Tuesday, November 19, 2024

*కర్ణ మహా భారతం -11*
🏹

రచన : శ్రీ శార్వరి 


*హస్తినలో అలజడి*

"మీ కవచకుండలాలంటే నా కిష్టం” అన్నది ఉర్వి కర్ణతో ఆ మాట చాలాసార్లు అన్నది లోగడ.

“ఆడవారికి బంగారం మీద మోజు సహజం. నీవు ప్రేమిస్తోంది బంగారాన్ని కాని నన్ను కాదన్నమాట.”

"కర్ణుని ప్రధాన ఆకర్షణలే అవి గదా ఉర్వీ.”

"స్వర్ణకవచంతో పుట్టడం ఏమిటి? అదీ శరీరంలో భాగంగా. చూచేవారికి కవచం అనిపించదు. బంగారు శరీరం అనుకుంటారు. శరీరం రంగే అంత అనుకుంటారు.”

ఉర్వి చూపులు ఎప్పుడూ ఆ కవచం పైనే. ఇష్టంగా వేళ్లతో నిమురుతుంది. ముద్దులిస్తుంది.

"మీరు దేశంలోనే గొప్ప ఆకర్షణ ప్రియా. ప్రతి ఉదయం మీరు నదికి స్నానానికి వెళుతుంటే అందరు ఆడవారి కళ్లు మీ పైనే. కళ్లతోనే మీ అందాల్ని తాగేస్తుంటా రు ఆబగా గమనించారో లేదో. హస్తినా పుర కాంతలకు మీరంటే వెర్రివ్యామోహం.

"నీలాగ! అంతేనా? అసూయపడుతున్నా వా!"

"ఇక నుండి ఇంటి వద్దనే స్నానం చేయకూడదా. నాకు అసూయకు అవకాశం ఉండదు.”

"అందుకా జనం నన్ను వీరుడంటారు. చిన్నతనంలో ఈ కవచంతో చాలా ఇబ్బంది పడేవాణ్ని. వంగడానికి ఉండదు లేవడానికి లేదు. అమ్మని అడిగాను. ‘తమ్ముడికి ఇలా లేదేం' అని. పాపం ఏం చెబుతుంది? తనకు మాత్రం ఏం తెలుసు? నాకెందుకు ఉందో. చిన్నప్పుడు ఒకసారి చెట్టు పై నుండి క్రిందపడ్డాను. నాకు దెబ్బతగల్లేదు. ఎప్పుడూ శోణ దెబ్బలు తినేవాడు.

ఉర్వి తమకంగా కర్ణ కవచం సవరిస్తూ అన్నది. "మీ కవచం వల్ల అక్కగారికీ ఇబ్బందే కదా!”

“అదా నీ బాధ? నీవెప్పుడైనా ఇబ్బంది పడ్డావా? అంటే నీ ఉద్దేశం వీటిని ఒలిచి పారెయ్యమనా. ఆ పని నా వల్ల కాదు. భార్య వైనందుకు నీవు నన్ను భరించ వలసిందే. నేను వాటిని భరించినట్లు."

భీష్ముడు అన్న మాటలు ఆ సమయంలో ఉర్వికి గుర్తొచ్చాయి. కర్ణుని గుండెపై తల ఆన్చి, కళ్లలోకి చూస్తూ అన్నది.

"నా ఉద్దేశం అదికాదు స్వామి. మీ సహజ కుండలాలకు, మీ జన్మకు ఏదో సంబంధం ఉందని, జన్మనిచ్చిన తల్లిగారికి తెలిసే ఉంటుంది. అసలు ఆ తల్లి ఎవరో మీకే తెలియదు గదా. అది తెలిస్తే మీ జన్మ రహస్యం తెలిసిపోతుంది."

"నాలో ఏదో దైవాంశ ఉందని నీ ఆశ, అనుమానం, పిచ్చి, నాలో అలాంటి అంశలు లేవు. నేను సామాన్య మానవుడిని అందరిలా. నీవైనా రాజకుమారివి. నాకు ఆ అర్హత కూడ లేదు గదా. నీ భర్త సామాన్యుడని వదిలేయవు గదా!”

"అయినా అది కాదు స్వామి. మీరు స్నేహితుని ఎన్నికలో తప్పు చేశారేమో నని".


మధ్యాహ్నం శోణతో రాజ వ్యవహారాలు చూచుకుంటాడు. తాను రాజునని అనుకోడు. రాజ వ్యవహారాలు పట్టించు కోడు. అన్నీ తమ్ముడు చూడవలసిందే.

ఒక రోజు వృశాలి పిల్లలతో కాలక్షేపం చేస్తోంది. శోణ వదినగారిని చూస్తున్నాడు తదేకంగా.

ఉర్వి అప్పుడప్పుడు దుర్యోధనుని ప్రస్తావన చేస్తోంది. ఎందుకు? దుర్యోధనుని గురించి తన అభిమతం ఏమై ఉంటుంది? తన కిష్టమైన వారి గురించి ఆమె అభిప్రాయం.

