Friday, August 25, 2023

బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్...

 ---------
బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్...
---------------

తెలివిడిలోకి వెళదాం రండి.

"బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః ఊరూ
తదస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో అజాయత"

భగవంతుడి యొక్క ముఖం బ్రాహ్మణుడిగా అయింది. క్షత్రియులు చేతులుగా అయ్యారు. ఆయన యొక్క తొడలు ఏవో అవి వైశ్యులయ్యారు. పాదాల నుండి శూద్రులు పుట్టారు అని ఈ శ్లోకానికి అర్థం.

చాలా మంది అనుకుంటున్నట్టుగా ఇవి‌ మనువు మాటలు కావు. ఇది పురుషసూక్తంలోని 13 వ శ్లోకం. ఇంతకు పూర్వం ఋగ్వేదంలో ఈ శ్లోకం ఉంది. 

"జన్మనా‌ జాయతే శూద్రః / సంస్కారాత్ ద్విజ ఉచ్యతే / విద్యయా యాతి విప్రత్వమ్ / బ్రహ్మ జ్ఞానాత్ బ్రాహ్మణః" అని మనువు చెప్పారు. అంటే పుట్టుక చేత శూద్రులుగా అంటే సామాన్యులుగా పుడతారు. సంస్కారంవల్ల అంటే అభ్యాసంవల్ల రెండవ జన్మను పొందుతారు మామూలుగా పుట్టి ఒక‌‌‌ వృత్తిని నేర్చుకున్నాక ఆ‌ వృత్తికారుడవడమే ద్విజుడవడం‌ అంటే. విద్య వల్ల విప్రులవుతారు లేదా విద్వాంసులవుతారు. బ్రహ్మజ్ఞానం వల్ల బ్రాహ్మణులవుతారు అని అర్థం.

మనుస్మృతిలో చెప్పబడి స్పష్టటతను, తెలివిడిని ఇచ్చాక భగవంతుడి ముఖం బ్రాహ్మణుడుగా అయింది. క్షత్రియులు చేతులుగా అయ్యారు. ఆయన యొక్క తొడలు ఏవో అవి వైశ్యులయ్యారు. పాదాల నుండి శూద్రులు పుట్టారు‌. అని మళ్లీ చెప్పబడుతుందా? అలా జరగదు. ఈ సత్యం తెలియకుండా  మనుస్మృతో, మరొకటో  బ్రాహ్మణుల్ని గొప్పగా చెప్పింది అని  రాద్ధాంతం చెయ్యడం తెలివి, తెలివిడి లేని మూర్ఖత్వం, విద్వేషవాదం అవుతాయి.‌ మనువే బ్రాహ్మణుడు కాదు. అసలు మనువు ఒకే వ్యక్తి కాదు. మనువు ఎవరు?‌ ఎంత మంది మనువులున్నారు? ఇవేవీ తెలియకుండా మూర్ఖంగా మనువాది అనీ, మనువాదం అనీ అఱుస్తునారు.

కులవ్యవస్థకూ, కులవివక్షకూ మనువుతో‌నో, మరో గ్రంథంతోనో  ఏ సంబంధమూ లేదు. మహాభారత కాలం వఱకూ కులం అనే పదం వంశం అన్న అర్థాన్నే సూచించింది. తరువాతి కాలంలో మనుషుల్లో కుత్సితమూ, మదమూ కారణాలుకాగా కులం‌ అన్న అవలక్షణం పుట్టి పెరుగుతూ ఈనాడు మనం చూస్తున్న స్థితిలో ఉంది. ప్రస్తుత కాలంలో రాజకీయ కారణాలవల్లా, వ్యక్తిగత లబ్ది కోసమూ,ఈ కులం అన్నది బలం పుంజుకుంది‌. ఇవాళ దగుల్బాజీలు కులోన్మాదులై సాంఘీక భద్రతకు ముప్పును తీసుకొస్తున్నారు. 

ఈ‌ "బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః ఊరూ
తదస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో అజాయత" శ్లోకం ఆలంకారికంగా చెప్పబడ్డది.  నాలుగు దశల్లోని మనుషులను చెప్పడం ఇది. ఒకటి, రెండు, మూడు నాలుగు స్థానాల్లో లేదా స్థాయిల్లోని మనుషుల్ని  తెలియజెయ్యడం కోసం ఇలా ఆలంకారికంగా చెప్పబడింది. నాలుగు వర్గాల మనుషులు  భగవంతుని అంగాలు ఎలా అవుతారు? మనుషులు భగవంతుని అంగాలు అవరు కదా? ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పటి బ్రాహ్మలు (పుట్టుకతో అని కాదు) దైవ,‌ పూజ, పురహిత సంబంధమైన కార్యక్రమాలు చేసే వాళ్లు  కాబట్టి మొదటి స్థానమైన మొహం అనీ, వీరంతో రక్షణ బాధ్యతల్ని నిర్వహించే రాజులు  అంతకు దిగువ స్థాయి అయిన చేతులు అనీ, ఉళ్లోని అన్ని పనులూ అంటే వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారమూ చేసే  వైశ్యులు (ఇవాళ మనకు తెలిసిన వైశ్యులు కాదు) ఇంకొంచెం దిగువ స్థాయి అయిన తొడలు అనీ, సామాన్యులు ఎవరో వాళ్లే (పుట్టు శూద్రులు అని కాదు) కింద స్థాయి‌ అయిన పాదాలు అనీ  ఆలంకారికంగా చెప్పబడ్డది.

అధికారికీ, సేవకుడికీ, ఉపాధ్యాయుడికీ,‌ విద్యార్థికీ, నాయకుడుకీ కార్యకర్తకీ, ప్రధానమంత్రికీ, లోక్ సభ సభ్యుడికీ తేడా ఉంది  కదా? ఆ తేడాల్లాంటివే ఈ శ్లోకంలో చెప్పబడ్డ తేడాలు. అవి నాలుగు వర్గాలే.  కానీ ఇవాళ మనలో ఎన్ని వేల కులాలున్నాయి? ఒక్క మనువు లేదా ఈ ఒక్క‌ శ్లోకం ఇన్ని వేల కులాలకు మూలమా? ఆలోచిద్దాం. ఉండాల్సిన విజ్ఞత లేకపొవడం వల్ల తప్పుడు‌ చింతనలూ,  మాటలు,‌ బుద్ధులూ వస్తాయి. మూర్ఖలకూ, విద్వేషవాదులకూ అవే వచ్చాయి. 

ఒక విషయాన్ని బలపఱిచేడప్పుడో వ్యతిరేకించేడప్పుడో సరైన ఎఱుక, పరిశీలన, అవగాహన ఉండాలి.‌ ఉండాల్సిన దాన్ని ఇకనైనా పొందుదాం. తెలివిడిలోకి వెళదాం రండి.

- రోచిష్మాన్ 
9444012279

No comments:

Post a Comment