🔱 అంతర్యామి 🔱
# మూడు దుఃఖాలు....
🍁మనిషికి దుఃఖం ఎందుకు కలుగుతుంది? దాన్ని నివారించే మార్గం ఏదైనా ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందుగా అసలు దుఃఖమంటే ఏంటో తెలియాలి. దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. తైత్తిరీయ ఉపనిషత్తులోని సాంఖ్య దర్శనంలో దీనికి సంబంధించి ప్రామాణిక వివరణ కనిపిస్తుంది. మనుషుల కలిగే దుఃఖాలు మూడు... ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. మనిషిలో రజోగుణ ప్రకోపం ఎక్కువైనప్పుడు కలిగే ఈ మూడింటికీ కాస్త పరిణామ భేదం ఉంటుంది తప్ప అన్నీ ఒక కోవకు చెందినవే.
🍁ఎవరికి వారుగా చిన్నపాటి ప్రయత్నంతో, సులభంగా దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చని సాంఖ్యశాస్త్రం చెబుతోంది. తమను తాము తరచి చూసుకోవడం ద్వారా, ఆలోచనలను సంస్కరించుకోవడం ద్వారా అది సాధ్యమేనంటోంది.
🍁ఆధ్యాత్మిక దుఃఖం... శారీరకం, మానసికం అని రెండు రకాలు. శారీరక అనారోగ్యం కారణంగా కలిగే దుఃఖం- వైద్యుణ్ని సరైన మందు తీసుకుంటే ఉపశమిస్తుంది. అరిషడ్వర్గాలవల్ల కలిగే దుఃఖం మానసికం. ఏ మనిషైనా ఫలానాది నాకు కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ స్థాయిని మర్చిపోయి అందని ద్రాక్షకోసం అర్రులు చాచకూడదు. తెల్లారేసరికల్లా అపర కుబేరుడిగా మారిపోవాలనుకోవడం అజ్ఞానం. కోటీశ్వరుడు కావాలనుకోవడం తప్పుకాదు. కానీ, దానికోసం శ్రమించకుండా అప్పనంగా సంపద ఒళ్లో పడాలనుకోవడం అవివేకం. ఇలాంటి అనుచితమైన కోరికలవల్ల మనసుకు దుఃఖం కలుగుతుంది. వీలైనంత ప్రశాంతం! ఉండాలి. మంచిగా ఆలోచించాలి. ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషించాలి. అరిషడ్వర్గాలవల్ల కలిగే దుఃఖానికి ఇవే తగిన ఔషధాలు.
🍁రెండో రకమైన దుఃఖం ఆది భౌతికం. ఇది మనుషులు, పాములు, తేళ్లు, సింహాలవంటి ప్రాణులవల్ల కలుగుతుంది. క్రూరమృగాలకు దూరంగా ఉండొచ్చు కానీ మనుషులకు దూరంగా ఎలా ఉండగలం! 'నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యు సుమతీ' అని శతకకారుడు చెప్పినట్టుగా చెడ్డవారికి దూరంగా ఉండాలి. మన గురించి చెడుగా ఆలోచించేవారు చాలామంది ఉండొచ్చు. అది వాళ్ల లోపం. వాళ్ల గురించి, వాళ్ల చర్యల గురించి పదే పదే ఆలోచించి, బాధపడటం ఎందుకు... అనే సత్యాన్ని తెలుసుకుంటే ఈ విధమైన దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. వివేచన అంటే అదే. ఈ నిజాన్ని తెలుసుకోలేకపోతే అవతలివాల్లు చేసే చేటుకంటే ఎవరికివారు చేసుకునే చేటే ఎక్కువ.
🍁మూడో రకమైన దుఃఖం ఆది దైవికం. ఇది యక్ష, రాక్షస, గ్రహావేశాలవల్ల కలిగే దుఃఖం. మన జీవితం మన చేతిలో ఉండాలి. మన ఉపాసన బలం మనకుండాలి. మంచి నడవడిక, నిర్మలమైన మనసు ఉంటే భగవంతుడి అండ ఎప్పటికీ ఉంటుంది. అవే నిర్మలమైన ఆనందానికి హేతువులు. ఈ నిజాన్ని తెలుసుకోవటమే దుఃఖనివారణకు సిసలైన మార్గం.🙏
✍️- మల్లాది వెంకట గోపాలకృష్ణ
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment