Thursday, August 3, 2023

ఉప్పు గురించి....

 ఉప్పు గురించి మాట్లాడుకుని రెండేళ్లయింది కదా, మళ్ళీ ఒకసారి.

మనం ఎక్కువ ఉప్పు తింటే అంటే 10గ్రా కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తం లో ఉండిపోతుంది దానివలన రక్తం గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు చేరుతుంది. 

నీరు చేరిన రక్తం ఎక్కువయ్యి గుండెకి చేరుతుంది, ఈసారి గుండె గట్టిగాకొట్టి ఒక స్పందన లో పంపే రక్తం పరిమాణం పెరుగుతుంది. ఆ పెరిగిన పరిమాణం వలన రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. 

ఈ పెరిగిన ఒత్తిడి తట్టుకోడానికి మొదట్లో రక్త నాళాలు వ్యాకోచిస్తాయి, కానీ దీర్ఘకాలంలో గట్టిపడతాయి దానివలన సాగే గుణం కోల్పోతాయి. దాని వలన ఈసారి గుండె ఇంకా గట్టిగా, వేగంగాకొడుతుంది. దాంతో అప్పటికే సాగటం మానేసిన రక్తనాళాలు కుంచించుకు పోతాయి. 

రక్తనాళం వ్యాసార్థం తగ్గినపుడు బెర్నౌలి నియమం ప్రకారం ఒత్తిడి నాలుగు రేట్లు పెరుగుతుంది. అందుకని పెరిగిన ఒత్తిడి వలన ఎక్కువ రక్తం మూతపిండాల్లో వడకట్టబడుతుంది. అప్పుడు ఆ ఉప్పు మూత్రం లోంచి వెళుతుంది. అయితే దానికి మూత్రపిండాలు  వాటి సామర్ధ్యాన్ని దాటి మూడు నాలుగు రెట్లు పనిచేయాలి. అలా ఎక్కువ కాలం పనిచేయటం కుదరదు. 

ఈలోగా గుండె బలంగా కొట్టడానికి దాంట్లో ఉన్న కండరం సరిపోదు అందువలన కొత్త కండరాన్ని గుండె తయారు చేసుకుని దిట్టంగా తయారవుతుంది. అయితే అలా లావు అయ్యే క్రమంలో గుండె జఠరికలో ఉండే చోటు తగ్గిపోయి గుండె పంపు చేసే రక్తం తగ్గిపోతుంది. అలాగే గుండె పనిచేయాలంటే గుండెకీ రక్తం కావాలి కాబట్టి గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు  అంతటి మందమైన గుండెకి రక్తాన్ని అందంచలేవు. 

అపుడు మనం ఏమాత్రం గుండె మీద భారం వేసినా అంటే పరిగెత్తినా, కడుపునిండా తిన్నా
చివరికి శృంగారంలో పాల్గొన్నా గుండెకి రక్తం సరిపోక ఛాతీ లో నొప్పి వస్తుంది. ఇంకాస్త ఎక్కువైతే గుండెపోటు వస్తుంది. 

ఈలోగా మెదడులో రక్త నాళాలు చాలా చిన్నవి మరియు సున్నితమైనవి. ఇవి కొన్ని సార్లు ఈ ఒత్తిడికి మూసుకుపోయి ఆ రక్తనాళం వెళ్లే మెదడు కణజాలం రక్తం అందక చనిపోతుంది. అయితే అలాచనిపోయేవి చుక్కంత ఉంటాయి. కానీ ఒక పది ఇరవై ఏళ్లలో  ఈ చుక్కలన్నీ కలిసి మెదడు పనితీరు బాగా దెబ్బతీసి మతిమరుపు, డెమెన్షియా మొదలైన ఇబ్బందులు వస్తాయి. 

ఇవి కాక ఒకేసారి రక్త పీడనం పెరిగి మెదడులో రక్తనాళం పగిలి అక్కడ రక్త స్రావం అయ్యి పక్షవాతం రావచ్చు, లేదా మెదడులో ఒకేసారి ఒత్తిడి పెరిగిఊపిరి ఆగొచ్చు. 

ఈలోగా మూత్రపిండాలు కూడా బాగా పని చేసి చేసి అలసిపోయి ఇక పనిచేయటం మానేస్తాయి. దాంతో రక్తం లో నీరు ఒంట్లో కి చేరి ఒళ్ళు ఉబ్బుతుంది. అలాగే యూరియా, క్రియాటినిన్ లు పెరిగి ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తులు ఊది ఊది అలసిపోయి ఇక ఊపిరి తీయటం మానేస్తాయి.

కాబట్టి ఉప్పు తినాలా వద్దాఉప్పు రోజుకి ఐదు గ్రాములకి మించి తినకూడదు. పది గ్రాములు మనం సాధారణంగా తింటాం. లవణ ప్రియులు ఇరవై గ్రాములవరకు తింటారు. ఉప్పు తక్కువ తినటానికి కొన్ని చిట్కాలు.

1. ముందు తినే బల్ల మీద ఉప్పు తీసెయ్యాలి  అంటే కూర, చారులో ఉండే ఉప్పు చాలు. మళ్ళీ పెరుగులో, సరిపోలేదని అన్నంలో వేసుకోకూడదు. బదులు నిమ్మకాయ వాడొచ్చు.

2. యూట్యూబ్ లో చెప్పారని వండేటప్పుడు తగినంత ఉప్పు కాకుండా తక్కువ ఉప్పు వెయ్యండి, మెల్లిగా అలవాటు అవుతుంది.

3. పోపుల డబ్బాలో ఒక గిన్నెలో ఉప్పు వేసి పసుపు, కారం వెయ్యటానికి వాడే చిన్న చెంచా వాడండి. ఉప్పు వంటలో పిడికిలితో వెయ్యొద్దు.

4.ఆవకాయ లేనిదే తెలుగువాళ్ళకు ముద్ద దిగదు,ఒప్పుకుంటాను కానీ మూత్రపిండాలు ఒప్పుకోవు.కాబట్టి వారానికి ఒకసారి ముద్దపప్పుతో అంతే కానీ ప్రతి దోశకి ఒకజాడీ తినొద్దు.

5. అన్ని పచ్చళ్లకు పై నియమం పాటించాలి.

6.చిప్సు పొట్లంలో అందులో కనిపించని గాలి ఎంతో కనిపించని ఉప్పు అంత అలాగే, ఫ్రెంచి ఫ్రైసు, పాప్ కార్ను కూడా.

7. వంటలో ఉప్పు వేసేటప్పుడు అవి తినే అమ్మా నాన్నని,మీభోజనంలో ఉప్పు వేసుకునేటప్పుడు మీపిల్లల్ని తలుచుకోండి,అప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది.

8. చివరిగా ఉప్పు కొనేటప్పుడు ఉప్పు కోసం పిడికిలి బిగించి రక్తం చిందించిన గాంధీ తాతని గుర్తుకు తెచ్చుకోండి. గాంధీ తాతలాగే మీరు కూడా ఈ దేశానికి అవసరం. 

జై హింద్.

No comments:

Post a Comment