కాలపు ఒడిలో కనుతెరవడమే
*మరణానికి తొలకరి..*
కనిపెంచిన అమ్మ
కడవరకు ఉండదు....
*అయినా బ్రతుకుతూనే ఉండాలి..*
తడబడుతూ తప్పటడుగులు
వేసి నిలబడ లేక నేలపై పడితే
అక్కున చేర్చుకునే నాన్న
ఆఖరి వరకు ఉండడు..
*అయినా నడుస్తూనే ఉండాలి....*
ఓనమాలు దిద్దించి
పాఠాలు నేర్పిన గురువు
చివరి వరకు ఉండడు ..
*అయినా ప్రతి రోజు*
*ఒక కొత్త జీవిత పాఠం నేర్చుకుంటూనే ఉండాలి ...*
నడక తెలిసినా...
నడత నేర్చినా...
కాలపు ఖైదు లో
చిక్కిన జీవితం..
ఉక్క పోతలో ..
ఊపిరి ఆడకున్నా..
నిలువెల్లా ఒంటరితనం
కమ్మేసినా....
ఈతరాకున్నా
*జీవితాన్ని ఈదాలి ...*
ధైర్యం కూడా దైన్యత మాటుకు
తప్పుకున్నా...
నీడ కూడా నిను పరాయిని చేసినా....
నీ వెనుక ఆనలుగురు నడిచే రోజు వచ్చే వరకు ..
బంధాలు గేలిచేసినా...
బాధ్యతలు బరువనిపించినా
గడియారం ముల్లులా...
క్షణం ఆగని కాలం లా....
జీవితం కరిగే వరకు
కరిగిపోదు కర్తవ్యం.....!!
No comments:
Post a Comment