపించినది. అందులోనుంచి ఒక మూడు సంవత్సరముల ఒక బాలిక రూపంలో బయటికి వచ్చి నా తొడ మీద కూర్చున్నట్లుగా అనిపించింది. కనిపించినది. కాకపోతే ఎవరో నా తొడ మీద కూర్చుని ఉన్నట్లుగా అనిపించినది. ఏదో తెలియని అనుభూతి కలిగింది.
ఆగస్టు 20: ఈ రోజు నాకు ధ్యానములో ఎరుపు జాకెట్టు పసుపు రంగు లంగా వేసుకున్న 8 సంవత్సరముల బాలిక రూపంలో నవ్వుతూ నా దగ్గరకు వచ్చినట్లుగా అనిపించినది. ఇది నిజమా లేదా కలలాంటి అనుభవమా నాకు అయితే అర్థం కాలేదు.
సెప్టెంబర్ 10: ఈ రోజు దుర్గాష్టమి. దుర్గా యంత్రము పూజ చేస్తున్నాను. పైగా దేవీ నవరాత్రుల దీక్షలో ఉన్నాను. సుమారుగా 28 నుండి 32 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక స్త్రీ మూర్తి యంత్రము నుండి బయటికి వచ్చి
అటు ఇటు తిరుగుతూ మళ్లీ ఈ యంత్రం లోనికి వెళ్లిపోవడం నా కనులారా సజీవమూర్తిగా చూడడం జరిగినది. మొదట నాకు ఆశ్చర్యం వేసినది. ఆ తర్వాత భయము వేసినది.
సెప్టెంబర్ 25: ఈ రోజు నాకు ధ్యానములో అలాగే మా ఇంటికి 45సంవత్సరముల వయస్సు ఉండి నల్లని చీరతో ఒక ఆవిడ వచ్చింది. మా అమ్మ దగ్గర ఉన్న నల్లని చీర అడిగి తీసుకుని వెళ్ళినది అని అమ్మ చెప్పింది.ఈ మధ్య ఈ దేవతా స్త్రీ మూర్తులు నా వెంట ఎందుకు తిరుగుతున్నారో మా గురు దేవుడిని అడగాలని అనుకున్నాను.
సెప్టెంబర్ 28: నాకు కలిగే స్త్రీ మూర్తి దేవత అనుభవాలు గూర్చి చెప్పినప్పుడు ఆయన పెద్దగా నవ్వి “నాయనా! ప్రకృతి మాత అయిన బాలా త్రిపుర సుందరి దేవి స్వరూపాలు నీవు చూసిన మూడు సంవత్సరములు బాలిక "బాల", ఇరవై ఎనిమిది సంవత్సరములు "త్రిపుర" ,45 సంవత్సరములు "సుందరి", 80 సంవత్సరములతో ఉన్న మూర్తి "దేవి" ...అనియూ...అవే ఈ రూపాలు అని చెప్పటం జరిగినది. ఈమె సాక్షాత్కార మాయలో నిన్ను ఉంచాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోందని గ్రహించు...! నిన్ను తన ప్రకృతి అయిన జీవ మాయ దాటకుండా చేస్తోందని గ్రహించు. నేను ఇప్పటిదాకా ఈమె మాయను కూడా దాటలేకపోయినాను.
అలాగే రామకృష్ణ పరమహంసకి కాళీ మాత అనే ప్రకృతి మాత మాయను దాటించడానికి తోతాపురి అనే సద్గురువు వచ్చినారని తెలుసుకో! సద్గురువు అంటే ఆత్మ సాక్షాత్కారమును పొంది ఇతరులకు శక్తి పాత సిద్ది ద్వారా అనుగ్రహించే గురువు అని గ్రహించు. కాకపోతే ఇలాంటి మీ సద్గురువు కోసం మీకు ఈ చక్రం యొక్క 4 ఉప చక్రాలు అయిన గుణ, కర్మ,కాల, బ్రహ్మ చక్రములను దాట వలసి ఉంటుంది. అది కూడా తాంత్రిక విధి విధానంలో అనగా పంచ మకారాలు అంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైధునము అనే ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది.వీటికి నా తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో వీటిని చేయలేకపోవడంతో ఈ ప్రకృతి మాయను దాటలేకపోయినాను అని ఆయన నిజాయితీగా చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు...!
