*మోసం చేసినోని కాలే గుంతలోకి (అద్భుత జానపద నీతి కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒక ఊరిని ఒక రాజు పాలిస్తా వుండేటోడు. ఆయన చానా మంచోడు. ఒకసారి ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చినాడు. రాజు సాధువుకు అక్కడున్నన్నాళ్ళూ దగ్గరుండి సేవలు చేసినాడు. సాధువు అక్కడ వారం రోజులున్నాడు గానీ ఒక్కమాట గూడా మాట్లాల్లేదు. దాంతో రాజు సాధువు తిరిగిపోయే ముందు “సామీ... ఇన్ని రోజులున్నారు. కానీ ఒక్కమాట గూడా పలకలేదు. పోయేముందన్నా ఒక మంచి మాట చెప్పిపోండి సామీ.” అన్నాడు.
దానికా సాధువు చిరునవ్వు నవ్వి *“రాజా! మోసం చేసినోని కాలే గుంతలోకి”* అని చెప్పి వెళ్ళిపోయినాడు.
రాజుకు ఆ మాట ఏమీ అర్థం కాలేదు. పెద్దపెద్ద పండితులని పిలిపించి అడిగినాడు. లోకజ్ఞానం తెలిసినోళ్ళని అడిగినాడు. న్యాయాధికారులను అడిగినాడు. ఆఖరికి దారినపోయే దానయ్యలను గూడా అడిగినాడు. ఎవరూ ఏమీ చెప్పలేకపోయినారు.
దాంతో రాజుకు మనోవ్యాధి పట్టుకోనింది. రోజురోజుకీ చిక్కిపోసాగినాడు. అన్నం తినబుద్ధి కావడం లేదు. నీళ్ళు తాగబుద్ధి కావడం లేదు. ఎప్పుడూ అదే ఆలోచన.
ఆఖరికి లాభం లేదనుకోని ఎవరైతే ఆ మాటకు అర్థం చెబుతారో వాళ్ళకి తన రాజ్యంలో సగభాగం ఇస్తానని దండోరా వేయించినాడు. ఎవరెవరో వచ్చినారు గానీ రాజుకు సంతృప్తి కలిగేలా ఎవరూ ఏమీ చెప్పలేకపోయినారు.
దాంతో రాజు ఇక లాభం లేదనుకోని మంత్రిని పిలిచి 'ఓ మంత్రీ... నీకు నెలరోజుల సమయమిస్తా వున్నా... యాడికి తిరుగుతావో, ఎంతమందిని అడుగుతావో నాకు తెలీదు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో... ఎంతమంది మనుషులు కావాలంటే అంతమందిని ఉపయోగించుకో. కానీ నెల తిరిగేసరికల్లా నాకు దానర్థం తెలియాల. లేదంటే ఆ తరువాత రోజు సూర్యోదయాన్ని నువ్వు చూడలేవు” అని ఎచ్చరించినాడు.
మంత్రికి ఏం చేయాల్నో అర్థం కాలేదు. రాజు మాటంటే మాటే... చావు ఖాయం. దాంతో అనేక మంది పండితులను పిలిచి తలా ఒక దిక్కు పంపించినాడు. తాను కూడా ఒక గుర్రమెక్కి బైలుదేరినాడు. అట్లా ఒక పదిరోజులు గడిచిపోయినాయి. పదకొండో రోజు మంత్రి పోతావుంటే ఒకచోట ఒక పిల్లోడు దారి మధ్యన గుంత తవ్వుతా కనబన్నాడు.
అది చూసి మంత్రి “రేయ్.. ఏందిరా అది... దారి మధ్యన అట్లా తవ్వుతా వున్నావు. ఎవరైనా పడితే” అన్నాడు. దానికి వాడు “ఎందుకు పడతారు సామీ... మోసం చేసినోని కాలే గుంతలోకి” అన్నాడు.
ఆ మాటలకు మంత్రి అదిరిపడినాడు. గుర్రమ్మీద నుంచి ఒక్కుదుటున కిందకి దుంకి “ఒరేయ్... ఇంతకు ముందు ఒక మాటంటివి గదా... దాని అర్థం తెలుసా” అన్నాడు. దానికి వాడు “తెలుసు” అన్నాడు. “అయితే చెప్పురా” అన్నాడు. వాడు కాసేపాలోచించి “నాకేంటి లాభం” అన్నాడు. దానికి మంత్రి “నువ్వు కోరుకున్నంత డబ్బు ఇస్తాలేరా” అన్నాడు. వాడు ఆలోచనలో పడినాడు.
“ఈ మాటకు అర్థం కోసం ఇంతగా తనకలాడుతా వున్నాడంటే దీని వెనుక ఏదో పెద్ద కథే వుండాల. అది తెలుసుకొనేంత వరకూ పొరపాటున గూడా నోరిప్పగూడదు” అనుకోని “తెలుసు గానీ... ఎప్పుడో చానా చిన్నప్పుడు వినింటి. గుర్తుకు రావడం లేదు” అన్నాడు.
మంత్రి వానితో మంచిగా మాట్లాడతా “రేయ్... నువ్వు నాతోపాటే మా ఇంటికి రా... ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చెప్పు. నిన్ను నా కన్న కొడుకులెక్క చూసుకుంటాలే” అని తీసుకోనిపోయినాడు.
మంత్రి వాడు ఏమడిగితే అది కొనిస్తా, ఇంట్లో తన కొడుకుతో సమానంగా చూడసాగినాడు. అట్లా ఒక పదిరోజులు పోయినాక వానికి మంత్రి మీద మంచి నమ్మకం కుదిరింది. ఒకరోజు రాత్రి ఆ పిల్లొన్ని మంచమ్మీద కూర్చోబెట్టి ఆ మాటా ఈ మాటా మాట్లాడతా “రేయ్... ఇదే ఆఖర్రోజు. నాకు గనుక నువ్వు అర్థం చెప్పకపోతే రేపు నేనుండను. రాజు నా తల తీసి కోట గుమ్మానికి వేలాడదీయడం ఖాయం” అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
అది చూసి వాడు “లేదు లేదు నాకు గుర్తుకొస్తా వుంది” అంటూ దాని అర్థం వివరించినాడు.
అంతా తెలుసుకున్న మంత్రికి నెమ్మదిగా ఆశ మొదలైంది. రాజు "ఎవరైతే దానికి అర్థం వివరిస్తారో వాళ్ళకి అర్ధరాజ్యమిస్తా అని దండోరా వేయించినాడు గదా... తన కొడుకుకు ఆ అర్థం చెప్పి పంపిస్తే సరి. దెబ్బకు వాడు రాజాయిపోతాడు. ఇక వీనితో పని అయిపోయింది. ఎప్పటికీ వీని విషయం బైటపడగూడదంటే ఈ రోజే వీనిని చంపేయాలి” అనుకున్నాడు.
మంత్రికి ఒక పొలముంది. దాని మధ్యలో ఒక బావి తవ్విస్తా వున్నాడు. మంత్రి తాను ఏమి చెప్తే అది ఎదురు చెప్పకుండా చేసే ఇద్దరు మనుషులను పిలిచి “రేయ్... రాత్రి బాయికాడ కాపు కాయండి. ఒకన్ని బాయిలోకి పంపుతాను. వాడు ఎవరు? ఎందుకొచ్చినాడు? నాకేమవుతాడు? అనేది మీకనవసరం. వాడు బాయిలోకి దిగడం ఆలస్యం పైనుండి ధనధనధన రాళ్ళు లోపలకేయండి. వాడు ఈ భూమ్మీద వుండగూడదు” అంటూ చెరో వంద బంగారు వరహాలు వాళ్ళ చేతిలో పెట్టినాడు. వాళ్ళు ఆనందంగా 'సరే' అన్నారు.
చీకటి పడగానే మంత్రి ఆ పిల్లోన్ని పిలిచి “ఒరేయ్... మనం పొలంలో బాయి తవ్విస్తా వున్నాం గదా... దాని కూలీలు డబ్బు కోసమని వచ్చినారు. చీకటి పడింది గదా... రేపిస్తానంటున్నా వినకుండా మొండికి కూచున్నారు. వాళ్ళెంత లోతు, ఎంత వెడల్పు తవ్వినారో కొంచం పోయి కొలతలేసుకుని రాపో... చీకటిలో జాగ్రత్త... దీపం తీసుకోని పో” అన్నాడు. వాడు 'సరే' అని దీపం తీసుకోని బైలుదేరినాడు.
అట్లా ఒక రెండు సందులు దాటినాడో లేదో మంత్రి కొడుకు ఎదురొచ్చినాడు. వాడు “ఒరేయ్... ఇంత రాత్రప్పుడు యాడికి పోతా వున్నావురా... దీపం పట్టుకోని”
అని అడిగినాడు. దానికి ఆ పిల్లోడు “అన్నా... మీ నాన్న బాయి కొలతలేసుకుని రమ్మన్నాడు. అందుకని పొలం కాడికి పోతావున్నా” అన్నాడు.
అప్పుడు మంత్రి కొడుకు “ఒరేయ్... నీకేం తెలుసులే ఆ లెక్కలన్నీ... రెండు బదులు నాలుగు అని రాసుకొస్తావ్. ఇదిగో ఈ సంచీ తీసుకోని ఇంటికి పో. నేను పోయి కొలతలేసుకోని వస్తా” అని దీపం తీసుకోని బైలుదేరినాడు.
ఆ పిల్లోడు సరే అని సంచీ తీసుకోని ఇంటికి వచ్చినాడు. మంత్రి వాన్ని చూసి "అదేందిరా... నేను చెప్పిన పని ఏమి, నువ్వు చేస్తున్న పని ఏమి” అనడిగినాడు.
దానికి వాడు "నేను పోతావుంటే అన్న ఎదురొచ్చినాడు” అంటూ జరిగిందంతా చెప్పినాడు. అది విని మంత్రి అదిరిపడినాడు.
“ఓరి నాయనోయ్... నా కొడుకు” అనుకుంటా పొలంకేసి వురికినాడు.
దారిలో యాడా కొడుకు కనిపించలేదు. మంత్రి వురుక్కుంటా... వురుక్కుంటా... పొలం కాడికి పోయినాడు. కొడుకు పొలంలో గూడా కనబడలేదు. “కొంపదీసి చంపి బాయిలో ఏసేయలేదు గదా” అని బెరబెరా లోపలికి దిగినాడు.
దూరంగా చెట్టుచాటు నుండి ఇదంతా చూస్తున్నారు మంత్రి మనుషులు. వాళ్ళకు చీకట్లో ఆకారమే గాని మనిషి రూపం కనబడలేదు “ఎవరైతేనేం... లోపలికి దిగడం ఆలస్యం పైనుండి రాళ్ళు ఏయమని మంత్రి చెప్పినాడు గదా...” అనుకోని వాళ్ళు ధనధనా పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తి లోపలికి వేసినారు. అంతే... ఒక బండ నెత్తిన పడి మంత్రి అక్కడికక్కడే తల పగిలి సచ్చినాడు.
అప్పుడే స్నేహితులతో ముచ్చట్లాడి నెమ్మదిగా వస్తావున్న మంత్రి కొడుకు పొలంలోకి అడుగు పెట్టినాడు. బండలెత్తి బావిలోకి వేస్తావున్న వాళ్ళని చూసి “ఎవర్రా మీరు... మా బావిలోకి బండలేస్తా వున్నారు” అని గట్టిగా అరిచినాడు. ఆ అరుపుకు వాళ్ళు వులిక్కిపడి చెరోపక్క వురికినారు.
మంత్రికొడుకు ఏ మాత్రం బెదపడకుండా ఒకని వెంట పడినాడు. ఆఖరికి వానిని ఒకచోట పట్టుకోని కాళ్ళు చేతులు కట్టేసి బావి దగ్గరికి తీసుకు వచ్చినాడు. లోపల చూస్తే తండ్రి తల పగిలి చచ్చిపడి వున్నాడు. మంత్రి కొడుకు కళ్ళనీళ్ళు పెట్టుకోని వాన్ని రాజు దగ్గరికి తీసుకోనిపోయినాడు.
రాజు వాన్ని భటుల చేత కిందామీదా యేసి తన్నించి "చెప్పురా... ఎందుకు మంత్రిని చంపినావు” అనడిగినాడు.
ఆ దెబ్బలకు తట్టుకోలేక “రాజా... నేను చంపింది మంత్రినని నాకు తెలీదు, అసలు మంత్రే మమ్మల్ని పిలిపించి రాత్రి ఒకన్ని బావి దగ్గరికి పంపిస్తాను. వచ్చినోడు ఎవరని చూడకుండా వాని నెత్తిన బండలేసి చంపండి అన్నాడు” అంటూ జరిగిందంతా చెప్పినాడు.
మంత్రి కొడుక్కి జరిగిందంతా అర్థమైంది. “ఐతే ఆ పిల్లోన్ని చంపించబోయి మా నాయనే బాయిలో పడ్డాడన్న మాట” అన్నాడు ఆచ్చర్యంగా.
ఆ మాట విన్న రాజు “ఏ పిల్లోడు... ఏంది కత” అంటూ ఆ పిల్లోన్ని పిలిపించినాడు. పిల్లోడు జరిగిందంతా విని “మహారాజా! నేను ముందే చెప్పా మంత్రికి... మోసం చేసినోని కాలే గుంతలోకి అని. ఐనా వినిపించుకోలేదు ఏం చేద్దాం. అంతా వాని కర్మ” అన్నాడు.
ఆ మాట వింటూనే రాజు అదిరిపడినాడు. “ఏమన్నావు. మళ్ళీ చెప్పు” అంటూ దగ్గరికి జరిగి “ఇంతకు ముందు ఒక మాటన్నావే దానర్థం ఏమి” అన్నాడు.
పిల్లోడు నవ్వి “ఏముంది మహారాజా! మంత్రి కథంతా మళ్ళీ వింటే ఎవరూ చెప్పకుండానే మీకే అర్థమవుతుంది ఆ మాటకు అర్థమేమిటో” అంటూ ఆన్నుంచి వెళ్ళిపోయినాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment