Thursday, November 21, 2024

 *🙏ఐశ్వర్య కారకుడు - శివుడు🙏*

🌸🌿🌸🌿🌸🌿

🌸ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు. 

🌿శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసంకు చేరుకుంటాడు.

🌸శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు.

🌿కుబేరుడు వచ్చి.. మహాదేవా.. మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. 

🌸శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు.

🌿వస్తూనే... 'అమ్మా! ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి.

🌸పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి..
'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు' అన్నాడు పరమశివుడు.

🌿హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది.!

🌸ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు.

🌿ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

🌸వెంటనే బంగారు పళ్లెం పెట్టి, రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు.. గణపతికి వడ్డించారు.

🌿కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు.

🌸సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. 

🌿ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం చూస్తూండగానే ఖాళీ అయిపోయింది. 

🌸విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. 

🌿కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

🌸శివా.. శంకరా.. నేవే దిక్కు.. ధనంకి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు.

🌿మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. 

🌸అప్పుడు శివుడు "కుబేరా! నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు.

🌿ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని అహంకారం విడిచి, చేసిన తప్పుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.

🌸కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. 

🌿ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.

🌸మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. 

🌿కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహంకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా.

🌸నీతి: పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమతో భక్తితో పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుంది...స్వస్తి...

🌿🌸🌿🌸

No comments:

Post a Comment