అక్టోబర్ 10: ఈరోజు పురాణపురుష అయిన శ్రీ లాహిరి మహాశయులు జీవిత అనుభవాలు గ్రంథము చదవటము జరిగినది.ఈ నాలుగు ఉప చక్రాల కోసం తాంత్రిక విధానమే కాకుండా దక్షిణాచారం లో కూడా విధి విధానాలు ఉన్నాయని చెప్పడం జరిగినది. అనగా మన కొండ నాలిక యందు స్రవించే అమృతమును సేవించుట మద్యపానం అని అలాగే ఖేచరీ ముద్ర సిద్ది పొందటమే మాంసభక్షణ అని అలాగే ఆజ్ఞాచక్రము లోని త్రికోణంలోని
త్రివేణీ సంగమ స్థానం అనగా గంగ, యమున, సరస్వతి నదుల సంగమ స్థానం అని ఇందులో సంచరించే శ్వాస ప్రశ్వాస అనే చేపలు తినటం మత్స్యము అని అలాగే చిన్ముద్ర సాధన సిద్ది ముద్ర అని మణిపూరక చక్రంలోని 'రం' అనే బీజాక్షరము మరియు ఆజ్ఞా చక్రములోని 'మ' అనే బీజాక్షరము అనుసంధానించడమే మైధునం అని చెప్పటం జరిగినది. ఈ విధముగా దక్షిణాచారంలో సాధన చేసి ఈ నాలుగు ఉప చక్రాలను దాటవచ్చునని చెప్పటం జరిగినది.
అక్టోబర్ 18: ఈ రోజు నా కుడి చెవి నుండి ఏదో నాదము లీలగా వినపడుతుంది.కానీ అది అర్థం కావటం లేదు. కానీ వినాలని నా మనస్సు తాపత్రయపడుతోంది.
అక్టోబరు 28: ఈ రోజు నా కుడి చెవి నుండి చాలా స్పష్టంగా ఓంకారనాదం వినబడ సాగినది. ఆశ్చర్యమేసింది. ఆనందం వేసింది.
నవంబరు 10: ఈ రోజు నా భ్రుకుటి స్థానము నందు ఏదో మిలమిల మెరుస్తూ ఒక నక్షత్రం కనపడినది. బొట్టు ఉండవలసినస్థానము నందు నక్షత్రం ఉండటం ఏమిటో నాకైతే అర్థం కాలేదు.
నవంబర్ 22: ఈ రోజు నాకు కనిపిస్తున్న నక్షత్రం కాస్త పెద్దది అవుతూ కోడి గుడ్డు ఆకారము అంత పరిమాణంలో కనపడినది. నాకు ఆశ్చర్యము వేసే సరికి నాకు ధ్యానము భంగమైనది.
నవంబర్ 23: ఈ రోజు నాకు ముదురు వంకాయ రంగులో "ఓం" మధ్య బీజాక్షరము గా ఉన్న రెండు దళాలు ఉన్న పద్మము లీలగా కనిపించసాగింది.
నవంబర్ 25: ఈ రోజు అర్ధరాత్రి నా శరీరము నుండి నాలాంటి రూప ధారి తెల్లని శరీరం బయటికి వచ్చి తిరిగి ఆ తర్వాత నా శరీరము లోనికి ప్రవేశించడం నా భౌతిక నేత్రములు ద్వారా చూడటం జరిగినది. ఆశ్చర్యము, భయం వేసింది .
నవంబరు 28: పుస్తకాలు చదివితే అది సూక్ష్మశరీరం అని తెలిసినది. అది ఎవరో ఏమిటో తెలుసుకుంటే అదియే ఆత్మ సాక్షాత్కారము అవుతుందని గ్రహించాను. కాకపోతే దీనికి సద్గురువు అనుగ్రహం ఉండాలని అలాగే దైవ సాక్షాత్కార మాయలను దాటాలని చెప్పటం జరిగినది.
డిసెంబరు 5: నా చుట్టూ అలాగే నా ఇంటి చుట్టూ దైవ శక్తి తిరుగుతుందని నా చుట్టూ ఉన్న వారు గ్రహించటం మొదలుపెట్టినారు. దీనిని ఇంతటితో ఆపకపోతే నన్ను ఒక దేవుడుగా చేసి పూజలు చేయటం చేస్తారు.
డిసెంబర్ 12: ఈ రోజు ఒక తాంత్రిక స్త్రీ గురువుతో మాట్లాడటం జరిగింది. ఆమె సహాయ సహకారాలతో దక్షిణాచారంలో నా 4 ఉప చక్రాలు అయిన గుణ, కర్మ, కాల, బ్రహ్మ చక్రాలను దాటాలని నిశ్చయించుకున్నాను. (గమనిక: ఈ నాలుగు ఉప చక్రాలు జాగృతికి,శుద్ధికి మాకు నాలుగు సంవత్సరముల పైన పట్టినది అని గ్రహించండి.)
ఫిబ్రవరి 10: ఇంతటితో నా నాలుగు ఉప చక్రాలు గుణ, కర్మ, కాల, బ్రహ్మ చక్రాలు జాగృతి, శుద్ధి అయినాయి.
మార్చి 27: ఈరోజు ధ్యానము అంతా కూడా కర్మ చక్రం మీద పెట్టినాను. ఈ చక్ర దైవం అయిన శ్రీ రామ దర్శనం అయినది. ఇదే సమయంలో దుర్గాదేవి మంచి సౌందర్య యవ్వనవతిగా నగ్నముగా లజ్జా గౌరిగా దర్శనము ఇచ్చినది. కవ్వించడం మొదలుపెట్టినది. నవ్వి ఊరుకున్నాను.
ఏప్రిల్ 25: ఈ రోజు అంతా కూడా నా ధ్యానం బ్రహ్మ చక్రం మీద పెట్టినాను. విచిత్రంగా "ఏకపాదుడు" అనే రూపము కనిపించినది. ఆపై దుర్గాదేవి 80 సంవత్సరాల వృద్ధ స్త్రీ మూర్తిగా ముదురు ఆకుపచ్చ రంగు చీరలో కనిపించి దీవించి శూన్యము నందు అదృశ్యమైంది. ఆయా చక్ర దేవతలు చివరికి శూన్యము నందు లీనం అవటం కూడా జరిగినది.
మే 10: ఈ రోజు నాకు కలలో భవిష్యవాణి సూచన అనుభవాలు కలిగాయి. అవి నిజమేనా అన్నట్లు చనిపోయిన నా కుక్క పునర్జన్మ యొక్క కుక్క రూపము లీలగా కనిపించినది.
మే 13: నాకు కలలో కనిపించిన భవిష్య అనుభవాలు నిజమేనని తెలుస్తోంది .వామ్మో! ఇది ఏమిటి. ఈరోజు నాకు ధ్యానములో కనిపిస్తున్న కుక్క నాకు ఇలా కనపడి మా ఇంటికి తీసుకొని రావటం అయినది.
మే 18: నాకు జరగబోయే భవిష్యత్ దృశ్యాలు కలలో ధ్యానములో కనబడుట ఆరంభమయ్యాయి. అవి నిజమవుతూ వస్తున్నాయి. ఇదే త్రికాల జ్ఞాన సిద్ధి కాబోలు.
మే 20: దీనికి సంబంధించిన గ్రంథాలు చదివితే ఇదియే "త్రికాలజ్ఞాన సిద్ది" అని మన త్రినేత్రం యందు జరగబోయే భవిష్యత్తు దృశ్యాలు లీలగా కనబడతాయని వీటిని చూస్తూనే మన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానం వ్రాసినారు అని తెలుసుకున్నాను. అంటే ఈ చక్రం లో ఉండే త్రినేత్రం తెరుచుకుందా? తెరుచుకుంది కాబట్టి నాకు దైవ సాక్షాత్కార దర్శనాలు తెలిసినాయి అని నాకు అర్థమైనది.
ఆగస్టు 5: ఈ రోజు నేను నా కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు మొట్ట మొదటిసారిగా దర్శించుకోవటానికి బయలుదేరినాను.
ఆగస్టు 6: ఈరోజు కాశీలో నేను మానస సరోవర ఘాట్ నందు ధ్యానం చేస్తూ ఉండగా నా మనోనేత్రంలో ఎవరివో పెద్ద పాదాల దర్శనం అయినది. ఇది ఎవరివో అర్థం కాలేదు.
ఆగస్టు 7: ఈ రోజు ఈ పాదాలు ఉన్న వ్యక్తి మోకాళ్ళ వరకు దర్శనమిచ్చి ఏదో గుడికి వెళుతున్నట్లుగా ధ్యానములో కనిపించినది. ఇదే రోజు మేము కాశీ విశ్వనాథ శివలింగ దర్శనం చేసుకోవడం జరిగినది.
ఆగస్టు 10: ఈ రోజు ఈ పెద్ద పాదాలు ఉన్న వ్యక్తి ఏవో మెట్లు ఎక్కి పైకి వెళుతున్నట్లుగా దర్శనం అయినది. ఎక్కడివో ఈ మెట్లు... ఈ ఘాట్ ఏమిటో నాకు తెలియ రాలేదు.