అంతలో శోణ వచ్చాడు. "అన్నా, నీవు నిజంగా చిన్న వదిన్ని ప్రేమించావా.” అదేం ప్రశ్న. శోణకు ఉర్వి అంటే అయిష్టం అనుకున్నాడు గానీ అది నిజం కాదు. అతని చూపులో ఉర్విపై ఏదో ఇష్టం కనిపిస్తోంది. ఇద్దరి వయసు ఒక్కటే. శోణతో పోల్చితే తను వృద్ధుడు. నిజంగా శోణకు తను తగినవాడు కాదు. శోణ ఉర్విని ఇష్టపడుతున్నాడని చెప్పలేం. శోణ తనకన్న అందంగా ఉంటాడు.

“అవును కన్నా.”

"ఆమె నిన్ను వరించింది స్వయంవరంలో. అది ప్రేమ ఎలా అవుతుంది?"

"ఏమో నాకు తెలియదు శోణా! నీవే ఉర్విని అడిగి తెలుసుకో.”

"అన్నయ్యా! నీవు పెద్ద వదిన్ని ప్రేమిస్తున్నట్లు చిన్నామెను ప్రేమించడం లేదని నా అనుమానం."

"ఉర్వికి మంచితనం ఎక్కువరా. తను మహా తెలివిగలది. పెద్ద వదిన అంత తెలివిగలది కాదు. సంసార పక్షం. ఈమెది రాజ ఠివి. ఉర్వికి ఉన్నన్ని తెలివితేటలు తనకు లేవురా కన్నా"

అంటే ఆమె అందానికి తను బందీ అయినాడని అనుకోవచ్చునా?

"ఏమోలే! నాకు జీవించడం నేర్పింది పెద్ద వదిన. జీవించడంలో ఆనందం నేర్పింది ఉర్వి, అవి రెండూ అవసరాలే కర్ణునికి కవచకుండలాలు ఎంత సహజమో జీవించడం, జీవితంలో సుఖించడం అంతే అవసరం.

ఉర్వి తన ఇల్లాలైనందుకు సంతోషిస్తాడు కర్ణ. అది అతనికి గర్వం.


*ఉభయమిత్రులు*

అంగరాజ మందిరానికి తరచుగా వచ్చే అతిథి అశ్వత్థామ. అతనికి కర్ణునికి స్నేహం. అది ఎలాంటి స్నేహమో ఉర్వికి తెలియదు. ఎందుకంటే ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. ద్రోణాచార్యకు కర్ణుడంటే ఇష్టం ఉండదు. అది బహుకాల అప్రియత్వం. ద్రోణాచార్యకు అర్జును డంటే ఎంత ప్రేమో, కర్ణుడంటే అంత అప్రియం. అటువంటిది కర్ణునితో, ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామకు స్నేహమా! ఎలా! 

అశ్వత్థామ అస్త్ర శస్త్ర విద్యలు తెలిసిన వాడు. ప్రవీణుడు. యుద్ధం చేయగల నేర్పరి. ద్రోణాచార్యుడు మనసుపడి కొడుక్కి అన్ని రణవిద్యలు నేర్పించాడు. తండ్రిగారి ఇష్టాయిష్టాలను అశ్వత్థామ పట్టించుకోడు.

ఉర్వి లోలోపల నవ్వుకుంది. ఎవరి అభిమతం వారిది. వద్దంటే పిల్లలు వింటారా! తను విన్నది కనకనా? అశ్వత్థామకు కర్ణుడంటే గౌరవం, ఇష్టం, అభిమానం. అందుకు కారణాలున్నాయి. చాలా కాలం క్రిందటి సంఘటన అది. రాధేయుడు సూతపుత్రుడుగా ద్రోణాచార్య ఆశ్రమానికి వెళ్లిననాటి ఉదంతం.

రధసారధి కుమారుడుగా పెరిగిన కర్ణునికి రధసారధి కావడం ఇష్టం లేదు. తను వీరుడు కావాలన్న కోరిక.

ఉర్వి అడిగినపుడు రాధ చెప్పింది అలనాటి కధ.

కర్ణుని ఎవరూ పేరుతో పిలవరు. రాధేయుడనే అంటారు. రాధ అభిమాన పుత్రుడు రాధేయుడు. రాధేయుడంటే కర్ణుడు.

రాధేయుని పట్టుదల కారణంగా అథిరధుడైన తండ్రిగారు ద్రోణాచార్య ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. విలు విద్య లో శిక్షణ ఇమ్మని అర్థించాడు. రాచ
బిడ్డలు తప్ప అన్యులు విలువిద్యలకు అనర్హులని ద్రోణుని అభిప్రాయం. అతను సూతపుత్రుడని అవమానించి పంపాడు. తన వద్ద విద్యలు నేర్చేవారంతా రాచ బిడ్డలే. అది ద్రోణాచార్యకు గర్వం. క్షత్రియులు కానివారికి రణ విద్యలు అనవసరం అని ద్రోణుని అభిమతం. ఆచార్యుల తిరస్కారాన్ని అవమానంగా భావించాడు కర్ణుడు. ద్రోణాచార్యుల పట్ల కోపం పెంచుకున్నాడు. ఆయనగారి శిష్యుడు కాలేకపోయినందుకుకాక కురుపాండు నందనులతో కలిసి విద్యలు అభ్యసించే అవకాశం కోల్పోయినందుకు కృద్ధుడైనాడు రాధేయుడు.

