☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
12. భూత్యై జాగరణమభూత్యై స్వపనమ్
మేలుకొని ఉండడం ఐశ్వర్య హేతువు. నిదుర దరిద్ర హేతువు(యజుర్వేదం)
మనకి లభించిన శరీరం, ఇంద్రియ శక్తులు నిరంతరం చైతన్యవంతంగా ఉండాలి.
పని చేయగలిగే ఇంద్రియాలను పనిచేయనివ్వాలి. అంతేగానీ నిష్క్రియగా
విడిచిపెట్టరాదు. ఇంద్రియశక్తులను జాగృతం చేసి ఈ పృథ్విపై సాధించాల్సినవి
సాధించడం మన కర్తవ్యమే.
ఆ విధంగా జాగరూకులమై ఉండడమే మేలుకొని ఉండడం. అలాంటి మేలుకొలుపు,
తెలివి కలిగి ఉన్నప్పుడు ఐశ్వర్యాన్ని, విజయాన్ని సాధించగలం. సోమరితనాన్నీ,
బద్ధకాన్నీ దరిచేరనీయకుండా, నిరంతరం శ్రమించడం, సాధించడం ముఖ్యమని
మన వేదసంస్కృతి అనేకచోట్ల బోధిస్తోంది.
శరీరానికి మన కార్యకలాపాలననుసరించి ఎంత అవసరమో అంత నిద్ర పోవాల్సిందే. కానీ సూర్యోదయ, సూర్యాస్తమయాలలో నిద్రపోతే దరిద్రం కలుగుతుందని వేదపురాణాలు చెప్తూనే ఉన్నాయి. అనుష్ఠానాలతో గడపవలసిన సమయం, అలసటతో గడపడం 'జీవితం' అనే వరాన్ని పాడుచేసుకోవడంతో పాటుగా, ఇంకా ఎన్నో అర్థాలు, ప్రబోధాలు ఈ వాక్యంలో గ్రహించవచ్చు.
జాగరణ (మేలుకొని ఉండడం) అంటే జ్ఞానం కలిగి ఉండడం. అజ్ఞానమే నిద్ర. లౌకికజ్ఞానం విషయం అలా ఉంచి, తానెవరో తెలుసుకునే ఆత్మజ్ఞాని పొందేది అఖండ ఐశ్వర్యమైన మోక్షమే. “జ్ఞానాదేవహి కైవల్యం” అని ఆర్షవాక్యం. అలా కాక ఆ జ్ఞాన విషయాన్ని గ్రహించలేని అజ్ఞానపు నిద్రలో ఉండే విషయాసక్తుడు ఆ ఐశ్వర్యాన్ని పొందలేడు.
మేలుకొని ఉన్నవాడే సమస్తశక్తుల్నీ వినియోగించుకోగలడు. సకలాన్నీ చూడగలడు.అన్నివైపులా చూసి, ఆలోచించి, తనకీ, లోకానికీ క్షేమంకరమైన ఫలితాలు సాధించాలంటే, ఆ విధమైన మేలుకొలుపు అవసరమే.
“అతి నిద్రాలోలుని వద్ద లక్ష్మి ఉండదు" అని మన పెద్దలు చెప్తుంటారు.
మన సంస్కృతి అనాది నుండి జ్ఞానానికే ప్రాధాన్యమిచ్చింది. భౌతిక సంపదల
సమీకరణలో బుద్ధి శక్తుల్ని వినియోగించుకోవడం మానివేస్తే అంతిమంగా అది వృథా జన్మేనని మహర్షుల మతం.
అకుంఠితమైన సాధన, విద్య.. నిత్య జాగరణశీలి అయిన వానికే సాధ్యమవుతుంది.అటువంటి లక్షణం చేతనే మహర్షులు యోగ, సిద్ధ, వైద్యాది గొప్ప విద్యల్ని సాధించగలిగారు.
సదాచారం, ధ్యానం వంటివి ఈనాడు మనం కోల్పోతున్నామంటే, దానికి కారణం
అలసత్వమే. 'బద్ధకం పరమ దరిద్రం' అని మనవాళ్ళు అంటూ ఉంటారు. 'ఉత్తిష్ఠ,
జాగ్రత' అని వేదమాత అనేకమార్లు ప్రబోధించింది.
కర్మనీ, ప్రబోధాన్నీ ఏమరని సంస్కృతి మనది.
షదోషాః పురుషేణైవ
హాతవ్యా భూతిమిచ్ఛతా!
నిద్రా తంద్రా భయం క్రోధం
ఆలస్యం దీర్ఘసూత్రతా ।
||
అతినిద్ర, కునికిపాటు, భయం, కోపం, బద్ధకం, వాయిదాలు వేయడం.... ఇవి
తమోలక్షణాలు. ఇవి ఉన్నవాడు ఏమి సాధించలేడు... అని సుభాషితం.
భారతీయసంస్కృతిలో అకర్మణ్యతకీ, అలసతకీ తావు లేదు. మనవాళ్ళు ప్రతిదానిలో వెనుకబడి ఉన్నారని విమర్శిస్తూంటారు. వేద ప్రబోధాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈ జాతికి ఈ దుస్థితి.
ఒకసారి మన సనాతన సంస్కృతి చేసే శంఖారావాన్ని మనం చెవినపెడితే, తిరిగి
మనం ఉత్తేజితులమవుతాం. మన విజ్ఞానశక్తిని జాగృతం చేసి, వాటిని మాతృభూమి ఔన్నత్యానికై ధారపోసి సార్థక జీవులమవుదాం.
No comments:
Post a Comment