*ధనం మూలమిదం జగత్?*
```
డబ్బు నేటి ప్రపంచాన్ని శాసిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాని అది ఉన్న ప్రతిఒక్కరూ ప్రశాంతంగా జీవిస్తున్నారా అంటే.. అయ్యుండొచ్చు అనిపిస్తుంది.
కౌటిల్యుడు(చాణక్యుడు) తన అర్థ శాస్త్రంలో ‘ధనం మూలం ఇదం జగత్’ అనే మాటను వినియోగించారు. కాని దాని అర్థం నేడు మనం ఉపయోగిస్తున్న ప్రామిసరీనోట్లు(డబ్బు) కాదు.
ఒకప్పుడు ధనం అంటే బంగారం, వెండి, వజ్రవైఢూర్యాలు. నేటికి స్టాక్ మార్కెట్లో వాటిదే రాజ్యం. ఎందుకంటే అవి శాశ్వతంగా నిలిచి ఉండేవి.
కానీ ప్రామిసరీ నోట్లు కాలిస్తే బూడిదవుతాయి. తడిస్తే ముద్ద అవుతాయి. ఏదో ఒకరోజు కనుమరుగు అవుతాయి.
కౌటిల్యుడి ఉద్దేశం ప్రపంచమంతటా వ్యవస్థ నడవడానికి ధనం కావాలి. ఆ ధనమే బంగారం. ఏ దేశంలో ఎంత ఎక్కువ బంగారం ఉంటే ఆ దేశం అంత ధనిక దేశం.
బంగారానికి అనుగుణంగా ప్రామిసరీ నోట్లను ప్రచురిస్తారు. ఇది ఆర్థికవేత్తలు చెప్పే మాట. సాధారణ ప్రజలకు అవగాహన తక్కువే ఉంటుంది.
బంగారం విలువ ఎన్నటికీ తరగనిది. పెరగడమే తప్ప తగ్గడం తెలియదు.
అలా అని మనం బంగారం తినలేము. వ్యవసాయమే ఆధారం. ఆ వ్యవసాయం వ్యాపారం అయ్యిందనేది బాధాకరమైన విషయం.
కానీ ఆ బంగారం కారణంగా మన దగ్గర ప్రామీసరి నోట్లు(డబ్బు) నేడు వ్యవసాయాన్ని శాసిస్తున్నాయి. ఆహార పంటల నుంచి వాణిజ్య పంటల వరకు డబ్బే అవసరమవుతుంది.
అంటే డబ్బు అవసరంగా మారింది. అది కాదనలేని విషయం. డబ్బు కావాలి. ఎలాంటి డబ్బు కావాలి అనే దానికి కూడా మన పెద్దలు స్పష్టమైన సూచనలు చేశారు.
మనం చూస్తూనే ఉన్నాం అన్యాయంగా ఎంత సంపాదించినా హాస్పిటళ్లకు తిరిగేవారు ఎక్కువ. న్యాయంగా నాలుగు రాళ్లు వెనకేసుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటున్నాడు.
ఒక్కసారి డబ్బును సంపాదిస్తే డబ్బే డబ్బును సంపాదిస్తుందనే మాటలు ఏదో సినిమాలో చెప్పారు. కానీ మనం అన్యాయంగా సంపాదించే డబ్బు మనకు ప్రశాంతతను దూరం చేస్తుందని మరువద్దు.
భారతీయులు ఎంత సంపాదించినా దానధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ చింతనకే వినియోగిస్తారు. అందుకే మన పూర్వీకులు ఆనందంగా ఉండేవారు.
కానీ ‘ధనం మూలం ఇదం జగత్’ అనే మాటను మనలో చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. డబ్బుంటేనే అన్ని అనే విధంగా భావిస్తున్నారు.
డబ్బు అవసరం నుంచి వ్యసనంగా మారుతోంది. బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, స్నేహం, కుటుంబం అన్ని డబ్బు ఆధారంగానే సాగుతున్నాయి.
ప్రజల్లో స్వార్థం వెర్రి తలలు వేస్తోంది. అది సమాజ విచ్ఛిన్నం, వినాశనం వైపు వడివడిగా తీసుకెళ్తోంది.
వ్యక్తిత్వానికి, నైతికతకు, నిజాయితీకి, ఆత్మగౌరవానికి కాలం కాకుండా అవుతుంది.
అనైతిక విధానాల్లో సంపాదన కారణంగా.. అర్థాంతరంగా లేదా అనారోగ్యంతో ముగుస్తున్న జీవితాలు ఎక్కువ అవుతున్నాయి.
దారి తప్పిన సంపాదన విధానం డబ్బుతో పాటు కొత్త సమస్యలను తీసుకొస్తుంది.
కాబట్టి డబ్బు సంపాదించాలి.. కానీ ధర్మబద్ధంగా సంపాదించాలి.
సమాజం నుంచి మనం పొందిన దానిలో కొంత అదే సమాజహితానికి కేటాయించాలి.
మన పూర్వీకుల బాటలో మనం కూడా నడవాలి. న్యాయంగా సంపాదించిన సొమ్ము ద్వారా చేసే సేవ ఇతరులకు కూడా మేలు చేస్తుందని గుర్తుంచుకోవాలి.
కష్టే ఫలి అని చెప్పిన పెద్దల మాటలను నెమరువేసుకుంటూ డబ్బు అనే అవసరాన్ని నిజాయితీగా తీర్చుకోవాలి. ‘శ్రమయేవ జయతే’ అనుకుంటూ ధనాన్ని పోగు చేసుకోవాలి.
ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని ఆనందంగా గడపాలి.```.
No comments:
Post a Comment