Sunday, July 6, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ  🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
               *పెద్దల దీవెనలు*

*పవిత్రతను నింపుతూ దివ్య సంకల్పంతో భగవదాశీస్సులను అందించే శుభకామనను దీవెన అంటాం. మతాలకు అతీతంగా పెద్దలు అందించే దీవెనలు మహత్వ పూర్ణమైనవి! విశ్వాసంతో కూడిన భక్తుల ప్రార్థనలు భగవంతుడి అనుగ్రహానికి పాత్రమవుతాయి. భగవదనుగ్రహం పొందిన గురువులు, రుషులు, యోగీశ్వరులు, మునీశ్వరులు- పిన్నలకు ఆశీస్సులు అందించే యోగ్యత కలిగి ఉంటారు. ప్రథమ గురువులైన తల్లిదండ్రులు బిడ్డలకు దివ్యాశీస్సులు అందించే మొదటి అర్హత గలవారని శాస్త్రాలు చెబుతాయి. పరిపూర్ణ, ప్రసన్నచిత్తులైన మహనీయుల ఆశీస్సులకు ఎంతో బలం ఉంటుందని పురాణేతిహాసాల్లోని అనేక కథలు తేటతెల్లం చేస్తాయి.*
 
*మనిషి సదా మంచి ఆలోచనలు చేయాలి. మంచినే సంకల్పించాలి. మంచినే ఆచరించాలి అన్నది వేదాలు చెప్పిన నీతి నియమావళి. ఏది* *సంకల్పిస్తే అదే జరుగుతుందన్న భావనకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా మంచి ఆలోచన చేయాలన్న స్మృతులు, శ్రుతులు, పురాణాలు, ఇతిహాసాల ప్రబోధకు ఆచరణ సాధ్యమైన ప్రాధాన్యం ఉంది. చిన్న పిల్లలను ‘శతమానం భవతి’ అంటూ దీవిస్తాం. వారికి సదా మంచి జరగాలని ఆశిస్తాం. పదేపదే చేసే ఆలోచన సంకల్పాన్ని ధరిస్తుంది. అలాంటి సంకల్పాలు మనల్ని కర్తవ్యోన్ముఖులను చేస్తాయి. సంకల్పం బలపడినప్పుడు కర్మలు చేస్తాం. పునరావృతమయ్యే ఆలోచనలకు అంతబలం ఉంటుంది కాబట్టి మంచి ఆలోచనలు చేయాలనే వాదానికి ప్రాముఖ్యం ఉంది. దుఃఖ సమయంలో ప్రజలు దైవాన్ని ఆశ్రయించి అనుగ్రహం కోరతారు. పూర్వ కర్మల ఫలితంగా కష్టాలు నిర్ధారణ అయినవైతే, దైవప్రార్థన వల్ల కర్మ ఫలితం తొలగుతుందా అన్న సందేహం సాధకులకు కలుగుతుంది. మనసారా ప్రార్థనలు చేస్తే దైవానుగ్రహం లభిస్తుందని దుష్కర్మలు దగ్ధమై వాటి పరిణామాలు అనుకూలంగా మారతాయని పెద్దలు చెబుతారు. పెద్దల దీవెనలు శుభప్రదమని, వారి వాత్సల్య భావానికి పిన్నల జీవితాలను ఆనందదాయకం చేసే శక్తి ఉందని పండితులంటారు. జీవుల ఆనందం కోసమే భగవంతుడు సమస్త జగత్తును సృజించాడు. అందుకు కారణం ఆయన ఆనంద స్వరూపుడు కావడమే. కష్టాలు వాటిల్లవచ్చనే భయంతో మానవుడు ఆనంద క్షణాలకు దూరం కాకూడదు. సదా మంచి జరగాలనే భావనలో ఆశావహ స్వరూపం ఉంది. పెద్దలు, పిన్నల మంచి కోరుతూ అందించే మంగళాశాసనమే ఆశీర్వచనం. విశ్వకల్యాణం కోరి పవిత్ర క్షేత్రాల్లో జరిపే క్రతువులు మానవాళికి చల్లని దీవెనలు అందిస్తాయి.* 

*క్షేత్రదర్శనం వల్ల భక్తుల హృదయాల్లో మంగళకరమైన భావనలు ఆవిర్భవిస్తాయి. సాటివారికి మంచి జరగాలనే ప్రతి తలంపూ ఓ చల్లని దీవెనే. ఒకరికి మేలు జరగాలన్న ఆలోచనలకు పవిత్రమైన పునాది ఉంటుంది. అలాంటి తలంపులు సదా పరిమళంతో గుబాళిస్తాయి. ప్రతికూల ఆలోచనలు చేసినవారికి మానసికమైన నష్టం కలుగుతుంది. మంచి ఆలోచనలతో సాకారమైన కార్యంవల్ల అందరూ లాభం పొందుతారు. సమాజ శ్రేయాన్ని కోరే శుభకామనలు సమూహ ఆత్మశక్తిని సంతరించుకుని ఊహాతీతమైన ఫలితాలు అందిస్తాయి. మంచి ఆలోచనలు వాక్‌ రూపాలై దీవెనలుగా సత్‌ పురుషుల నోటి నుంచి వెలువడతాయి. శుభాలు ఆకాంక్షిస్తూ పెద్దలు అందించే దీవెనలు వినాలని, అవి నిజం కావాలని ప్రతివారూ ఉవ్విళ్లూరుతుంటారు!*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌲🌴 🌲🌴🌲 🌴🌲🌴

No comments:

Post a Comment