Thursday, November 21, 2024

 Vedantha panchadasi:
జాడ్యాంశః ప్రకృతే రూపం వికారి త్రిగుణం చ తత్ ౹
చితో భోగాపవర్గార్థం ప్రకృతిః సా ప్రవర్తతే ౹౹99౹౹

99. జడత్వము ప్రకృతి స్వభావము.అది పరిణామ శీలము,త్రిగుణాత్మకము.
చిద్రూపుడగు పురుషుని భోగము (అనుభవము)అపవర్గము
(మోక్షము)కొరకు ప్రకృతి పనిచేయును.

అసంగాయాశ్చితేర్బంధమోక్షౌ భేదాగ్రహాన్మతౌ ౹
బంధముక్తి వ్యవస్థార్థం పూర్వేషామివ చిద్భిదా ౹౹100౹౹

100.  పురుషుడు సంగరహితుడు పరిశుద్ధుడు అయినను ప్రకృతి పురుషుల భేద జ్ఞానము లేక, ప్రకృతియే తానని భ్రమపడి, పురుషుడు బంధమునకు లోనగుచున్నాడు.ఆ బేధజ్ఞానము కలిగినంతనే మోక్షము లభించును. ఈ బంధమోక్షముల వ్యవస్థ కొరకు నైయాయికులు మొదలగు వారివలనే సాంఖ్యులు అసంఖ్యాక పురుషులను ప్రతిపాదింతురు.

మహతః పరమవ్యక్తమితి ప్రకృతిరుచ్యతే ౹
శ్రుతావసజ్గతా తద్వదసజ్గోహీత్యతః స్ఫూటా ౹౹101౹౹

101. అవ్యక్తమగు ప్రకృతి వ్యక్తప్రకృతియగు మహత్తు కంటే భిన్నమనీ ఆత్మ అసంగమనీ చెప్ప శ్రుతిని వారు ప్రమాణీకరింతురు.

సత్త్వరజస్తమోగుణాత్మకమైన ప్రకృతి పురుషుని బంధమోక్షములను కల్పించునని సాంఖ్యవాదము.

కఠ ఉప.1.3.11;  
బృహదారణ్యక ఉప.4.3.15, 4.4.22. గుణములు సామ్యావస్థయందుండుట ప్రకృతి స్వభావము.అది చెదరినపుడు సృష్టి ప్రారంభమగును.జడమగు ప్రకృతి తానంతట తానే ఎట్లు చెదరగరదు?
అసంగుడగు పురుషుడు ఎట్లు ప్రకృతిని చెదరగొట్ట గలడు?

రెండవది,పురుషులు అసంఖ్యాకులై ప్రకృతి శాశ్వతమైనచో వాని మధ్య ఏదోక సంబంధము కల్పింప వలసి వచ్చును.సంబంధమేర్పడి నంతనే పురుషుని అసంగత్వము భంగపడును.ఇట్లు సాంఖ్యులవాదము కూడా సరికాదు.వేదాంతవాదమున ఆత్మ సత్ చిత్ ఆనందస్వరూపమని ప్రథమ ప్రకరణముననే నిరూపింప బడినది.(1.10)

ప్రకృతి అంటే సత్త్వం,రజస్సు,తమస్సు అనే మూడు గుణాల సామ్యావస్థ.ఈ గుణాల పరస్పర కలయిక చేత దృశ్యమాన జగత్తు ఏర్పడుతొంది. కాని అవి తేలుపు నలుపు వంటి గుణములు కావు.పాలు,ఇనుము వంటి ద్రవ్యాలు కావు.

సత్త్వమంటే జ్ఞానశీలత,రజస్సు క్రియాశీలత,తమస్సు స్థితిశీలత.

జీవుడు,జగత్తు,ఈశ్వరుడు అనే వ్యవహారానికి మూల కారణంగా ప్రకృతి ప్రతిపాదించబడుతొంది. బ్రహ్మం కంటే భిన్నమైన సత్త ప్రకృతికి లేదు.అది బ్రహ్మం నుండి పుట్టినది కూడా కాదు.కాని ప్రకృతిని తీసివేస్తే సృష్టికి కారణంఏమిటి అనే ప్రశ్నకు ఉత్తరం లేదు.

ఇట్టి ప్రకృతిలో బ్రహ్మం "ప్రతిబింబించుట"...అంటే ఇది ఊహకు అతీతమైన విషయాన్ని మాటలలో చెప్పే ప్రయత్నమనే గ్రహించాలి.బ్రహ్మంలో
"సృష్టింప వలెననే ఇచ్ఛ కలుగుట"
మొదలైనవన్నీ ఇట్టి ప్రయత్నాలే.ఈ విషయం గుర్తించుకుంటే తత్త్వగ్రహణం సులభతరమవుతుంది.

ఆత్మ సర్వదా ఆనందస్వరూపుడు.దుఃఖము కొంచమేనియు లేదు. విషయములవలన కలుగు ఆనందము క్షణికమై యున్నది. విషయజనితమైన ఆనందము నిజమునకు ఆత్మదే.అయినను భ్రాంతి వశంబున విషయముల వలన ప్రతీతమై నట్లు తోచుచున్నది.

ఆత్మయొక్క పరమానంద స్వరూపం తెలిసినచో తుచ్ఛ విషయాలలో,అవి కలిగించే క్షణికానందాలలో ఎవరికీ ప్రేమ ఉండదు.

"అహం బ్రహ్మస్మి"అనెడు జ్ఞానంబు గూడా అంతః కరణ వృత్తికి సంబంధించినదే అయినను ఇది ఆత్మ జ్ఞానంబుగా చెప్పబడును.

 ఎట్లనగా పాదములో గ్రుచ్చుకున్న ముల్లు తీసి వేయుటకు మరియొక ముల్లు వాడుదుము.ఇవి రెండూ ముండ్లే.అయినను మొదటి ముల్లు బాధను గలిగించినది.రెండవ ముల్లు బాధను పోగొట్టినది.

అట్లే"దేహాదులే నేను"అనియెడు వృత్తి రాగద్వేష సహిత సంసారము గలిగిస్తున్నది గాన ఇది ప్రవృత్తి అని చెప్పబడుచున్నది.
"బ్రహ్మమే నేను"అనియెడు వృత్తి రాగద్వేష రహితమైన "బ్రహ్మప్రాప్తి"
అనెడు మోక్షంబు కల్గించుటచే నివృత్తి రూపమైన
" ఆత్మజ్ఞానంబుగా" చెప్పబడుచున్నది.

స్వరూపము తెలియని అజ్ఞాన సమయంలో(స్వరూపము తెలియని కాలములో)ఆత్మయందు మిథ్యయై యుండియు సత్యముగా ఉన్నట్లు తోచెడు ఈ దేహాంద్రియాది ప్రపంచము,స్వరూపజ్ఞానము కలిగిన వెంటనే అసత్తై మిథ్యయై కనబడును.

అధిష్టానమందు తోచెడు అధ్వస్త మయినది ఏదియు ఆధిష్టానము కంటే వేరుగా ఉండుటకు వీలు లేదు అనెడు నియమము ననుసరించి అధిష్టానమైన ఆత్మయందు అధ్వస్తమై కాన్పించు ఈ దేహేంద్రియాదులు ఆత్మజ్ఞానికి దగ్దపట న్యాయంగా ఉండి మరణ కాలంలో వాటికి అధిష్టానంగా తానే గావున తనయందే లయించి పోవును.అంతదనుక కేవల సాక్షి మాత్రుడై యుండును.        

No comments:

Post a Comment