Thursday, November 7, 2024

 

(నేటి గురువారం స్పెషల్ స్టోరీ).     సుడాన్ దేశాన్ని 1990 సంవత్సరంలో భయంకరమైన కరవు పీడించింది. ఆకలి దప్పులతో ప్రజలు అలమటించిపోయారు. 

ఆ కరవు తీవ్రతను ప్రతిబింబించిన ఫొటో ఒకటి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. 

ఎముకల పోగులా ఉన్న ఓ పసిపాప చిన్న రొట్టెముక్కను- తన వెనక కాచుకొని కూర్చొన్న రాబందు ఎక్కడ ఎత్తుకుపోతుందోనన్న భయంతో దాన్ని గుండెలకు అదుముకొన్న ఫొటో అది. 

నిజానికి రాబందు వేచి చూస్తున్నది- రొట్టె ముక్క కోసం కాదు. ప్రాణాలు గుటుక్కుమంటే ఆ పాపను పీక్కుతిందామని! 

ఇప్పటికీ ఎంతోమందికి ఆ ఫొటో గుర్తుండిపోయింది.

పరమ హృదయవిదారకమైన ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన దక్షిణాఫ్రికా ఫొటోగ్రాఫర్ కెవిన్ కు లెక్కలేనన్ని ప్రశంసలు దక్కాయి. సన్మానాలు జరిగాయి. కెవిన్ పేరు ప్రపంచమంతటా మారుమోగింది. 
At that moment (సందడిలో) కెవిన్ కు ఓ ఫోనొచ్చింది. 

'సార్! ఆ పాప ఏమయింది? ఉందా,చనిపోయిందా?' అని అడిగారెవరో.

 'ఏమో మరి! ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు' అన్నాడు కెవిన్.

'ఓహో! అయితే రోజు పసిపాప చావుకోసం కాచుకొన్నది రెండు రాబందులన్నమాట! ఒకటి- ఫొటోలో కనబడుతున్నది, 
రెండోది- ఈ  ఫొటో తీస్తున్నది' అనేసి ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. 

ఆ ఒక్క వాక్యం ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందంటే- 1993లో కెవిన్ తన 33వ ఏట ఆత్మహత్య చేసుకున్నాడు.

మహాయోధులమో, అభిమానధనులమో కాదు కాబట్టి... మాట మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. 

ఏ లారీయో గుద్దేసి పోతే రక్తం ఓడుతూ కొన ఊపిరితో ఓ మనిషి కొట్టుమిట్టాడుతుంటే హాస్పిటల్ కు చేరుద్దామనో, ఆంబులెన్స్ ను పిలుద్దామనో అనుకోకుండా ఆ వ్యక్తితో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించే మనలోని 'కెవిన్' కేసి, ఆ మనిషి చూసే చివరిచూపు చాలు- మనల్ని జీవచ్ఛవాల్ని చేయడానికి!
              -ఎర్రాప్రగడ రామకృష్ణ.

No comments:

Post a Comment