ఉర్వి ఆలోచించింది. కర్ణుని ఉద్దేశం ఏమై ఉంటుంది. ద్రోణాచార్యుని ఇప్పటికీ కర్ణుడు ద్వేషిస్తున్నాడనే అనుకున్నది.

రాధేయుడు వర్ణవ్యవస్థకు బద్ధ వ్యతిరేకి. కుల వ్యత్యాసాలతో మనుషుల మనసుల్ని గాయపరచడం దురన్యాయం అంటాడు. తనది ఏ కులమో తెలియదు కాని సూతపుత్రుడుగా పెరిగాడు. ఆ దుగ్ధ అతనిని వదలడం లేదు. తనకన్న అయోగ్యులు 'కులం' కారణంగా ఉన్నతులుగా చలామణి కావడం భరించ లేడు, సహించలేడు. క్షత్రియులతో సమంగా జీవించాలంటే కనీసం తనకు విలువిద్యా ప్రతిభ ఉండాలి.  ఆ అవకాశా న్ని ద్రోణాచార్య నిరాకరించాడు. కురు, పాండవుల కన్న తను ఎందులో తక్కువ? విలువిద్యలో తన ప్రతిభ ప్రదర్శించాలను కున్నాడు. అవకాశం చేజారింది. హుఁ? క్షత్రియుడైతే నూరు చేతులు, నూరు కాళ్లు ఉంటాయా? ఎందులో గొప్ప? ఏ విధంగా గొప్ప? అయితే, తన కొడుకు అశ్వత్థామకు ఎలా నేర్పాడు? తను బ్రాహ్మణుడు కదా! బ్రాహ్మణునికి విలువిద్య లెందుకు?

తన తండ్రి కర్ణుని తిరస్కరించిన వైనం, నాటి సంభాషణ విన్న అశ్వత్థామ కర్ణుని పై అభిమానం పెంచుకున్నాడు. జాలిపడి అతని ప్రతిభను, యోగ్యతను గుర్తించి అతనికి స్నేహ హస్తం అందించాడు. ఆత్మీయ మిత్రుడైనాడు. హస్తినలో జరిగే విలువిద్యా ప్రదర్శనకు వెళ్లమని ప్రోత్సహించింది అశ్వత్థామ. "నీవు తప్పక పోటీ చేయాలి" అని ఉత్సహించాడు.

ఆహ్వానం లేకపోయినా కర్ణుడు వెళ్లాడు అనాడు. వెళ్లినవాడు తర్వాత పోటీకి సిద్ధమైనాడు.

ఉర్వి నిట్టూర్చింది గతం జ్ఞాపకం రాగా, ఆరోజునే తను మొదటిసారిగా కర్ణుని చూచింది. కర్ణునిపై మనసు పడ్డదీ ఆనాదే.

రాధ చెప్పింది. “అక్కడ ఏం జరుగుతుందో చూచి రమ్మని ఈయన గారిని పంపాను. రాధేయుడు ఈయన గారిని చూచి మరీ రెచ్చిపోయాడు. అసలే అవమాన భారంతో ఉన్నాడేమో. కుల ప్రస్తావన వచ్చేసరికి, పాండవులు తనను అవమానించేసరికి, నిగ్రహం కోల్పోయాడు.”

ఉర్వి బాధ పడ్దది.

ఆ సమయంలో మిత్రుడైన అశ్వత్థామ ఏమీ సాయం చేయలేకపోయాడు. దుర్యోధనుడే కర్ణుని పరాభవం నుండి రక్షించాడు. అది కారణంగానే కర్ణ దుర్యోధనులు మిత్రులైనారు.

మనసులో ఏమున్నదో ఎవరికి తెలుస్తుంది? మనసులు అగాధాలు. లోకం ఉత్తినే విమర్శిస్తుంది.

ఉర్వి పెదాలు బిగబట్టింది. తీవ్రంగా ఆలోచించేటప్పుడు అలా పెదాలు బిగించడం ఆమెకు అలవాటు.

దుర్యోధనుని వలె, అశ్వత్థామ కర్ణుని స్నేహం ఆశించాడు.

ఎవరి స్నేహంలోనూ స్వార్థం ఉన్నట్లు అనిపించదు. మంచితో స్నేహం మంచి మనిషికి మంచిదే.

కర్ణ, అశ్వత్థామల మైత్రిలో నిజాయితీ ఉంది. స్వార్థం లేదు.

కర్ణ దుర్యోధనుల మైత్రిలో నిబద్ధత ఉంది. అయితే రవ్వంత స్వార్థం ఉంది.
🏹

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•

No comments:

Post a Comment