Sunday, August 20, 2023

బుజ్జి కధలు*. *11.అనుకూల మాటలు

 *బుజ్జి కధలు*.

*11.అనుకూల మాటలు*

       పూర్వం అమరావతి ప్రాంతంలో ఓ యువకుడు వుండేవాడు.  అతడు పెద్ద చదువే చదివాడు. కానీ చదువుకు తగ్గ కొలువు దొరకలేదు. దీనితో నిరుద్యోగిగా ఉండిపోయాడు. ఎన్నాళిలా ఉంటాడు? ఎంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతాడు?  దీనికి తోడు పెళ్లి కూడా అయ్యింది. తనుదూర సందులేదు మెడకో డోలు అన్నట్టు అయింది.  భార్య గుదిబండగా మారింది. ఇక ఏదో ఒక పనిచేయక తప్పలేదు. కాయకష్టం చేసే పనులు చేయలేడు. తన తెలివితేటలు ఉపయోగించి చిన్న వ్యాపారం చేయాలన్న చేతిలో చిల్లి గవ్వలేదు. అలోచించి ఆలోచించి చివరికి పైసా పెట్టుబడిలేని ఉపాధి కనిపించింది.   తెలివి తేటలుంటే ఈ వృత్తిలో బాగా సంపాదించుకోవచ్చు. దీనికి కొంచం లౌక్యం తోడయితే బాగా రాణించవచ్చు. 
      అనుకున్నదే తడువు  "ఇక్కడ జోతీష్యం చెప్పబడును" అనే పలకను రాసి  ఇంటిముందు తగిలించాడు. ఇంకేముంది అప్పటి నుండి అనేక సమస్యలతో జనం రాసాగారు.  వారి సమస్యలకు  తెలివిగా పరిష్కారం చూపుతూ ఏరోజుకారోజు జీవనానికి డోకా లేకుండా సంపాయించసాగాడు. 
    ఇలాఉండగా  ఈ విషయం ఆ దేశాన్ని ఏలే రాజుకు తెలిసింది. ఆయనకు ఎప్పటి నుండో ఓ సమస్య పట్టిపీడిస్తుంది.. పొరుగున ఉన్న  విజయపురి  రాజ్యాన్ని  వశపరుచుకోవాలన్నదే ఆ సమస్య.  ఆ దేశం పై దండెత్తితే గెలుస్తామా? లేదా? అనే సందేహం వెంటాడుతోంది.  గతంలో అనేకసార్లు ప్రయత్నియించాడు. ప్రతిసారి ఓటమి చవి చూస్తున్నాడు. మరోమారు ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ధైర్యం చాలటంలేదు. మళ్లీ ఒడిపోవలసి వస్తుందేమోనన్న. భయం.  ఈసారి జోతీష్యుని సలహాతో  యుద్ధానికి వెళ్ళానుకున్నాడు.  
     రాజును చూసి అతడు వణికి పోయాడు. రాజు అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో తోచక తన భయం కప్పిపుచ్చు కుంటూ " తప్పకా గెలుస్తారు" అన్నాడు. 
  రాజులకు అనుకూలమైన  మాటలే  చెప్పాలి. లేకుంటే ప్రాణాలకే ముప్పు.  రాజు సంతోషంగా వెళ్ళిపోయాడు.  వెంటనే యుద్ధం ప్రకటించాడు. వీరోచితంగా పోరాడాడు.  ఆ రాజ్యాన్ని జయించి, విజయంతో తిరిగొచ్చాడు.
  ఇదిలా ఉంటె,  ఇక్కడ జాతీష్యుడు మాత్రం భయంతో బిగుసుకు పోయాడు. ఒకవేళ రాజు ఒడిపోతే ఇక ఇతడి పని ఖాళీ.   తప్పుడు  జోతీష్యం బయటపడుతుంది. చంపటం ఖాయం అనుకుని రాజు కాళ్ళ మీద పడి క్షమా భిక్ష అడగాలనుకున్నాడు. 
    విజయ గర్వం తో రాజు ఆర్భాటంగా వచ్చాడు.  రాజు గెలిచిన విషయం జ్యోతిష్యుడికి  తీయదుకదా? ఓడిపోయిన రాజు తనను చంపటానికే వస్తున్నాడు అనుకున్నాడు. అమాంతం రాజు కాళ్ళమీదపడి క్షమించమని అడిగాడు. తన కథంతా చెప్పాడు.
     రాజు ఆశ్చర్యపోయాడు. అయితే అయింది. మీ జోతీష్యం నా జీవితమే మార్చింది.  నేను ఒడిపోతాను అనిచెప్పివుంటే, నేను యుద్ధానికి వెళ్లి ఉండేవాడిని కాదు. నాకు ఈ అఖండ విజయం చేజిక్కేదికాదు. అంతా మన మంచికే. నీవు నాకు ఆస్థానంలో ఉండి  మంచి మంచి అనుకూలమైన మాటలే చెబుతూ ఉండు" అని పెద్ద జీతం ఇచ్చి తన కొలువులో పెట్టుకున్నాడు.
    కాబట్టి పిల్లలు! అనుకూల ఆలోచనలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. మనము ఎప్పుడు అనుకూల ఆలోచనలు చేస్తూ, అందరికి అనుకూలమైన మాటలే చెబుతూ వుందాం. సరేనా?
*౼ డా.దార్ల బుజ్జిబాబు*

No comments:

Post a Comment