Tuesday, November 5, 2024

 #తెలుగువారి_ఇంటిపేర్లలో_భోజనపదార్థాలు - 1 

#ఇంటిపేర్లు 

ఒకప్పుడు దాదాపుగా దక్షిణ భారత దేశం అంతటా  ప్రతివారూ  తమ పేరు ( Given Name) కు  ముందు తండ్రి లేక తల్లి  పేరును తప్పక రాసుకునేవారు. తండ్రి / తల్లి పేరే తప్ప అప్పట్లో ప్రత్యేకంగా  ఇంటిపేరు (Surname) అంటూ ఎవరికీ  ఉండేది కాదు. ఈ పద్ధతి ఒకప్పుడు తెలుగువారు కూడా పాటించేవారు. ప్రాచీన సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయలును నరసింహ కృష్ణరాయలు అనీ, తెనాలి రామకృష్ణుడిని రామయ రామకృష్ణుడు అనీ అనటం వారి తండ్రులైన నరసింహ నాయకుడు (తుళువ నరసనాయకుడు), గార్లపాటి ( గార్లపాడు గ్రామానికి చెందిన )  రామయ్యల కారణంగానే. అంతకు పూర్వం తెలుగు శాతవాహనులలో తమ తల్లుల పేర్లు తమ పేర్లకు ముందు చేర్చుకున్న  గౌతమీ పుత్ర శాతకర్ణి, వాసిష్టీ పుత్ర పులోమావి వంటి వారి గురించి కూడా మనకు తెలుసు. మల్లన అనే పేరుతో ఇద్దరు ఉన్నప్పుడు పృథకత్వం (వేరుగా గుర్తించటం) కోసం వారిలో ఒకరిని మాదయ్యగారి మల్లన అంటూ ఆయన పేరుకు ముందు ఆయన తండ్రిపేరును  కూడా చేర్చటం పరిపాటి అయింది. మరింత ప్రత్యేక గుర్తింపు కోసం అవసరమైతే ఒక్కొక్కసారి తల్లి / తండ్రిపేరుతో పాటు ఆ వ్యక్తిది ఏ ఊరో ఆ ఊరు పేరును కూడా చేర్చటం మొదలైంది.అలా తెలుగువారి ఇంటిపేర్లలో ఊళ్ళ పేర్లు ప్రవేశించి క్రమంగా తల్లిదండ్రుల పేర్లు తప్పుకున్నాయి. కానీ ఇలా తండ్రి పేరునే ఇంటిపేరుగా రాసుకోవటం తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో నేటికీ కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కీ.శే. ఎంజీ రామచంద్రన్ 
( MGR) కి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. నేటి కేరళలోని పాలక్కాడ్ (పాలఘాట్) కు చెందిన నాయర్ కులస్థుడైన గోపాలన్ మీనన్ అనే ఆయన ఎంజీఆర్ తండ్రి. అయితే గోపాలన్ మీనన్ లు పలువురు ఉన్న కారణంగానేనేమో  మరుదూర్ నుంచి వచ్చిన ఈ గోపాలన్ మీనన్ ని ఆయన ఊరు పేరు తగిలించి మరుదూర్ గోపాలన్  మీనన్ అన్నారు. ఆయన కుమారుడు రామచంద్రన్ అలా తన తండ్రిపేరు ముందు చేర్చుకుని మరుదూర్ గోపాలన్ మీనన్ రామచంద్రన్ ( M.G. రామచంద్రన్ ) అయ్యారన్నమాట. అలాగే  మూలంలో కన్నడిగురాలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిణి, ‘ పురచ్చి తలైవి’ గా పేరొందిన  కీ.శే.జయలలిత తన పేరుకు ముందు తండ్రి జయరామన్ పేరును చేర్చుకుని జయరామన్ జయలలిత ( J. జయలలిత) అయ్యారు. ఆమె స్థాపించిన టీవీ ఛానెల్ కి  జె. జె. ( జయరామన్ జయలలిత - J. J.) TV అంటూ ఆమె పేరే పెట్టారు. విఖ్యాత కన్నడ నటుడు, ‘కన్నడ కంఠీరవ’ గా పేరొందిన  రాజ్  కుమార్ పూర్తి  పేరు సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజ్.ఆయన అసలుపేరు ముత్తురాజ్ కాగా తండ్రిపేరు పుట్టస్వామయ్య. ఆయన తండ్రి పుట్టస్వామయ్య తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలోని సింగనల్లూరు నుంచి ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో ఉన్న దొడ్డ గాజనూర్ అనే గ్రామానికి వలస రావటం  కారణంగా ఆయన్ని అక్కడ అందరూ సింగనల్లూర్ పుట్టస్వామయ్య అనేవారు. రాజ్ కుమార్ పుట్టింది దొడ్డ గాజనూర్ గ్రామంలోనే. తమిళనాడుకు చెందిన విశ్రాంత టెన్నిస్ క్రీడాకారుడు రామనాథన్ కృష్ణన్ పేరు సుప్రసిద్ధం. ఆయన పేరు కృష్ణన్. తండ్రిపేరు రామనాథన్. 

