Saturday, October 26, 2024

 *ఆత్రేయగీత*

రెండవ భాగం

“పరావిద్య - అపరావిద్య" - 7వ భాగము.

శ్రీ శాస్త్రి ఆత్రేయ 

నిద్రించే సమయంలో జీవుని ఇంద్రియాలన్నీ అతని మనస్సులో విలీనమౌతాయి, మెలుకువ వచ్చినప్పుడు మరల వికసిస్తాయి. ఈ నిద్రావస్థలో జీవుని ఇంద్రియములు తాత్కాలికంగా అచేతనములైనప్పటికీ, శరీరంలో ప్రాణములనే అగ్నులు మాత్రం మేలుకొనేవుంటాయి.

ఈ స్థితిలో మనస్సు తన సంస్కారాలను అనుభవిస్తుంది. దీనినే స్వప్నావస్థ అని అంటారు. జాగ్రదావస్థలో మనస్సు ఏయే విషయాలను గ్రహిస్తుందో, వాటితో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని, దానిని స్వప్నావస్థలో అనుభవిస్తుంది మనస్సు.

ఆపిదప మనస్సు ఒక తేజస్సుచే ఆవహింపబడి, స్వప్నావస్థను దాటి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. దీనినే సుషుప్తి స్థితి (గాఢనిద్ర) అంటాము. అంటే ఎటువంటి విషయాల జోలికి పోకుండా మనస్సు తానే స్వయంగా ప్రకాశిస్తూ వుంటుంది. ఈ స్థితిలో ఇంద్రియాలు, మనస్సు జీవాత్మలో ఏకమౌతాయి.

ఇక్కడ ప్రాణప్రక్రియను యజ్ఞముగా చెప్తూ, మనస్సును యజ్ఞకర్తగా (యజమానిగా) పేర్కొంటూ, ప్రతిరోజూ ఈ యజ్ఞమే, యజమానిని పరమాత్మ (సుషుప్తి) వద్దకు తీసుకొని పోతుందని ఎంతో శాస్త్రీయంగా చెప్పడం జరిగింది.

ఈ మహోన్నత స్థితిలో ఒక్క “జీవచైతన్యం” మాత్రమే మిగిలివుంటుంది. మిగతావేవీ అనుభవంలోకి రావు. ఆ అవస్థలో జీవాత్మ పరమాత్మలో ప్రతిష్టింపబడతాడు.

ఇదే “అద్వైత" స్థితి, “అయమాత్మాబ్రహ్మ స్థితి, “సర్వం ఖల్విదం బ్రహ్మ" స్థితి. ఈ స్థితిని పొందడానికి "ఓంకార” మంత్రాన్ని అందించేరు ఋషులు.

బ్రహ్మము రెండు రకాలుగా వ్యక్తమౌతోంది. ఒకటి పరము, రెండవది అపరము. పరము అంటే నిర్గుణ, నిరాకార, నిరంజన తత్వాలతో కూడిన బ్రహ్మము. ఇది సచ్చిదానంద స్వరూపంగా వ్యక్తమౌతోంది. అపరము అంటే సగుణ, సాకారాలతో (గుణ, రూపాలతో) వ్యక్తమయ్యే బ్రహ్మము. ఓంకారాన్ని, జీవుడు ఏ రీతిలో ధ్యానిస్తాడో ఆ రీతిలో ఈ రెండింటిలో ఏదో ఒక స్థితిని పొందుతాడు.

ఓంకారంలో "అకార, ఉకార, మకార (అ + ఉ + మ)” అనే మూడు మాత్రలున్నాయి. వీటిలో మొదటి ఒక మాత్రను (అ కారాన్ని) జీవితాంతము ధ్యానించువాడు మానవునిగా జన్మించి బ్రహ్మచర్యము, శ్రద్ధ, తపస్సు ఆచరించి మహిమను
పొందుతాడు.

మొదటి రెండు మాత్రలను అ కార, ఉ కారాలను (అ + ఉ) కలిపి జీవితాంతము ధ్యానించువాడు, యజస్సుల ద్వారా ఉత్తమ లోకాన్ని పొంది, కొంత సుఖమును అనుభవించి తిరిగి మానవలోకంలో జన్మిస్తాడు.

మొత్తం మూడు మాత్రలను కలిపి “ఓమ్” అనే ప్రణవాన్ని జీవితాంతం ధ్యానించువాడు, పాము తన పొరలను విడిచిపెట్టునట్లు, తన పాపములన్నింటిని విడిచిపెట్టి, సామముల ద్వారా బ్రహ్మమును పొంది, తనలో నెలకొన్న పరమాత్మను గ్రహిస్తాడు. ఆ జీవునికి మరుజన్మ వుండదు.

ఓంకారాన్ని విడివిడిగా కాకుండా, ఒకే పదంగా జాగృత్, స్వప్న, సుషుప్త అవస్థలలో నిర్విరామంగా ఉపాసించువాడు స్థితప్రజ్ఞుడవుతాడు. సులువుగా చెప్పాలంటే ఆ మూడు అక్షరముల తత్వాన్ని (సృష్టి, స్థితి, లయ తత్వాన్ని) గ్రహించి, తదనుగుణంగా సాధన చేయువాడు ఆత్మానుభూతిని పొందుతాడని అర్ధము.
 *

No comments:

Post a Comment