Tuesday, November 19, 2024

 *_అమృతమే కురిసింది_* 
*_ఆ రాత్రి..!_*
********""**"*****""""****
_దేవరకొండ తిలక్ జయంతి_
         01.08.1921
_______________________

*_(ఎలిశెట్టి సురేష్ కుమార్)_*
         విజయనగరం
        9948546286
________________________

_*తిలక్..*_

*యువకవిలోక ప్రతినిధి..*
*నవభావామృత రసధుని..*
*కవితాసతి నొసట* 
*నిత్యరసగంగాధర తిలకం..*
*స్వచ్ఛ స్ఫటికాఫలకం..!*

మహాకవి రాసిన ఈ మాటలు
తిలక్ అనే కవిని 
మెత్తగా మొత్తంగా చుట్టి 
మన చేతికి ఇచ్చిన 
రతనాల మూటలు..!

_శ్రీశ్రీనే ఒప్పించిన.._
_కాళోజీనే మెప్పించిన.._
_ఎవరినీ నొప్పించని_
సుకుమారుడు..
అక్షరాల రాకుమారుడు
దేవరకొండ 
బాల గంగాధర తిలక్..
భావుకత..ఆధునికత..
అభ్యుదయం కలగలిపిన 
కవి...తెలుగు సాహితీ 
వినీలాకాశంలో ఎప్పటికీ
అస్తమించని రవి..!

*మురికి కాల్వ మీద*
*ముసలితనం మీద*
*మృషా జగతి మీద*
*మహోదయం వికసించదు..*
*వసంతం హసించదని*
తేల్చి చెప్పిన కవి
*గదికి మదికి కూడా* 
*గవాక్షాలుంటాయని*
చాటించి మది గవాక్షాలను
బార్లా తెరచి కవితా కపోతాలను స్వేచ్చగా ఎగరేసిన భావుకుడు..
పదాల ప్రేమికుడు..!

*కాలం సవాలు లాంటిది..*
*సాహసవంతుడు అందుకుని*
*ముందుకు సాగిపోతాడని*
ప్రకటించి అలాగే ముందుకు సాగిన స్వేచ్ఛాక్షరాల జీవి..
చిన్న వయసులోనే 
కన్ను మూసినా 
కవితల్లో సదా బ్రతికి ఉండే
చిరంజీవి..రచనా ధన్యజీవి!

నువ్వు రాసే భాషే..
తిలక్ రాస్తే అదో అందం..
నీకు తెలిసిన విషయాలే
తిలక్ చెబితే ఓ గమ్మత్తు...
*చావుపుట్టుకల మధ్య*
*సందేహం లాంటి జీవితంలో*
*నలువైపులా అంధకారం* అంటూనే ఆ చీకటిని చేదించి
ఎన్నెన్నో రచనలు..
నీలో..నాలో వెలుగు నింపే
వచనలు..ప్రవచనలు!

పదాల వైచిత్రి..
అవకరాలు సరిచేసే చిత్రి..
వేనవేల భావాల గంగోత్రి
*_అమృతం కురిసిన రాత్రి.._*
ఈ ఒక్కటి చాలు తిలక్కును
ఆవిష్కరించే చమక్కు..!

మంచి గంధంలా పరిమళించే
మానవత్వం..తిలక్ తత్వం..
అందులోంచి పుట్టుకొచ్చినదే
మనస్సులను కట్టిపడేస
ఆయన కవిత్వం..
*ఏ దేశ సంస్కృతి అయినా*
*ఎన్నడూ కాదొక* 
*స్థిర బిందువు...*
*నైకనదాలు అదృశ్యంగా సంగమించిన* 
*అనంత సింధువు...*
నీకూ నాకే కాదు
కవులకైనా అందని 
ఆలోచనల విహారం..
మరో ప్రపంచపు సంచారం..
తిలక్కు మాత్రమే సాక్షాత్కారమైన
భావనల సమాహారం!

*వచన కవిత పాదాల పారాణి*
*పాపిట బొట్టు..*
*నుదుట తిలకం..*
*రసికతకు రాణింపు..*
*ధ్వనికి గుబాళింపు..*
*ట్రాన్స్పరెంట్ చీకటి..*
*వానికి వాడే సాటి..*
తిలక్ ను ఉద్దేశిస్తూ
ఇదీ కాళోజీ ధాటి!

_తరాలను ఊపేసిన_
_తారలను దింపేసిన_ 
_తీరాలను కలిపేసిన_
_అంతరాలను చెరిపేసిన.._
తిలక్ అంతలోనే 
తిరిగిరాని తీరాలకు
వెళ్లిపోతే...
అమృతం కురిసిన రాత్రి..
విషాన్ని వెళ్ళగక్కి..
విషాదాన్ని మిగిలిస్తే..
ఇలా వాపోయాడు శ్రీశ్రీ..
*గాలి మూగదై పోయింది..*
*పాట బూడిదైపోయింది...*
*వయస్సు సగం తీరకముందే*
*అంతరించిన ప్రజాకవి..*
*సభీస్సు సగం చేరక ముందే*
*అస్తమించిన ప్రజాకవి..*
ఇది అలవాటు ప్రకారం 
అలవోకగా సాగిన  
మహాకవి 
అక్షరాల కేళి కాదు..
గుండె లోతుల నుంచి
వెలువడిన నిజమైన నివాళి!
************************

No comments:

Post a Comment