Thursday, July 30, 2026

 *ఇదీ సుఖజీవనమంటే*

మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి. బతికితే సమాజం గౌరవించాలి. మరణిస్తే శత్రువు కూడా కంటతడి పెట్టాలి.! 

మనిషి గెలవవచ్చు, గర్వించకూడదు. భయపడవచ్చు, పారిపోకూడదు. ఓడిపోవచ్చు, కుంగిపోకూడదు. జీవితంలో ఇవన్నీ సహజమే, సహించాలి. పదుగురికి ఉపయోగపడుతూ నడిస్తే బతుకంతా పాటలాగా సాగిపోతుంది

జీవితానికి రెండే రెండు ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆరాటం, మరొకటి పోరాటం. అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఆరాటమే. ఆశ, కోరిక, తపన- ఇలా ఎన్నో మూలాలున్నాయి దానికి. 

ఉదరపోషణార్థం పనిచేసుకోవడం, ఉద్యోగ వృత్తుల్లో నిమగ్నమవడం సమంజసమే. పదవులకోసం, డబ్బుకోసం, కీర్తికోసం దొడ్డిదారిన పాకులాడటమే మనుగడకు అనర్థమవుతుంది. 

జీవించడం అనేది ఒక కళ. ఆ కళ తెలిసినవాడు సుఖపడతాడు. తెలియనివాడు అగాధంలో పడిపోతాడు. ఈ అనంతకాలంలో మనిషి జీవితకాలం అతిస్వల్పం. 

వేదాంతపరంగా చెప్పాలంటే జీవితం క్షణభంగురం. ఈ సత్యం తెలిసి కూడా సామాన్యుల నుంచి, మాన్యులవరకూ దేనికోసమో నిత్యం వెంపర్లాడుతూనే ఉంటారు. 

మనిషి ఏడుస్తూ పుట్టాడంటే.. అందర్నీ ఏడిపించడానికి కాదు, ఆనందింప చేయడానికి, నవ్వించడానికి. పాపాలు నవ్వుతూ చేస్తే ఏడుస్తూ ఫలితం అనుభవించాలన్న సత్యం మనిషి గ్రహించడంలేదు. 

నూతిలో కప్ప అదే లోకం అనుకున్నట్లు- మనిషి తన భార్య, పిల్లలు బాగుంటే అదే సుఖమనుకుంటున్నాడు. సంఘజీవినని మర్చిపోతున్నాడు. సమాజంతో, గ్రామంతో, రాష్ట్రంతో, దేశంతో ప్రేమానుబంధం పెంచుకోవాల్సిన బాధ్యత తనపైన ఉంది.

ఎందరో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఎన్నెన్నో బాధలూ కష్టాలు పడుతుంటారు. ఆపదల పొదల్లో చిక్కుకుపోయి రోదిస్తున్న వారి వైపు చూడాల్సిన అవసరం మనిషికి లేదా? పరోపకారార్థమిదం శరీరం... అన్న మాట గుర్తుకు రాదా?

No comments:

Post a Comment