శరీరం కేవలం గూడు. అది ఆత్మకు ఆవాసం మాత్రమే..!
మానవజన్మ కర్మబద్ధం.
కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి. కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి.
ఇదే మానవ జన్మకున్న విశిష్టత.
సమ్యక్ దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి.
మేను మాత్రమే నేను కాదు. ఉన్నది ఒక్క నేనే. మూడు అవస్థలలో వున్న నేను అనే చైతన్యమే.
హృదయం వెన్న వలె ఉండాలి. కాఠిన్యంతో కాకుండా... కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచరించాలి.
సిద్ధాంత రాద్ధాంతాలు, వాదోపవాదాలు లేకుండా మనీషతో వుండాలి. మనీష అంటే స్థిరప్రజ్ఞ, స్థిమిత బుద్ధి. ఇది కాదు,ఇది కాదంటూ మనసును ఖాళీ చేసుకుంటూ పూర్ణ చైతన్యంతో ప్రవర్తించాలి.
శాస్త్రాధ్యయనంతో మనసును పరిమళ భరితం చేసి, స్వాదువుగా తీర్చిదిద్దుకోవాలి.
జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు. ఎరుకతో ఉండాలి.
దేనికీ అంటక, దేనినీ అంటించుకొనక కాంతి కటకం వలె, తామరపత్రం మీద నీటి బిందువువలె, తెరమీద బొమ్మవలె ఉండాలి. అంతా బ్రహ్మమే అనుకోగలగటమే అసలైన ముక్తి!! అలాగే,
కలియుగములో భవదనుగ్రహం పొందడానికి మానవునికి భగవన్నామ స్మరణకు మించిన సులువైన సాధన లేదనే చెప్పాలి.
నాదస్వరం వింటే పుట్టలోని పాములన్నీ బయటికి వచ్చినట్లుగా మనము నామస్మరణ చేస్తే హృదయంలోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి.
నామస్మరణ చాలా పవిత్రమైనది. ఈనాడు నామస్మరణ తగ్గిపోవడం చేతనే మనవునిలోనూ, దేశంలోనూ బాధలు పెరిగిపోతున్నాయి.
వీధివీధియందు నామము సంకీర్తన చేయాలి. శరీరంలోని అణువణువునూ, కణకణమునూ భగవన్నామంతో నింపుకోవాలి.
నామస్మరణ వలన కలిగే ఆనందము ధైర్యసాహసాలు ఇంక దేనివల్లనూ లభించవు.
ఇతరులేమనుకున్నా ఫరవాలేదు, అపహాస్యం చేసినా పట్టించుకోనక్కర్లేదు. దృఢమైన విశ్వాసంతో నామస్మరణ చేసినప్పుడు మనం అన్నింటిలోనూ విజయాన్ని సాధించగలము.
మన మనస్సే ఒక వీణ. అందులో చెడ్డ భావాలనే అపస్వరాలు రాకుండా చూసుకోవాలి. మనస్సనే వీణపై పవిత్రమైన భగవన్నామాన్ని పలికిస్తూ జీవితాన్ని గడపాలి. అప్పుడే మనకు భగవదనుగ్రహప్రాప్తి కలుగుతుంది.
No comments:
Post a Comment