Sunday, November 24, 2024

 🌴జాగరూకత🌴

*ఆధ్యాత్మిక సాధన యందు దూకుడు ప్రమాదకరము. దూకుడు రజోగుణము వలన ఏర్పడును.*

సరళముగ సాగుట సత్వగుణము. రజోగుణ దోషమున తమకన్నియు తెలియునని, తమకు మహాత్ముల పరిచయమున్నదని, తాము దివ్య దర్శనము పొందితిమని రజోగుణ సంపన్నులు తమ ఆధిక్యతకై బీరములు పలుకుచు, తాము పలికిన బీరములను తామే నమ్ముచు, భ్రమకు లోనై ఇతరులను కూడ భ్రమయం దుంచుదురు. ఇది యంతయు మాయావిలాసము కాని ఆధ్యాత్మికత కాదు.

తమకు గురువనుగ్రహము వలన జ్ఞానపు తాళము చెవి దొరికినదని నకిలీ తాళములు, నకిలీ తాళము చెవులు అందించుచు, తాము మోసపోవుచు, ఇతరులను మోసము చేయుట దురదృష్టము.

ఆత్మసాధకుడు ఆశకు లోనైనపుడు ఇట్టి భంగపాటు పడుచుండును. ఇట్టి విషయములందు సాధకుడు జాగరూకత వహించవలెను. భ్రమను చెంది ఇతరులపై ఆధిక్యతను పొందుటకు ప్రయత్నించు వారెల్లరును ఒక అవలక్షణమును ప్రదర్శించు చుందురు.

అది ఏమనగా తాము పూర్వము చెప్పిన వాదములను, తర్కములను వారే తెలియక ఖండించుచు నుందురు. ఇట్టివారిని  విడచుట సత్సాధకుని మేలు.

పై విధముగ భ్రమకులోనైన సాధకులు ఒంటరి వాడైనపుడు భ్రమ తొలిగి వాస్తవము దర్శనమగును .నిజము నకు ప్రతి సాధకుడు కొంత ఒంటరితనమును దైవంగినముగను, సప్తాహమునందును, పాక్షికమందును, ప్రతి మాసమునందును ఏర్పాటు చేసుకొనవలెను.

ఏకాంతమున తన ప్రవర్తనను తానే నిశితముగ పరిశీలించుకొన వలెను .ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమును పరిశీలించుకొనవలెను.

1 తాను నిజము పరహిత కార్యము లొనర్చుచున్నాడా? లేక ఇతరులు చేయుచుండగ తాను చెప్పుకొనుచు తిరుగుచున్నాడా?

2. తాను చేయు పనియందు శ్రద్ధ పెరుగుతున్నదా లేక వ్యామోహము పెరుగుచున్నదా?

3. హితకార్యముల నుండి గుర్తింపు, ప్రాముఖ్యము ఇత్యాది అంశములపై దృష్టి పడుచున్నదా లేక హితకార్యము లందే నిమగ్నమై యున్నదా?

4. తాననుసరించు వారిలో కార్యసాధక డున్నాడా లేక స్తోత్రపరులే చేరుతున్నారా?

5.తన ననుసరించు వారిలో లౌకిక ప్రయోజనము కోరి చేరు వారెందరు, ఆత్మ సాధనకై చేరువారు ఎందరు?

6.తాను చేయుచున్న కార్యముల ప్రయోజన మెట్లున్నది?
దానికి సవరణ మవసరమా?
ఇట్టి విషయములందు జాగరూకత వహించవలెను.    

No comments:

Post a Comment