Thursday, November 21, 2024

 శ్లో॥ తానహం ద్విషతః క్రూరాన్  
సంసారేషు నరాధమాన్।  
క్షిపామ్య జస్ర మశుభాన్  
ఆసురీ ష్వేవ యోనిషు॥

తా॥ ఇలా నన్ను ద్వేషించే ఈ క్రూరులైన నరాధములను నేను ఎల్లప్పుడు జననమరణ సంసార మార్గంలో నీచయోనుల్లో విసిరేస్తాను.
  
అసురస్వభావం గలవారు ఇతరుల శరీరంలో కూడా భగవంతుడు ఉన్నాడని తెలియక వారిని ద్వేషిస్తుంటారు. అలా ద్వేషిస్తే వారు పరమాత్మను ద్వేషించినట్లే. అలాంటివారు ఎలాంటి క్రూరకర్మలకైనా వెనుదీయరు. అందుకే వారిని 'క్రూరాన్' - క్రూరకర్ములు అన్నారు. అట్టి క్రూరులను నరులు అనరు. నరాధములు అంటారు. మానవాధములు అంటారు. అంటే భగవంతునికి వారిపట్ల ఎంతటి హేయభావం ఉన్నదో ఈ పదాన్ని బట్టి తెలుసుకోవచ్చు.

నరాధముడవయ్యావా! తగిన శాస్తి తప్పదు. ఏమిటా శాస్తి..?

తాన్ నరాధమాన్ ఆశుభాన్ ఆసురీషు యోనిషు ఏవ అహం క్షిపామి...

అలాంటి క్రూరులను - నరాధములను నీచమైన నికృష్టమైన ఆసురీ యోనులందు ఎల్లప్పుడూ విసిరేస్తుంటాను అంటున్నాడు భగవానుడు. నేనే విసిరేస్తాను అంటున్నాడు గనుక భగవంతుడు కర్మఫల ప్రదాత. శాసకుడు. అంతమాత్రాన ఆయన పక్షపాత బుద్ధితోనో, అస్తవ్యస్తంగానో చేయడు. వారివారి కర్మలను బట్టే చేస్తాడు. ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి జన్మలే వస్తాయి. నీచయోనులంటే పశుపక్షి క్రిమికీటకాది జన్మలే. అంతేగాక 'యోనిషు' అని బహువచనం వాడటం వల్ల అనేక నీచజన్మలు ఎత్తాల్సివస్తుంది. 

కసాయివాడు గొర్రెను తెచ్చి నరకబోతుంటే అది ఎలాగో తప్పించుకొని పరుగెత్తి పోతుంది. కొంతదూరం పోగానే కసాయివాడు దానివెంట పరుగెత్తి పట్టితెచ్చి బలిఇస్తాడు. అలాగే ఈ నీచ జన్మల నుండి తప్పించుకుందామని ఎంత గింజుకున్నా ప్రయోజనం లేదు. క్రూరకర్మలు చేసినవాడికి ఆ కర్మఫలం ఉన్నంతవరకు ఒకదాని వెంట ఒకటి నీచ జన్మలు వస్తూనే ఉంటాయి. తప్పించుకొనే వీలులేదు. ఈ భయంకరమైన సత్యాన్ని దృష్టిలో ఉంచుకొని అసురగుణాలను పారద్రోలాలి. ఇప్పుడు తెలివిగా తప్పులు చేశాం అని ఆనందిస్తే సరిపోదు, అప్పుడు ఏడుస్తూ కష్టాలు, దుఃఖాలు అనుభవించాలి. నికృష్టం అనుభవించాలి...

No comments:

Post a Comment