Saturday, October 26, 2024

🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
కుండలినీ సిద్ధ మహా యోగ పథంలో వివిధ అవస్థలు - ఆరంభ అవస్థ, ఘటావస్థ, పరిచయావస్థ, నిష్పత్తి అవస్థలు...


📚🖊️ భట్టాచార్య



ఆరంభ అవస్థ : 

...కుండలినీ సిద్ధ మహా యోగ పథంలో ఆరంభ అవస్థ అంటే, ప్రారంభ స్థితి. ఈ ప్రారంభ దశలో, కుండలినీ శక్తి, భౌతిక కదలికలతోనూ, భౌతిక సంచలనాలతోనూ కూడి యుంటుంది. ఈ పథంలో ఒక సాధకుడు అసంకల్పిత అనుభవాలను, అనుభూతులను, అనుభవం చెందుతాడు. ఇందులో అసంకల్పిత యోగాసనాలు, యోగ బంధాలు, అసంకల్పిత ప్రాణాయామ క్రియలు, కొన్ని సార్లు అసంకల్పితంగా...సమాధి స్థితిలోకి కూడా సాధకుడు ప్రవేశిస్తాడు. ఇదంతా ఎందుకంటే, శరీరంలో గల కుండలినీ శక్తి ప్రవాహ మార్గాలలో, అడ్లు తొలగే పరిస్థితి వస్తుంది...ఈ అసంకల్పిత క్రియల ద్వారా...బంధాలు,ఆసనాలు, ప్రాణాయామ క్రియలు , శరీరాన్ని తేలిక పరుస్తాయి. 

...ఈ స్థితులలో ఒక్కోసారి సాధకునికి కుండలినీ శక్తి అనుభవం కలుగుతుంది. కుండలినీ అనుభవం జరిగింది అని చెప్పడానికి ఈ క్రింది అనుభవాలలో కొన్ని గాని, అన్నీ గానీ, ఈ వ్యాసంలో చెప్పబడని అనుభవాలు గాని, అనుభవానికి రావచ్చు. మూలాధార చక్రం వద్ద దడ దడలాడడం, గుద్ గుద్ అనే స్పందనల అనుభవం కలగడం, కుండలినీ శక్తి అనే ప్రాణ శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు కదలికలు జరపడం, ఆయా శరీర భాగాలలో ప్రాణ శక్తి కదలికలు జరగడం, కొన్ని సార్లు చెప్పలేని తన్మయత్వానికి సాధకుడు లోను కావడం...ఇవన్నీ కుండలినీ శక్తి అనుభవానికి సూచన. కుండలినీ శక్తి జాగరణలో దివ్య దృష్టి, దివ్య శ్రవణం, దివ్య ఘ్రాణం, దివ్యమైన రుచుల ఆస్వాదన, దివ్యమైన స్పర్శ...ఇవన్నీ అనుభవానికి రావచ్చును. కొన్ని సార్లు భ్రూమధ్యంలో, తేలిక పాటి వత్తిడి నుండి హెచ్చు మోతాదు వత్తిడి వరకు రావచ్చును. (Heaviness). శరీరం అకస్మాత్తుగా ధ్యానావస్థలోకి వెళిపోవడం కూడా జరగవచ్చు. కుండలినీ శక్తి జాగరణ జరుగుతున్నంత సేపు, సాధకుడు తెలియని గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కొన్ని సార్లు సాధకుడు, దివ్యమైన మత్తును కూడా అనుభవిస్తాడు.

ఘటావస్థ : కుండలినీ సిద్ధ మహా యోగ పథంలో...మొదటి దశతో మేళనమై యుండే రెండవ దశయే "ఘటావస్థ". సాధకుడు ఈ దశలో, ప్రాపంచిక వాంఛలపై ఆసక్తి కోల్పోతాడు. పాంచభౌతిక విషయాలపై అనాసక్తి ప్రదర్శిస్తాడు. అంటే సంసార జగత్తుపై వ్యామోహం క్రమంగా నశిస్తుంది. ఆ యోగ భగవానుడు, ఈ భౌతిక ప్రపంచంలో వశిస్తున్నప్పటికీ, భౌతిక విషయాల పట్ల నిస్సంగాన్ని కలిగియుంటాడు. వైరాగ్యాన్ని కలిగి యుంటాడు.

...ఆ యోగి, భౌతిక ప్రపంచానికి ఎంత దూరమౌతుంటాడో...కుండలినీ శక్తితో అంత మమేకం అవుతుంటాడు. అప్పుడు ఆ యోగి తాను చూసే ప్రతి దానిలోనూ, వాసన చూసే ప్రతి వస్తువులోనూ, స్పర్శ పొందే ప్రతి దాని యందు...దివ్యత్వాన్నే అనుభూతి చెందుతాడు. ఆ యోగి తాను పీల్చే ప్రతి శ్వాస లోనూ ప్రాణ శక్తిని అనుభవం చెందుతాడు. తాను రుచి చూసే ప్రతి పదార్ధంలోనూ, ప్రాణ శక్తిని అనుభవం చెందుతాడు. ఏదైతే ఆ యోగ భగవానుడు వింటుంటాడో...ప్రాణ శక్తినే వింటాడు. ప్రాణ శక్తి యొక్క అభివ్యక్తీకరణ గానే, ఈ పాంచ భౌతిక ప్రపంచాన్ని చూస్తాడు.

...ఈ రెండవ స్థితి అయిన ఘటావస్థలో, యోగి నిరంతర ధ్యానాన్ని అభిలషిస్తాడు.
 ...ఈ రెండవ స్థాయి అయిన ఘటావస్థలో, మొదటి దశలో ఉన్నన్ని క్రియలు ఉండకపోవచ్చును. ఆ యోగ భగవానుడు సర్వ కాల సర్వావస్థలలో తనలోనూ, బహిరంగంగానూ... ప్రాణ శక్తులనే చూస్తాడు. 

...ఈ స్థితిలో కుండలినీ శక్తి, సహస్రారం వైపు తన ప్రయాణం సుగమం చేసుకుంటుంది.

పరిచయావస్థ : రెండవ అవస్థలో, కుండలినీ శక్తి సాధకునిలో స్వేచ్ఛగా, ఆటంకాలు లేకుండా సంచారం చేస్తుంది. మూడవ దశలో ఈ స్వేచ్ఛ మరింత పరిణతి పొంది, సహస్రార చక్రం లో గల సదా శివునితో మేళనం అవుతుంది. ఫలితంగా , కుండలినీ శక్తి శుద్ధ చైతన్య రూపమైన సదా శివునితో మేళనం అవుతుంది. ఫలితంగా యోగ భగవానుడు, పరమ ప్రశాంత స్థితిని అనుభవిస్తాడు. చరాచర విశ్వం పట్ల, ఇతః పూర్వం ఉన్న అవగాహన మారి...ఈ చరాచర విశ్వమంతా...ప్రాణ శక్తుల వ్యాపారంగా, ప్రాణ శక్తుల అభివ్యక్తీకరణగా గ్రహిస్తాడు. అట్టి యోగి తనలో అందరినీ, అందరిలోనూ తనను గుర్తిస్తాడు. 

...ఈ మూడవ స్థితిలో, యోగి ఈ స్థావర జంగమాత్మక విశ్వాన్ని, ప్రాణ శక్తుల అభివ్యక్తీకరణగా చూస్తాడు. మరియూ వాటిపై తన స్వామిత్వాన్ని స్థిర పరచుకుంటాడు. ప్రాణాది శక్తులపై, ప్రకృతి శక్తులపై స్వామిత్వాన్ని సాధిస్తాడు కూడా. ఈ స్థితిలో తన అనేక జన్మల నుండి వస్తున్న కర్మలను దగ్దం చేసుకునే శక్తిని కలిగియుంటాడు. పునర్జన్మ లేకుండా సిద్ధిని పొందుతాడు. ఈ మూడవ స్థితిలోనే అతను ఒక సిద్ధ పురుషుడుగా రూపు దాల్చుతాడు. అణిమాది అష్ట సిద్ధులు అతనిని వరిస్తాయి. ఇతరులలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని చైతన్యం చేయగల సిద్ధత్వాన్ని పొంది ఉంటాడు కూడా...ఈ స్థితిలో ఒకానొక సమయంలో ఆ యోగ భగవానుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఇంకనూ అతను శరీరంతో ఉంటే, అతను జీవన్ముక్తుడుగా ఉంటాడు. అప్పుడతను నిజమైన యోగి. ఈ స్థితిలో అట్టి ముక్తులు, ఇతరుల ముక్తి కోసం ప్రయత్నిస్తారు.


నిష్పత్తి అవస్థ :

...ఈ చివరి దశయైన, నిష్పత్తి అవస్థలో...యోగి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉండి, జనన-మరణ చక్ర దశలను కూడా దాటి ఉంటాడు. అతను సంకల్ప మాత్రం చేత నిర్వికల్ప సమాధి అవస్థను పొందుతాడు. ఆ సమాధిలో ఆ యోగ భగవానుడు, సత్-చిత్-ఆనంద స్వరూపాన్ని పొందుతాడు కూడా...

...ఈ స్థితిలో ఆ యోగిని, శీతోష్ణ, సుఖ-దుఃఖాలు బాధించవు.

 ...ఆ మహితాత్ముడైన యోగి యొక్క వ్యష్టి  చైతన్యం, భౌతిక విషయాలలో నర్తించదు. ప్రాణ శక్తులలో చరిస్తూ ఉంటుంది. ఆ యోగి ఎప్పుడు, తన పాంచ భౌతిక దేహాన్ని విడిచి పెట్టాలనుకుంటాడో, అతని వ్యష్టి చైతన్యం...విశ్వ చైతన్యంలో లీనమౌతుంది. అతనికి పునర్జన్మ ఆవశ్యకత ఉండదు.

... ఇదే దైవత్వ సాధన. ఇదే దివ్య చైతన్యం. ఇదే నిర్వాణం. ఇదే సత్-చిత్-ఆనందం. ఈ స్థితియే శుద్ధ చైతన్య స్థితి. ఇదే మోక్షం. ఇదే అత్యున్నత చేతనా స్థితి. ఈ స్థితియే, ఉన్నతుడైన సిద్ధ యోగికి, పరమానందాన్ని ఇచ్చే స్థితి.

 ...ప్రతి ఒక్క సాధకునికీ ఆదర్శవంతమైన అవస్థ..."సిద్ధావస్థ". దీనిని మోక్ష స్థితి అని కూడా అంటారు. ఈ అవస్థకు చేరుకోవడం వలన, సాధకుడు...జనన - మరణ చక్రం నుండి బయటపడతాడు. ఒక యోగి, ఆత్మ సాక్షాత్కారము అనే స్థితిని పొందియుండడం వలన, ఆ యోగికి మిగిలేదేమీ ఉండదు. పరిణామ క్రమంలో చివరి మెట్ల మీద ఉండే స్థాయి అది. అట్టి యోగి, కర్మల చట్రం నుండి, జనన మరణ చక్రం నుండి కూడా బయట పడి ఉంటాడు.            *

No comments:

Post a Comment