కొన్ని తెలుగు కుటుంబాలలో  తండ్రి పేరు లేక వంశ మూల పురుషుడి పేరు ఇంటి పేరుగా  ఇప్పటికీ కూడా కొనసాగుతున్న ఉదాహరణలూ ఉన్నాయి. ఒక వీరప్ప నాయకుని కుమారులైన  రామినాయకుడు, మాచినాయకుడు తమ తండ్రి పేరు తమ పేర్లకు ముందు చేర్చుకుని మొదట వీరప్పనాయకుని రామినాయకుడు, వీరప్పనాయకుని మాచినాయకుడుగా వ్యవహరించబడ్డారు. నాయకుడు శబ్దం 
‘ నాయడు’ అయినట్లే ‘నాయకుని’ అనే  శబ్దం కాలక్రమంలో ‘నాయని’  గానూ, అదే ఆ తరువాత ‘నేని’  గానూ రూపాంతరం చెంది,  వారు వీరప్ప నేని (వీరపనేని) రామినాయకుడు, వీరపనేని మాచినాయకుడు  గానూ వ్యవహరించబడి క్రమంగా ‘వీరపనేని’ శబ్దమే  వారి ఇంటిపేరు అయిపోయింది. ఇదే పద్ధతిలో రామినేని, మాచినేని వంటి ఇండ్లపేర్లూ ఏర్పడ్డాయి. రామయ్య నాయకుడిని  రామినాయకుడనీ, రామి నాయడనీ పిలిచినట్లే కామయ్య నాయకుడిని కామినాయకుడనీ, కామినాయడనీ వ్యవహరించిన కారణంగా తెలుగువారిలో ‘ కామినేని ‘ అనే ఇంటిపేరు ఏర్పడింది. తెలుగువారిలో కమ్మ, వెలమ, గౌడ కులాల వారిలో కామినేని అనే ఇంటిపేరు నాకు తగిలింది.   తెలుగువారు కూడా ఒకప్పుడు తమ పేర్లకు ముందు తమ తండ్రి పేరును  లేక వంశ మూలపురుషుడి పేరును  ఉంచుకున్నారనడానికీ, అదే క్రమంగా వారి ఇంటిపేరు అయిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రెడ్డప్పగారి రాజగోపాలరెడ్డి, కిచ్చన్నగారి వెంకటరెడ్డి, లచ్చన్నగారి కిషన్ రెడ్డి  వంటి పేర్లు కూడా ఇందుకు ఉదాహరణలే. 

