Sunday, August 20, 2023

అటునుండి నరక్కురా అనే సామెత / జాతీయం / పలుకుబడి తెలుగునోళ్ళలో అప్పుడప్పుడు నానుతూవుంటుంది. ఎదో కొద్దిమందికి తప్ప మిగతావారికి అటునుండి నరక్కురా అనేసామెత అర్థంకాదు.

 150 మంది తలలు నరికిన అటునుండి నరక్కురా.
...........................................................

అటునుండి నరక్కురా అనే సామెత / జాతీయం / పలుకుబడి తెలుగునోళ్ళలో  అప్పుడప్పుడు నానుతూవుంటుంది. ఎదో కొద్దిమందికి తప్ప మిగతావారికి అటునుండి నరక్కురా అనేసామెత అర్థంకాదు. పనిని ఈ చివరనుండి ఆ చివరకు  మొదలుపెట్టు అనటానికి ఈ సామెతను ఉపయోగించడం జరుగుతుంది.

150 మంది తలలను బలితీసుకొన్న అటునుండి నరక్కురా అనే సామెత పుట్టుకకు చారిత్రిక కారణమేమిటో పరిశీలిద్దాం.

ఆంధ్రదేశానికంతటికి వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి పేరు బాగా పరిచయమున్నదే. ఈయనో కమ్మ జమిందారు. 

వాసిరెడ్డి వారి వంశానికి మూలపురుషుడు వాసిరెడ్డి వీరప్పనాయుడు / వీరపనేని.(మరికొందరిప్రకారం పద్మనాభ నాయుడు) వీరపనేని గొల్కొండ, మొగలుల కాలంలో నందిగామ పరగణాకు జమీందారుగా వుండేవాడు.ఇతనికి రామన్న, జగ్గన్న, వెంకటాద్రినాయుడనే ముగ్గురు కొడుకులు ఉండేవారు. మరణానికి ముందే వీరప్పనాయుడు తన సంస్థానాన్ని తన ముగ్గురు కొడుకులకు పంచిఇచ్చాడు. చింతపల్లి సంస్థానం జగ్గన్నకు దక్కింది.  

జగ్గన్న జగ్గభూపతిగా ప్రసిద్ధుడైనాడు.గొప్ప పరాక్రమవంతుడు, ధైర్యశీలి. ఇతనికి 17.4.1761 లో కొడుకు జన్మించాడు.అతనే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు.

సలాబత్ జంగ్ కు జగ్గన్నకు జరిగిన యుద్ధంలో జగ్గభూపతి మరణించడం జరుగుతుంది. జగ్గన్న తోపాటు అతనిభార్య అచ్చెమ్మ సహగమనం చేస్తుంది. కోస్తాలో జరిగిన చివరి సతీసహగమనం ఇదేనంటారు.

అప్పటికి వెంకటాద్రినాయుడికి రెండేళ్ళప్రాయం. పెదనాన్న రామన్న  వెంకటాద్రిని చేరదీశాడు. రామన్న కు సంతానం లేదు.నాయుడికి 17 సంవత్సరాల ప్రాయంలో రామన్న మరణించగా అతని సంస్థానం నందిగామకి, తండ్రి సంస్థానం చింతపల్లికి నాయుడే జమీందారైతాడు.

నాయుడు స్ఫూరదృష్టికలవాడు. సమర్థుడు, యోధుడు, ప్రజాసంక్షేమం కొరకు పాటుపడ్డాడు. దైవభక్తిపరుడు. శ్రీ కృష్ణదేవరాయలు లాగా 9 మంది కవులను పోషించాడు. ములుగు పాపయారాథ్యులు ఇతనికి ప్రధానమంత్రి. మేనమామ కూతురైన వెర్రాంబను పెండ్లాడాడు.

అయితే వెంకటాద్రి దుందుడుకు స్వభాషి.రోషగాడు, అభిమానధనుడు. కొన్ని విషయాలలో మోసగాడు కూడా.

సర్కారు పాలకుడైన సలాబత్ జంగ్ మరణాంతరం గుంటూరు మండలాలు ( జిల్లాలు ) బ్రిటీష్ వారి వశమైతాయి. బ్రిటిష్ వారి ప్రోద్భలంతో దాయాదులకు భరణం ఇస్తాడు. అంతేకాకుండా బ్రిటిష్ వారు ఇతని ప్రాబల్యం తగ్గించుటకు చింతపల్లిలో బ్రిటిష్ సేనలను వుంచుతారు. 

అందుకు కినిసి వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు రాజధానిని చింతపల్లి నుండి అమరావతికి మారుస్తాడు.అలా అవమానించబడి కాదు ఇతని ఏకైక కూతురు రాజ్యలక్ష్మి కోట గోడ మీద నుండి కాలుజారిపడి మరణించినందువలన, తరువాతి కాలంలో భార్య వెర్రమ్మ మరణించడం వలన చింతపల్లిలో ఉండటం ఇష్టం లేక అమరావతికి వచ్చేశాడని కొందరి అభిప్రాయం.

అమరావతికి రాజధానిని మార్చిన తరువాత ప్రజారంజకంగా పాలించాడు. జీవితచరమాంకంలో పిండారి దళాలు అమరావతి ప్రాంతాలలో దండువిడిసి దోపిడీలకు హత్యకాండలకు పాల్పడగా వారిని ఓడించి పారద్రోలాడు. ఇదే ఇతని చివరి యుద్ధం.

అమరావతి అటవీప్రాంతంలో చెంచులుండేవారు. వారు చెంచులులా జీవించకుండా దోపిడి దొంగలుగా మారి ప్రజలను దోచుకొనేవారు. కత్తికి, దౌత్యానికి దొరకకుండా చెంచులు దొంగతనాలు జనహత్యలు చేసేవారు.

ఇలాకాదని వారిని మోసంతో జయించాలని విందు ఏర్పాటుచేసి వారిని ఆహ్వానించాడు. వారి సంఖ్య 150.భోజనాల అనంతరం చెంచుదొంగలను కట్టేసి నిలబెట్టి తలలు నరకాల్సిందిగా తలారులకు అజ్ఞాపించాడు వేంకటాద్రి.

చావు తప్పదని తప్పించుకోటానికి వారు ఎంతో గింజుకొన్నారు. తలారులు తలలు నరకటానికి ఉద్యుక్తులు కాగా, మొదటివాడు చివరనుండి నరక్కురావాలని తలారులను ప్రాదేయపడ్డాడు. చివరికివాడు అటునుండే నరక్కురావాలని కోరాడు.

ఎందుకంటే కొన్ని తలలు తెగిన తరువాతనైనా నాయుడు మనసు మారి క్షమించి కొందమందినైనా వదిలేస్తాడని చెంచుల ఆశ.కాని నాయుడి ఆజ్ఞతో తలార్లు అందరి తలలు నరికేశారు.ఈ విధంగా చెంచులలో భయోత్పాతం కలిగించి వారి పీడ విరగడ చేశాడు.

ఇలా అటునుండి నరక్కురా అనే జాతీయం పుట్టింది.

అప్పుడు తలలు నరికిన ప్రదేశమే నరకుళ్ళపాడుగా పిలువబడి అక్కడో గ్రామం ఏర్పడింది. అదే ఇప్పటి నరకుళ్ళపాడు.

ఇలా సామూహిక హత్యలు చేయించిన తరువాత నాయుడికి పాపభయం పట్టుకొంది. నిద్రకరువైంది. అన్నం పురుగులుగా మారి కనబడిందని కూడా అంటారు.

పండితుల సలహా మేరకు బ్రాహ్మణులకు భూ, గో, సువర్ణదానాలు, బీదలకు వస్త్ర అన్న, ధన, ధాన్యా దానాలు చేసి, పాపపరిహారార్థం కాశీయాత్ర కూడా చేశాడు.

1817 అగస్టు 17వ తారీఖున  వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు అమరావతిలోని అమరేశ్వరునిలో ఐక్యమైనాడు.
......................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

No comments:

Post a Comment