Friday, April 24, 2026

 కాఫీ కబుర్లు సంఖ్య 1167 (ఏప్రిల్ 21 - 2026) --    పుట్టగానే అందరూ పసి బిడ్డలే.. లోకజ్ఞానం లేనివారే.. పెరిగి పెద్దయ్యాక ఏమౌతారో తెలీదు.. ప్రయోజకులై రాణిస్తారో లేదో తెలియదు.  వారి తలరాతలు ఎవ్వరూ ఊహించలేరు. సంపన్న కుటుంబంలో పుట్టినా ఎందుకు పనికిరాక పోవచ్చు.. పేదవారింట్లో పుట్టినా హిమాలయాలంత ఎత్తుకి ఎదగవచ్చు.  మంచి స్థాయిలో ఉన్నవారు కాలక్రమంలో అథఃపాతాళానికి వెళ్లిపోవచ్చు.. కింద స్థాయిలో ఉన్నవారు టాప్ పొజిషన్లకి చేరుకోవచ్చు.. మళ్ళీ స్థాయిలు తారుమారు కావొచ్చు.  ఒక్కమాటలో చెప్పాలంటే ఓడలు బళ్ళు కావొచ్చు  బళ్ళు ఓడలు కావొచ్చు.  రాజకీయాలలో, వ్యాపార రంగంలో, సినీ పరిశ్రమలో ఈ ఛేంజ్ గేమ్ సర్వసాధారణం.  మనవంటి సామాన్యులం సహితం ఒక్కోసారి కష్టాల కడలిలో ఈదుతాం.. మరొక్కసారి ఆనందపు అంచులు చూస్తాం.  ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము.. అని భుజంగరాయ శర్మ గారు ఈ పరిస్థితిని ఎంతో అర్థవంతంగా ఓ సినీగీతంలో రాశారు.  కలిమి నిలవదు  లేమి మిగలదు  అన్నారు.  మహానుభావుల చరిత్రలకు అద్దం పడుతుంది ఈ పాట.‌  మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడు పొంగిపోకూడదు..  లేనప్పుడు, స్థితిగతులు మారినప్పుడు కృంగిపోకూడదు.  ఒక మెట్టు కిందికి జారినప్పుడు రెండు మెట్లు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేయాలి.  ఏ స్థాయీ, ఏ పరిస్థితీ శాశ్వతం కాదని మనం తెలుసుకోవాలి.  ముఖ్యంగా రాజకీయ రంగంలో..  పావులు కదిపే నైపుణ్యం ఉన్నవారి అపాయింట్మెంట్ కోసం మంచి స్థాయిలో ఉన్నవారు ఎదురుచూస్తారు.  ఓ ఐదేళ్ళో లేక పదేళ్ళ తర్వాతో  ఇలా ఎదురు చూసేవారు అదృష్టం బాగుండి అత్యున్నత పదవులు చేపడితే..  తనచుట్టూ తిప్పించుకున్న వారి అపాయింట్మెంట్ కోసం వారాలు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది.  అంటే ఎంత మార్పు.  అంతేకాదు.. అన్నివిధాలా టాప్ లో ఉంటూ ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నవారు హఠాన్మరణాన్ని పొందవచ్చు..  తత్ఫలితంగా ఊహించనటువంటి వ్యక్తి ఆ పొజిషన్ అందుకోవచ్చు.  మంచి స్థాయిలో ఉన్నప్పుడు విర్రవీగడానికి, గొప్పలు పోవడానికి ఏమీలేదు.  మనదంటూ మనకంటూ ఏమీ మిగిలదని, ఉండదు అన్న అక్షర సత్యాన్ని జ్జానులు ఏనాడో చెప్పారు.  ఇది అందరూ అన్వయించు కోవాలి.. -----  గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment