Tuesday, November 19, 2024

 శ్రీమద్రామాయణము.

(246 వ ఎపిసోడ్),

ప్రాజ్ఞులైన వారి మాటలు శిరసావహించాలి. లేదా అది వ్యక్తి వినాశనమే కాక సర్వంసహ మానవాళికి  ""జీర్ణంకాని అహారము వమనరూపములో విసర్జింపబడినట్లు" అనారోగ్యహేతువుగ మారుతుంది.దీనికి వ్యక్తి ఔన్నత్యము ప్రభావము చూపిస్తాయి అంతేకాని   వారి వారి వంశజుల గొప్పతనము పరిగణలోనికి తీసుకొనబడవు.అందుకే

""గుణా సర్వత్ర పూజ్యంతే
పితృవంశో నిరర్ధకః""

సమాజములో ఏ వ్యక్తి యైన తన గణప్రవర్తనల బట్టి అందరిచే గౌరవింబడి పూజింపబడతాడు అంతే గాని గొప్పదైన తన పితృవంశముల  బట్టి గౌరవాలకి అర్హుడు కాడు.

రామాయణము యుధ్దకాండము లో 

"" న నః క్షమః వీర్యవతా తేన ధర్మానువర్తినా,
వైరం నిరర్ధకం కర్తుం దీయతామస్య మైథిలీ"",(9-17),

రాముడు ధర్మవర్తనుడు పైగా మహావీరుడు అతనితో వైరము నీకు తగదు. అంతేకాదు సీతామాతను రామునకు అప్పగించుట యుక్తమని విభీషణుడు రావణాసురురిని హెచ్చరించినా వినని సమయములో,

 మహాపార్శ్వుడు సీతను బలవంతముగ అనుభవించమన్న సలహాను విని తన చెడు కర్మలను గుర్తుచేసుకొని తాను చేసిన చెడుపనిని మహాపార్శ్వునితో ప్రస్తావిస్తాడు.

పుంజికస్థలయను అప్సరసను వివస్త్రను చేసి అనుభవించిన తర్వాత బ్రహ్మ శాపానికి గురిఅయ్యాను.అప్పుడు బ్రహ్మ,

"" అద్యప్రభృతి యామన్యాం బలన్నారీం గమిష్యసి,
తదా తే శతదా మూర్దా ఫలిష్యతి న సంశయః.|,(13-14),,

ఓ దుష్ట రావణా ఇక నీవు ఏ పరస్త్రీనైన  బలవంతము చేస్తే నీ తల నూరు ముక్కలగును. అని బ్రహ్మ శపించాడు.అందుకనే 
గుణగణాలబట్టియే విభీషణుడు అందరిచే  గౌరవింపబడ్డాడు.రావణునుని గుణగణాల వల్లే రావణుడు సమాజముచే అసహ్యింపబడి వధించబడ్డాడు.

"" అనభ్యాసే విషం శాస్త్ర,
మజీర్ణే భోజనం విషమ్"",

అభ్యసించక పోవటం వల్ల లేదా అభ్యాసం లేకపోవటం వల్లను శాస్త్రాలు విషప్రాయంగ మారతాయి. అలాగే ఎంతో రుచిగ ఉన్నవని తిన్న పదార్ధములు జీర్ణము కాకపోయినచో తిన్నవన్నియు విషప్రాయముగ మారిపోతాయి.

రామాయణము యుధ్దకాండము లో కుంభకర్ణుడు ధర్మ శాస్త్రాన్ని రావణాసురునికి వివరముగ వివరించినప్పటికిని ఆ ధర్మములన్నియు ఆ రాక్షసరాజుకి విషప్రాయముగ వినబడతాయి.

"" ధర్మమ్ అర్ధం చ కామం చ సర్వాన్ వా రక్షసాం పతే,
భజతే పురుషః కాలే త్రీణి ద్వంద్వాని వా పునః""(63వసర్గ-9వశ్లో),,

ఓ అన్నా రావణా! ధర్మము,అర్ధము,కామము ఈ మూడు పురుషార్ధములు. అర్ధ,కామ విషయాలలో ధర్మాన్ని విస్మరింపరాదు.ఈ మూడింటిలో ధర్మమే ఆచరింపదగినది.కనుక నీవు ప్రస్తుతము నీ కామ వాంఛలను వీడి ధర్మాన్ని ఆశ్రయించు.అది రాజైనవాడికి శోభను చేకూరుస్తుందని హితవు చెప్పుతాడు.
జీర్ణముగాని ఆహారము ఏవిధముగ విషతుల్యము గ  మారిపోతుందో కుంభకర్ణుని హితవు రావణుడు పెడచెవిన పెట్టడము వల్ల ఆ మంచి మాటలు  విషతుల్యమై లంక నాశనానికి కారణమైనది. 
 
కనుక శాస్త్రాలను అభ్యసించి తెలుసుకోవాలి.లేదా జ్ఞానులు చెపితే వినాలని రామాయణము మనలని హెచ్చరిస్తున్నది.

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment