*వారాణసి వైభవం...!!*
🌹ఈ కార్తీకమాస సందర్బంగా వారణాసిగా పిలువబడే ప్రసిద్ధ ఆలయాలు కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలోని ఆ ఆలయాల గురించి..
స్నానఘట్టాలు, ముఖ్యమైన తీర్ధాలు, ముఖ్యమైన ప్రదేశాలు.. అలా ఈ మాసమంతా అందులోని రోజుకో ఆలయ విశేషాలు,విశిష్టతలు తెలుసుకుని భక్తి పారవశ్యంతో తరిద్దాము...!!🌹🌹🌹
🌸కాశీ ఖండంలోని 82 వ అధ్యాయంలో వీరేశ్వర్ లింగము యొక్క గొప్ప శక్తిని గూర్చి శివుడు దిగువ వ్రాసిన విధముగా వర్ణించెను.
🌿ఒకానొకప్పుడు, అమిత్రజిత్ అనే రాజు భక్తితో ఒక రాజ్యమును పరిపాలించుచుండెను. ఆ రాజు విష్ణువు యందు దృఢమైన భక్తి కలవాడు. తన రాజ్యంలో అందరూ విష్ణువు యొక్క భక్తులు కావలెనని శాసించెను. ఒకనాడు, నారద మహర్షి ఆ రాజమహలుకు వచ్చెను. రాజు నారదునికి చేయవలసిన స్వాగత సత్కారములు భక్తిపూర్వకముగా చేసెను.
🌸నారదుని యొక్క ఆదేశానుసారం, రాజు మలయగంధి అను పేరుగల అందమైన కన్యను ఒక దుర్మార్గుని కబందహస్తాల నుండి కాపడెను. తరువాత రాజు మలయగంధిని వివాహమాడి వారిరువురు కాశీకి వచ్చి, కాశీలో 'ఉన్న అందమైన ప్రదేశములను, ప్రశాంత వాతావరణమును చూసి సంతోషించిరి.
🌿కాలక్రమేణా, పుట్టుకతోనే పదహారేళ్ళ ప్రాయముగల మగ శిశువును, విధివశాత్తు, మలయగంధి కనెను. అయితే, పుట్టిన సమయమున ఉన్న అమంగళకరమగు గ్రహకూటముల ప్రభావం జాతకంలో ఉన్నందున, ఆ పుత్రుని త్యజించనిచో రాజు చనిపోవునని మంత్రులు మలయగంధికి చెప్పిరి.
🌸రాజుని కాపాడుటకై, మలయగంధి ఆ పుత్రుని వికటా దేవి వద్దకు పంపెను. కానీ, పుట్టుకతోనే 16 యేళ్ళ వయసుగల కుమారుని చంపుటకు ఎవరికీ మనసు అంగీకరించలేదు. ఆ కుమారుడు శివుని మెప్పు కొరకు తీవ్రమైన తపస్సు చేసెను. శివుడు అతని తపస్సుకు మెచ్చి, ఒక లింగ రూపమున ప్రత్యక్షమయ్యెను. శివుడు ఆ లింగమునకు వీరేశ్వర్ లింగమని పేరిడెను.
🌿శివుడు చెప్పిన ప్రకారం, వీరేశ్వర్ లింగమునకు అభిషేకము, పూజలు చేసే భక్తునకు అన్ని విధములైన సకల సంపదలు కలిగి, భాగ్యాభివృద్ధి జరిగి జయము కలుగును.
🌸కాశీ ఖండంలోని 83వ అధ్యాయం ప్రకారం, వీరేశ్వర్ లింగమునకు పూజ చేసిన భక్తునకు మూడు కోట్ల లింగములకు పూజ చేసినంత ఫలము దక్కును.
🌿కాశీ ఖండంలోని 11 వ అధ్యాయంలో అత్మ వీరేశ్వర్ లింగమునకు పూజ లేదా అర్చన చేయుట వల్ల సంతాన ప్రాప్తి కలుగుననే గొప్ప ప్రభావమును గూర్చి చెప్పబడినది. విశ్వనర్ అనే ఒక ఋషి దైవభక్తి గల తన భార్యతో సహా కాశీలోని వివిధ స్థలాలలో ప్రార్ధించి, చివరకు సిద్ధ పీఠమైన అత్మ వీరేశ్వర్ వద్దకు వచ్చెను.
🌸ఇచ్చట అన్ని ఆగమాలను, ఆచారాలను అనుసరించి బహుకాలం అభిలాష అష్టకం చదువుతూ ఆ ఋషి అత్మవీరేశ్వరుని అర్చించెను. అలా చేస్తూ ఉండగా, ఒకనాడు ఆ ఋషి ఎనిమిదేళ్ళ ప్రాయము గల ఒక బాలకుడు అత్మ వీరేశ్వర్ లింగము వద్ద నిల్చొని యుండుట చూసెను.
🌿అంతట ఆ ఋషి శివుని పూజించినట్లే, భక్తి తత్పరతతో ఆ బాలకుని కూడా పూజించసాగెను.
🌸ఆ బాలకుడు ఎవరో కాదు. ఆ పరమశివుడే! విశ్వనర్ ఋషి చేసిన అభిలాష అష్టకం ఒక సంవత్సరము భక్తితో చదివిన, సంతానము లేని దంపతులు, తప్పక సంతాన వంతులవుదురని చెప్పి, ఆ బాలకుడు (శివుడు) అత్మవీరేశ్వర లింగములోకి అంతర్ధానమయ్యెను.
🌿మాహాత్మ్యములోని 2వ అధ్యాయమందు కూడా అత్మవీరేశ్వర్ లింగమును గూర్చి చెప్పబడినది.
🌸ఆత్మవీరేశ్వర్ లింగము ఉన్న స్థలం వారణాసి యందున్న సింధియా ఘాట్ అనే ప్రముఖమైన ప్రదేశము నందు డోర్ నెంబర్ సికె-7/158 లో అత్మ వీరేశ్వర్ లింగమును దర్శించుకోవచ్చు. పడవలో సింధియా ఘాట్ వరకు ప్రయాణించి, అచ్చట మెట్లు ఎక్కి చేరవచ్చు.
🌿ప్రత్యామ్నాయంగా, చౌక్ దాకా సైకిల్ రిక్షాలో ప్రయాణించి, వీధుల గుండా నడిచి చేరవచ్చు. ఆత్మవీరేశ్వర్ లింగము వద్ద రుద్ర జపము గాని, రుద్ర పారాయణ గాని చేయుట అత్యంత ఫలదాయకము..
🌸రేపు మరో ప్రసిద్ధ ఆలయాన్ని ప్రస్తావిస్తూ చక్కటి విశేషాలని మరో కొత్త పోస్టులో చూద్దాము..
No comments:
Post a Comment