*ఆత్రేయగీత*
రెండవ భాగం
"పరావిద్య - అపరావిద్య" 6వ భాగము
శ్రీ శాస్త్రి ఆత్రేయ (ఆకుండి శ్రీనివాస శాస్త్రి)
ఈ విద్యలయొక్క అంతరార్ధాన్ని తెలుసుకోవాలంటే, ముందుగా జీవుడు తన దేహనిర్మాణం గురించి కొంత అవగాహన పొందాలి. దీన్ని ఓ కథారూపంలో తెలుసుకుందాము.
ఒకప్పుడు జీవుని శరీరంలో నున్న పంచభూతములు, ఇంద్రియములు కలిసి, “ఈ శరీరం ఇంత చైతన్యంగా,
ప్రకాశవంతంగా వుండటానికి కారణం మేమే! కనుక మేమే దేవతులమని భావించేయి. ఇది గ్రహించిన "ప్రాణం" వాటినుద్దేశించి, అసలు ఈ శరీరం నా వలనే నిలిచివుంది, నేనే ప్రాణాపాన రూపంలో దీనిని చైతన్యవంతంగా వుంచుతున్నాను, ఇదిగో చూడండని చెప్పి, శరీరాన్ని విడిచిపెట్టే ప్రయత్నంచేసింది. వెంటనే శరీరంలో పంచభూతాలు, ఇంద్రియాలు నిర్వీర్యమై ప్రాణంతో పాటూ పైకి పోవలసి వచ్చింది. వెంటనే అవి తేరుకొని ప్రాణముంటేనే తాము వుండగలనని తెలుసుకొని, ప్రాణాన్ని వుండమని బ్రతిమాలి, ప్రాణాన్ని ఈ విధంగా స్తుతించడం ప్రారంభించేయి - ఓ ప్రాణమా! నీవే జీవశక్తివి, నీవే ఈ శరీరంలో అగ్నిగా దహిస్తున్నావు, సూర్యుడిలా ప్రకాశిస్తున్నావు, వాయువు నీవే, పదార్ధం నీవే, స్థూలసూక్ష్మాలు నీవే, అమృతం నీవే, ఇంద్రుడవు నీవే, వేదాలు నీవే, జ్ఞానం నీవే, ధర్మాలు నీవే, నీవే గర్భములోనుండి జన్మిస్తావు, నీవే ప్రజాపతివి, మమ్మల్ని ధరించేది నీవే, దేవతలకు ఆహుతులను అందించేది నువ్వే, పితృదేవతలకు పిండమును అందించేది నువ్వే, నీవే
ఎళీళీషులయొక్క సదాచారము.
ఓ ప్రాణమా! నీవే ఇంద్రుడవు, రుద్రుడవు, అందరిని సంరక్షించేది కూడా నువ్వే, అన్ని వెలుగులకు మూలమైన వెలుగువి నువ్వే, జీవుల జ్ఞానేంద్రియములు నువ్వే, మనస్సు నువ్వే, నీ స్వరూపాన్ని మా యందు వుంచు! దయచేసి మమ్ము వీడి వెళ్ళవద్దు! మాకు ఐశ్వర్యమును, బుద్ధిని ప్రసాదింపుము అని స్తుతించేయి.
అయితే ఈ ప్రాణం ఎలా పుట్టింది? శరీరంలో ఎట్లు ప్రవేశిస్తుంది? ఇంద్రియాలు, మనస్సును ఎట్లు ధరిస్తున్నది? ఎట్లు శరీరాన్ని విడచి బయటకు పోతున్నది? అన్న సందేహం మనకు కలుగుతుంది. దీనికి సమాధానం మనకు ఉపనిషత్తులలో లభిస్తుంది.
ఆత్మ ద్వారా ప్రాణం ఏర్పడుతుంది, అది మనస్సు ద్వారా జీవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరం యొక్క నీడవలే ప్రాణం, ఆత్మను అంటిపెట్టుకొని వుంటుంది. ఎలాగైతే దేశాన్ని ఏలే చక్రవర్తి, కొన్ని ప్రాంతాలను పాలించడానికి కొంతమంది అధికారులను నియమించి, తాను మాత్రం సర్వాధికారిగా వుంటాడో అలాగే ప్రాణం కూడా శరీరంలో కొన్ని విభాగాలను ఏర్పరచి, తానే అన్నింటికీ సర్వాధికారిగా వుంటుంది.
ఈ ప్రాణం ఐదు రకాల వాయువుల రూపంలో శరీరమంతా నెలకొనివుంటుంది. శరీర మలమూత్ర ద్వారాలలో అపానవాయువుగా, జ్ఞానేంద్రియములలో
ప్రాణవాయువుగా, ప్రాణ, అపాన వాయువుల నడుమ సమానవాయువుగా వుంటుంది. ఈ సమానవాయువు, దేహంలోనున్న అన్ని భాగాలకు అన్నసారాన్ని(శక్తిని) అందిస్తుంది. అన్నసారా శక్తితో ఆయా అవయములు చైతన్యమును పొంది, వాటి పనులను అవి నిర్వర్తిస్తుంటాయి.
ఇక ఆత్మ జీవుని హృదయంలో నెలకొనివుంటుంది. ఈ హృదయంలో 101 నాడులుంటాయి, ప్రతి నాడిలో మళ్ళీ 100 లఘునాడులుంటాయి. ప్రతీ లఘునాడిలో మళ్ళీ 72000 ఉపనాడులుంటాయి. వీటన్నింటిలో సంచరించే వాయువును వ్యాన మంటారు. ఈ నాడులలో ఎంతో ముఖ్యమైనది సుషుమ్ననాడి. అక్కడ ఉదానవాయువు వుంటుంది. ఈ వాయవే జీవుని యొక్క కర్మననుసరించి ఊర్ధ్వ, అధో, మనుష్య లోకాలకు తీసుకొనిపోతుంది.
ఇక ఈ ప్రపంచానికి సంబంధించి సూర్యుడు ప్రాణము, భూమి అపానవాయువు, ఈ రెండింటి మధ్యనున్న ఆకాశము సమానవాయువు, భూమిని ఆక్రమించియున్న వాయువే వ్యానము. అగ్నియే (జఠరాగ్ని) ఉదానము, ఈ అగ్ని ఆరిపోయినప్పుడు జీవుని శరీరంలోయున్న అన్ని ఇంద్రియాలు ప్రాణంలోను, ప్రాణము మనస్సులోను కలసిపోవును. ఈ స్థితిలో మనస్సులో కలిగే సంకల్పమును అనుసరించి జీవునికి పునర్జన్మ సంభవిస్తుంది.
ఆత్మకు నీడలా ప్రాణం వుంటుంది కాబట్టీ, ప్రాణవిభూతే ఆత్మవిభూతి, అదే పరమాత్మ విభూతి.
తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము.
No comments:
Post a Comment