ఆగస్టు 11: ఈ రోజు గయ యాత్ర చేయడం జరిగినది. బుద్ధగయ లో బుద్ధుడు జ్ఞానము పొందిన బోధి వృక్షము చూడటము జరిగినది. అలాగే అక్కడ జప ధ్యానాలు చేస్తున్న లామాలు కనిపించారు. విచిత్రముగా అందరూ చూస్తుండగా ఈ రావి చెట్టు నుండి ఒక ఆకు నా నెత్తి మీద పడినది.అక్కడున్న లామాలు ఈ ఆకును పవిత్రముగా తాగుతూ బుద్ధ భగవాన్ అనుగ్రహం మీకు కలిగినదని అంటూ నన్ను దీవించారు. నాకు ఆశ్చర్యం , ఆనందం వేసింది. ఆ రావి ఆకు అక్కడ నుండి తెచ్చుకోవటం జరిగినది.
ఆగస్టు 12: ఈరోజు అయోధ్య యాత్ర చేయడం జరిగినది. శ్రీరాముడు నివసించిన ఇల్లు, సీతాదేవి ఉపయోగించిన వంట పాత్రలు, వారి దుస్తులు ఇలాంటివి చూడటం జరిగింది. అయోధ్య, వివాదాస్పద మసీదు ప్రాంతం కూడా చూడటం జరిగింది. అలాగే రాబోవు కాలం రామ మందిరం నిర్మాణ కట్టడాలు చెక్కుతున్న శిల్పాలు చూడటం జరిగినది.
ఆగస్టు 13: ఈరోజు నైమిశారణ్య యాత్ర చేయడం జరిగినది. లలితాదేవి దర్శనము, బ్రహ్మ చక్ర దర్శనము, రుద్ర వనము,సూత ముని ఆశ్రమం అక్కడే శ్రీ వేదవ్యాస భగవానుని అనుగ్రహ దర్శన ప్రాప్తి పొందడం జరిగినది.
ఆగస్టు 14: ఇలా తొమ్మిది రాత్రులు కాశీ నందు పూర్తి అయ్యేసరికి ఈరోజు వెనుతిరగడం జరిగినది.కానీ నాకు ధ్యానంనందు కనిపించిన ఆ పాదాలు ఎవరివో తెలుసుకోలేక పోయానని బాధ మాత్రం ఉన్నది.
సెప్టెంబర్ 10 : ఈ రోజు ఒక పుస్తకము నందు నాకు కాశీలో ధ్యానములో కనిపించిన పాదముద్రలు ఉన్న శ్రీ త్రైలింగ స్వామి చరిత్ర కథనం చదవటం జరిగింది. అంటే ఈయనే నాకు సద్గురువు అని నాకు అర్థం అయింది. ఎవరికైతే ఆజ్ఞా చక్రం జాగృతి, శుద్ధి ఆధీనం కోసం ఈ చక్ర క్షేత్రమైన కాశీ యాత్ర చేస్తారని తెలుసుకున్నాను.
నవంబర్ 20: ఈ రోజు మా అన్న తో కలిసి రెండవసారి కాశీ యాత్రకు బయలుదేరినాను. కాశీ కి చేరుకున్నాను.
నవంబర్ 21: ఈ రోజు నాకు ధ్యానం నందు పాదాలు కనిపించాయి. ఈసారి శ్రీత్రైలింగ స్వామి వారి మఠం దర్శనం చేసుకోవడం జరిగినది.
అక్టోబరు 19: మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మా శ్రీమతి తో కలిసి మూడవ సారి నలభై ఒక్క రోజుల పాటు కాశీలో ఉండే విధంగా కాశీయాత్ర చేయటం జరిగినది.
నవంబర్ 9: ఈరోజు శ్రీ త్రైలింగ స్వామి మఠం చేరుకున్నాను. నా గాయత్రి మంత్ర ధ్యానం చేసుకుంటున్న సమయంలో నా ధ్యానం నందు తిరిగి దుర్గాదేవి దర్శనాలు అవ్వటం మొదలైంది. నాలో దిగులు మొదలైంది. అంటే ఈమెను నేను ఇంకా దాటలేదని ఆవేదన నాలో మొదలైంది. చచ్చిపోవాలని ఒక విధమైన నిరాశ నిస్పృహ నన్ను ఆవరించింది. ఇంతలో శ్రీ స్వామివారు ఉన్న గదికి మా ఇద్దరిని లోపలికి పంపించినారు. అక్కడున్న చిన్నపాటి సమాధి లాంటి దాని మీద నా తల బాదుకోవడం ప్రారంభించాను. నుదుటికి గాయమైంది. రక్తం చిమ్మింది. దుర్గాదేవి సాక్షాత్కారం ఆగిపోయింది. ఆపై నా మనస్సు కాస్త ఆత్మయందు లీనమైనట్లుగా అనుభవం అవుతుండగా ఆత్మ కాస్త శ్రీ వేదవ్యాసుడిగా రూపాంతరం చెందేసరికి “పవనానందా! పరమహంస పవనానంద! లే లే! నేనే నీవు నీవే నేను” అనే మాటలు లీలగా వినిపిస్తుండేసరికి నాలో నాకే తెలియని మగత ఆవరించింది.సుమారు మూడు గంటల పైగా నేను మామూలు స్థితికి రాలేదు. అంటే నా ఆత్మ వేదవ్యాస అంశ అని నాకు అర్థం అయింది. ఈరోజు "పరమహంస పవనానంద" దీక్షా నామమును పొందటం జరిగినది.
నవంబర్ 11: కోడిగుడ్డు ఆకారం పరిమాణంలో దివ్య జ్యోతి ఈ రోజు నాకు ధ్యానము నందు కనిపించినది. నా సూక్ష్మ శరీరము నీలి వర్ణంలో కనిపించినది. గత జన్మల స్మృతులు స్పురణకి రావటం
మొదలైంది. వివిధ జంతు వృక్ష మానవ జన్మలు అనగా సుమారు 27 దాకా లీలగా కనిపించాయి. ఆ తర్వాత భవిష్యత్ జన్మలుగా మరో 27 దాకా కనిపించినాయి. సాధనలో విఫలమైతే భవిష్య జన్మలు ఉంటాయి అనే ఆలోచన రాగానే నాకు ధ్యానం భంగమైనది. అంటే నాకు "రుద్రగ్రంధి" విభేధనం అయినదని గ్రహించాను.
నవంబర్ 15: ఈ రోజు కాశీ యందు నా భవిష్యత్తు జన్మ అయిన... అమెరికాలోని లాస్ వేగాస్ లోని ఆర్కిటెక్చర్ జన్మ యొక్క తల్లిదండ్రులు నాతో పాటుగా వేద కాశి యాత్ర చేసినారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే గత రాత్రి ఈ ఇంగ్లీషు దొర దంపతులు నా రాబోవు జన్మకి నా కన్న తల్లిదండ్రులు అని కలలో కనిపించారు.
నవంబరు 25: నేను ఈరోజు ధ్యానములో 16 గంటలపాటు నిర్విఘ్నముగా ఉండిపోయాను. అంటే సవికల్ప సమాధి స్థితిని పొందినాను అని నాకు అర్థం అయింది.
డిసెంబర్ 5: ఈ రోజు నాకు సంపూర్తిగా దుర్గాదేవి దర్శనాలు ఆగిపోయాయని నేను ప్రకృతి మాత మాయను దాటినానని నాకు సవికల్ప సమాధి స్థితి కలిగినదని మా గురుదేవులు చెప్పడం జరిగినది. అలాగే ఒకసారి పంచభూత ధారణ ముద్రలు వేస్తే నాకు పంచభూతాలు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు,ఆకాశము ఆధీనమై ప్రకృతి నేను చెప్పినట్లుగా వింటుంది అని చెప్పటం జరిగినది. ఇలా ఈ చక్రము నందు పంచభూతాలు తన ఆధీనంలో ఉంచుకుని ఆజ్ఞాపించే స్థితికి సాధకుడు వస్తాడని అందుకే ఈ చక్రమును ఆజ్ఞాచక్రము అంటారని చెప్పటం జరిగినది. అసలు నిజంగానే పంచభూతాలు ఆధీనం అవుతాయా? అనే సందేహము నాలో మొదలైనది.
డిసెంబరు 25: ఈ ప్రకృతిలో నాకు చాలా బాగా ఇష్టమైనది ఏది? అలా అనుకోగానే స్పటిక శ్రీ చక్రం నా చేతిలో సృష్టించబడినది. పంచ భూత జయం జరిగింది కాబట్టి, ఇలా నాచే పదార్ధ సృష్టి జరిగిందని అర్ధమైంది.
No comments:
Post a Comment