ఇంటి పేర్లలో భోజన పదార్థాలు 
తెలుగువారి ఇంటిపేర్లలో ఊరిపేరు మీదుగా, తండ్రిపేరు లేక మూలపురుషుడి పేరు మీదుగా ఏర్పడినవే కాక పలు భోజన పదార్థాలు, ఇతర భోజన సంబంధమైన వస్తువుల
మీదుగా ఏర్పడ్డవి కూడా ఎన్నో ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

బ్రాహ్మణులలో పుల్లెల అనే ఇంటిపేరు ఉంది. పుల్లెలు అంటే విస్తళ్ళు  వైదిక బ్రాహ్మణులలో పుల్లెల, పచ్చళ్ళ అనే ఇండ్లపేర్లు ఉన్నాయి. విఖ్యాత సంస్కృత పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు సాహిత్యాభిమానులకు చిరపరిచితులు.  నిత్యాగ్నిహోత్రులు ఏ పనీ అగ్నిహోత్రం చేయకుండా మొదలుపెట్టరు. పైపెచ్చు ఆహార పచనానికి అగ్నిహోత్రం తప్పనిసరి. అగ్నిహోత్రం అనేది తెలుగువారిలో వైదిక, వైఖానస బ్రాహ్మణులలో కనిపించే ఇంటిపేరు. 

పప్పు అనే ఇంటిపేరు బ్రాహ్మణులలో కనిపిస్తుంది. నేతి అనే ఇంటిపేరు కూడా వైదిక బ్రాహ్మణులలో ఉంది. అయితే నేతి అనే  ఇంటిపేరు పప్పన్నంలో వేసి కలుపుకునే నెయ్యిని బట్టి  రాలేదని నా అభిప్రాయం.
 ‘ న్యాయ శాస్త్రము’ అని కూడా పిలువబడే భారతీయ తర్కశాస్త్రం ( Indian Logic) లో సత్య సాధనకు వ్యాప్తి గ్రాహక తర్కం ( Inductive Logic),  నిగమన తర్కం ( Deductive Logic) అనే రెండు పద్ధతులున్నాయి. నిగమన తార్కికులు నేతి న్యాయాన్ని అనుసరిస్తారు. నేతి ( న + ఇతి ) అంటే ‘ఇది కాదు’ అని అర్థం. వారు ‘నేతి .నేతి’ అంటూ -  అంటే ‘ ఇది కాదు’..‘ఇది కాదు ‘ అంటూ నిగమన తర్క పద్ధతిలో - సత్యమైనది  కాని ఒక్కొక్క అంశాన్నీ  వర్జిస్తూ,  సత్యసాధన దిశగా ముందుకుసాగి అంతిమంగా సత్యాన్నీ,  వివేక  జ్ఞానాన్నీ సాధిస్తారు. భారతీయ తర్కశాస్త్రంలో దీనిని ‘ నేతి న్యాయం’ అంటారు.వైదిక  బ్రాహ్మణులలోని  వైయాకరణులకు ‘వ్యాకరణం’ అనే ఇంటిపేరు, మౌహూర్తికులకు ‘ఘడియారం” అనే ఇంటిపేరు  ఏర్పడినట్లే నైయాయికుల( Logicians) లోని నిగమన తార్కికులకు వారు ఉపయోగించే  ‘నేతి న్యాయం’  కారణంగా నేతి అనే ఇంటిపేరు వచ్చి ఉంటుంది. 
నేతి అనే ఇంటిపేరు కమ్మవారిలోనూ  ఉంది. వారిలో పాడి పరిశ్రమకు, నేతి అమ్మకానికి పేరొందిన ఒక కుటుంబానికి ముందుగా ఆ ఇంటిపేరు వచ్చి ఉంటుంది.  ఆ ఇంటిపేరు మీదుగానే  ప్రకాశం జిల్లాలో కందుకూరు సమీపంలో  నేతి వారి పాలెం అనే ఒక గ్రామం కూడా ఉంది. ఆ ఊరంతా నేతి ఇంటిపేరుగల  వారే. నా  రెండవ అక్కయ్య విప్పర్ల శోభారాణి దగ్గర బంధువు నేతి సింగయ్య చౌదరిది ఆ వూరే కావటంతో ఒకసారి ఆ ఊరు వెళ్లాం. 

ఉప్పు అనే ఇంటిపేరు  కమ్మవారిలో ఉంది. విఖ్యాత సినీ నటుడు కీ.శే. శోభన్ బాబు ఇంటి పేరు ఉప్పు వారే.  సినిమాలలో చేరక ముందు ఆయన పేరు ఉప్పు శోభనాచలపతిరావు. వారి స్వగ్రామం విజయవాడ - మైలవరం మార్గంలోని కుంటముక్కల గ్రామ సమీపంలోని చిన నందిగామ. అక్కడికి సమీపంలోని ఆగిరిపల్లి కొండ (శోభనాచలం) మీద కొలువైన శోభనాచలపతి (వ్యాఘ్ర నరసింహస్వామి) పేరే తల్లిదండ్రులు ఆయనకు పెట్టారు. ఉప్పు అనే ఇంటిపేరు బలిజ కాపు వారిలోనూ ఉంది.
నా చిన్నతనంలో మా చినరావూరులోని బలిజ కాపు కుటుంబాలలో ఉప్పు కిష్టయ్య అనే ఆయన ఉండేవారు.  

పులుసు అనే ఇంటిపేరు రెడ్లలో ఉంది. గతంలో ముందుగా  విజయవాడ శారదా కళాశాల, ఆ తరువాత సయ్యద్ అప్పలస్వామి కళాశాల ప్రిన్సిపల్ గా వ్యవహరించిన తెలుగు భాషాభిమాని కీ.శే.పులుసు గోపిరెడ్డి నాకు తెలుసు.  ఇటీవలనే మా చినరావూరు పార్క్ లో ఉదయపు నడకలో సన్నిహితుడైన  శ్రీ పులుసు అంజిరెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా మాచెర్ల తాలూకా  వెల్దుర్తి సమీపంలోని  సిరిగిరిపాడు. 

పచ్చి పులుసు అనే ఇంటిపేరు వైశ్యులలో ఎక్కువగా కనిపిస్తుంది. కమ్మ వారిలోనూ ఆ ఇంటిపేరు ఉన్నట్లూ వారిది పమిడిపాళ్ళ ( పగిడిపాల) గోత్రం అయినట్లూ చదివాను.  
    
ఉలవకట్టు (ఉలవ చారు) అనే ఇంటిపేరు కలిగిన బలిజ కాపులు  మా తెనాలి తాలూకాలోని కంఠంరాజు కొండూరులో ఉన్నారు. వారి పూర్వులు కృష్ణాజిల్లా నుంచి అక్కడికి వలస వచ్చారట. మా గుంటూరు జిల్లాలో దాదాపు గత నలభై ఏళ్ల నుంచే ఇంతకు పూర్వం లేని అలవాటైన భోజనంలో ఉలవచారు (Brown Soup) వినియోగం మొదలైనట్లు నాకు తెలుసు. ఇక్కడ అది కృష్ణా జిల్లా నుంచి దిగుమతైన ఆహార అలవాటు కావడం కూడా గమనార్హం.  ఉలవ చారు అంటే బాగా ఇష్టపడిన, లేక ఉలవ చారు కాయటంలో మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి పేరిట ఈ ‘ఉలవ కట్టు’  అనే ఇంటిపేరు ఏర్పడి ఉంటుంది. కమ్మవారిలో ఉలవల అనే ఇంటిపేరు ఉంది, కందికట్టు అనే ఇంటిపేరూ ఉంది  కానీ ఉలవకట్టు అనే ఇంటిపేరు నాకు ఎక్కడా తగలలేదు.  పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని  మారుతి మెస్ లో వడ్డించే  కందికట్టు, పెసరకట్టు  చాలా రుచికరంగా ఉండేవి.( పప్పు ఉడికించిన నీళ్లను వార్చి, ఆ పప్పు నీళ్లతో కాచే చారునే కట్టు అంటారు).  కందికట్టు, కందికట్ల ఇంటిపేర్లు బ్రాహ్మణులలో ఉన్నాయి.పెసరకట్టు అనే ఇంటిపేరు కూడా ఉండే ఉంటుందేమో  కానీ నాకెక్కడా తటస్థించలేదు. 

మన ప్రాచీన కవులు విస్తట్లో వడ్డించే ఆహార పదార్థాలలో ‘గుప్పెడు పంచదారయును’ అంటూ పంచదార (బెల్లం) ను కూడా ప్రస్తావించారు. అన్నంలో కలుపుకునే కూరలు, పచ్చళ్ళు, పులుసులు, చారులు మొదలైన వ్యంజనాలలో  పులుపు, కారం, చేదు వంటివి ఎక్కువైనప్పుడు వాటి ప్రభావం తగ్గించటం కోసం గుప్పెడు పంచదార (బెల్లం) కూడా వడ్డించేవారు. ఆ కారణంగా బెల్లం లేక పంచదారను కూడా భోజనపదార్థంగానే భావిస్తారు. బెల్లం, బెల్లపు  ఇంటిపేర్లు బలిజ కాపులలో, కమ్మవారిలో ఉన్నాయి.

అన్నం ఇంటిపేరు వైశ్యులు, కమ్మ, బలిజ కాపు, కుంకపు (కృష్ణ బలిజ) వారిలో నాకు తగిలింది. తమిళ భాషలో సాదం అంటే అన్నం. సాదం అనే ఇంటిపేరు యాదవులలో ఉంది. ఒకప్పుడు తెనాలి సమీపంలో దుగ్గిరాల మండలం చినపాలెం గ్రామంలోని యాదవ కులస్థులలో  సాదం వేదాద్రి అనే నాకు తెలిసిన ఒక కమ్యూనిస్టు ఉండేవాడు. బలిజ కాపు కులస్థుడైన బాపట్లకు చెందిన అన్నం సతీష్ ప్రభాకర్ (తెదేపా మాజీ ఎమ్మెల్సీ) ప్రస్తుతం భాజపాలో ఉన్నారు. కమ్మవారిలో అన్నం నాయడు  వంశీకులు ప్రస్తుతం అన్నంనేని, అన్నమనేని వారుగా వ్యవహరించబడుతున్నారు.  

అన్నాన్ని కూడు అనికూడా అనటం ఉంది. వరికూటి, జొన్నకూటి, దబ్బకూటి ఇండ్లపేర్లు నేను విన్నవే  మా తెనాలికి సమీపంలోని పెరవలి పాలెం, పెరవలి, చావలి గ్రామాలలోని బలిజకాపు కులస్థులలో జొన్నకూటి వారున్నారు. దబ్బకూటి వారు యాదవులలో ఉన్నారు. 

మా తెనాలి ప్రాంతపు కమ్మవారిలో వట్టికూటి అనే ఇంటిపేరుగలవారు ఉన్నారు. ఈ ఇంటిపేరు ఎలా ఏర్పడిందో చూద్దాం. వట్టి అంటే మట్టి. వట్టి కొండ (మట్టి కొండ), వట్టి కోట( మట్టితో నిర్మించిన కోట), వట్టి గుడిపాడు( మట్టితో కట్టిన గుడి ఉన్న ఊరు) గ్రామనామాలు మనకు తెలుసు. ఒకప్పుడు బియ్యంలో మట్టి గడ్డలు ఎక్కువగా ఉండేవి.  ఓ కమ్మ వారి  గృహిణి వారి ఇంటికి చుట్టాలొస్తే బియ్యం  ఏరి శుభ్రపరచే  సమయం కూడా లేక అలాగే వండి వడ్డించిందట. అన్నంలో మట్టి గడ్డలు ఎక్కువగా ఉండటాన ఆమెను విమర్శించిన అతిథులు ఇక నాటినుంచీ ఆ యింటివారిని వట్టికూటి (మట్టి కూటి) వారు అని పిలిచేవారట. అంతకుముందు వారి ఇంటిపేరు రామినేనివారు  అనీ, వారి గోత్రం కూడా వల్లుట్ల అనీ విన్నాను. రామినేని వారి నుంచి చీలిపోయిన తరువాత వట్టికూటి వారికి వల్లుట్ల గోత్రంతో పాటు పలు ఇతర గోత్రాలు కూడా ఏర్పడ్డాయని కూడా విన్నాను. మట్టికూటి అనే ఇంటిపేరు కూడా కమ్మవారిలో ఉంది. బహుశా అదే కాలక్రమంలో వట్టికూటిగా రూపాంతరం చెందిఉంటుంది. వడ్ల, కొర్రకూటి అనే ఇంటిపేర్లూ  కమ్మవారిలో ఉన్నాయి.  

ఒకప్పుడు దేవుళ్ళకు జాతరల సందర్భంగా అన్నం రాసులుగా పోసి నైవేద్యమిచ్చి, ఆ తరువాత ఆ అన్నాన్ని ప్రజలే సామూహిక విందులో భోజనం చేసేవారు. ఆ కారణంగానేనేమో ప్రజాకవి వేమన ఒక పద్యంలో ‘ రాయి దేవుడైన రాసులు మింగడా ? ‘ 
అంటాడు. నైవేద్యంగా రాసులుపోసిన ఈ అన్నం మీదుగా కూటికుప్పల అనే గ్రామనామం దానిమీదుగా ‘కూటి కుప్పల’ అనే ఇంటిపేరు ఏర్పడింది. విశాఖపట్నంలో ఎయిడ్స్  వ్యాధి నిర్మూలనకు కృషిచేసి పద్మశ్రీ అవార్డు పొందిన వైద్యుడు డా.కూటికుప్పల సూర్యారావు పేరు మనం విన్నదే. 

నిమ్మ, దబ్బ వంటి పుల్లటి ఊరగాయ పచ్చళ్ళలో కొందరు పచ్చి మిరపకాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కాబూలీ శనగలు, అల్లం ముక్కలు, జీలకర్ర వంటివి  కలుపుతారు. అవన్నీ పచ్చడితో పాటు బాగా ఊరి పుల్లగా తయారై ఎంతో రుచిగా ఉంటాయి. కొందరు  ఊరగాయ పచ్చళ్ళలో  పెసరపిండి, శనగపిండి వంటివి చేరుస్తారు. అవి  పచ్చడితో పాటు ఊరి,  పుల్లగా, రుచిగా అవుతాయి. కొందరు అచ్ఛంగా శనగ లేక పెసర పిండిని తగినంత ఉప్పు, కారం, పులుపు చేర్చి ఊరబెడతారు. ఊరిన ఈ పిండి చాలా రుచిగా, నోటికి ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని ‘ఊరు పిండి’ అంటారు. అదే శబ్దం జనవ్యవహారంలో ‘ఊరుబిండి’, ‘ఊరుబండి’, ‘ఊరు మిండి’, ‘ ఉరిమిండి’ గా  రూపాంతరం చెందింది. బలిజ కాపులలో,  రెడ్లలో ఈ ఇంటిపేరు నాకు తగిలింది. 
తెనాలి సమీపంలోని కఠెవరం గ్రామానికి చెందిన కీ.శే. ఊరుబండి ఆచార్యులు (బలిజ కాపు) అనే కమ్యూనిస్టు నేత, అమెరికాలోని డా. ఉరిమిండి నరసింహారెడ్డి ( టెక్సస్ లోని డాలస్ నివాసి) నాకు సుపరిచితులు. 

పప్ప అంటే భక్ష్యము, పిండి వంట లేక అప్పచ్చి అని అర్థం. విశాఖ పట్నానికి చెందిన యలమంచిలి   శాసనసభ్యునిగా,  అనకాపల్లి పార్లమెంటు సభ్యునిగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం అధ్యక్షునిగా సేవలందించిన తెదేపా నేత  పప్పల చలపతిరావు 
ప్రసిద్ధులు. అరిసెల అనే ఇంటిపేరు కూడా కమ్మవారిలో ఉంది. మారు అంటే మజ్జిగ. అందుకే గ్రామీణులు కూరన్నం తిన్న తరువాత తినే మజ్జిగన్నాన్ని మారన్నం అంటారు. తనకాలపు దళితులు మజ్జిగ అన్నం తినటానికి కూడా నోచుకోలేదని ప్రజాకవి వేమన ‘ మారు లేని కూడు మాలకూడు ‘ అంటాడు ఒక పద్యంలో. మారు, మోరు, మోరం వంటి ఇంటిపేర్లు మజ్జిగ మీదుగా ఏర్పడ్డవే.

సశేషం -- మీ.. ముత్తేవి రవీంద్రనాథ్.        

No comments:

Post a Comment