స్వీయ రచన.
జీవనపాఠం.
(కథ )
టి. వి. యెల్. గాయత్రి
***************************--
ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల.
"ఇంకా ఎంతమంది ఉన్నారు?" అసిస్టెంటు సూర్యను అడిగాడు డాక్టర్ రఘురామ్.
అప్పటికి మధ్యాహ్నం పన్నెండు అవుతోంది.
"ఇద్దరున్నారు సార్!పార్వతమ్మగారు వచ్చారు." చెప్పాడు సూర్య.
పార్వతమ్మ రఘురాముకు దూరపు బంధువైన సుందరరావు భార్య.వారికి ఇద్దరు మగపిల్లలు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.రెండేళ్ల క్రితం సుందరరావు గుండెపోటుతో చనిపోయాడు. ఏలూరులో ఉండే పార్వతమ్మ భర్త పోవడంతో ఇద్దరు కొడుకుల దగ్గర కొంతకాలం ఉండి మళ్ళీ సొంత ఊరుకు వస్తూ ఉంటుంది. హైదరాబాదులో పెద్ద కొడుకు నితీష్, మద్రాసులో చిన్న కొడుకు సతీష్ వుంటున్నారు.
ఊరికి వచ్చినప్పుడు రఘురామ్ దగ్గర చూపించుకొని వెళ్తూ ఉంటుంది. భర్త పోయిన దగ్గర్నుంచి పార్వతమ్మ దిగులుగానే ఉంటోంది. అయితే రఘురామ్ ఆమెకు వైద్యం చెయ్యటమే కాకుండా ఆమెతో చాలా స్నేహంగా ఉంటూ, అప్పుడప్పుడూ ఆమె పిల్లలతో కూడా మాట్లాడుతూ ఆమె బాగోగులు చూస్తూ ఉంటాడు. ఏలూరులో ఒక్కతే ఉన్నప్పుడు ఆమెకేమి కావాలో కనుక్కుంటూ ఉంటాడు. అందుకే రఘురామ్ ఇచ్చే మందుల కంటే రఘురామ్ చూపించే ప్రేమ ఆప్యాయతలే ఆమె మీద దివ్యంగా పనిచేస్తూ వుంటాయి.
"అక్కయ్యను పిలు!" అన్నాడు రఘురామ్.
లోపలికి వచ్చింది పార్వతమ్మ.
" ఎలా ఉన్నావు అక్కయ్యా! పిల్లలు ఎలా ఉన్నారు? అడిగాడు రఘరామ్.
" ఏముంది రఘూ! మీ బావగారు పోయిన దగ్గర్నుంచి ఏదోలే గడుపుతున్నాను. పిల్లల మీద ఆశపెట్టుకొని ఏం లాభం? " వైరాగ్యం ధ్వనించింది పార్వతమ్మ కంఠంలో.
"ఇద్దరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ సంసారాలతో వాళ్లు లక్షణంగా ఉన్నారు. ఇంకేమిటి బాధ?"
"నేనే వాళ్లకు బాధ!...వాళ్ళ దగ్గర ఉండలేకపోతున్నాను. అంతా యతిమతంగా ఉంటున్నారు. నా మాటంటే విలువలేదు.ఏదన్నా చెప్తే నా కొడుకులే నా మాట వినటం లేదు!...."పార్వతమ్మ కళ్ళల్లోంచి నీళ్లు కారాయి.చీర కొంగుతో ఒత్తుకుంది.
" అయ్యయ్యో!ఊరుకో అక్కయ్యా! ఇద్దరికీ నువ్వంటే చాలా ప్రేమ.మీరు చూసిన సంబంధాలే చేసుకున్నారు. ఇద్దరూ కూడా ఎంతో ఒద్దికగా ఉంటారు. నీ పిల్లల గురించి నాకు తెలీదూ!చిన్నప్పటి నుండి చూసినవాణ్ణి.వాళ్ళు... " రఘురాము మాట పూర్తిగా కాకుండానే అందుకుంది పార్వతమ్మ.
"పిల్లలిద్దరికీ నేనంటే ప్రేమ తరిగిపోలేదు రఘూ!విషయం దాని గురించి కాదు.పెద్దదాన్ని వాళ్ళ మంచికోరి నేనేదన్నా చెప్తే పిల్లలు వినటం లేదు!..." మళ్ళీ కళ్ళు ఒత్తుకుంది పార్వతమ్మ.
'చాదస్తంగా ఏదో చెప్పి ఉంటుంది. అందుకే వినటంలేదు.'మనసులో అనుకున్నాడు రఘురామ్. ఒకవైపు టైమ్ పన్నెండున్నర అయింది. స్నేహితుని ఇంట్లో సత్యన్నారాయణస్వామివ్రతం. నిన్న రాత్రి గృహప్రవేశానికి రఘురామ్ భార్య రమ్య ఒక్కతే వెళ్లి వచ్చింది. ఇప్పుడు వ్రతానికి వెళ్ళకపోతే భార్య కోపం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు రఘురాముకు. ఇప్పుడు అక్కయ్యకొచ్చిన కష్టం పూర్తిగా విని సమాధానపరచేసరికి ఎంతలేదన్నా గంట... గోడమీద గడియారాన్ని ఒకసారి చూసి
"విషయం ఏమిటో చెప్పు అక్కయ్యా!"అన్నాడు నెమ్మదిగా.
"మొన్న పెద్దవాడింటికి వెళ్లానా... నాలుగు రోజులు పనిమనిషి రాలేదు. వాడు ఆఫీసుకు వెళ్లే పిల్లవాడు కదా! కోడలు పిల్ల ఆ మాత్రం చేసుకోలేదూ? వాడొచ్చి అంట్లు తోమటం.. ఇల్లు చిమ్మటం.. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను 'ఆడంగి పనులు ఇంటి యజమాని చేయకూడదమ్మా!అరిష్టం పట్టుకుంటుంద'ని.ఆ పిల్ల వినదు.వీడు పట్టించుకోడు!నాకు చాలా కష్టం వేసింది రఘూ!. ఇలాగే అన్ని పనులు వాడికే అంట కడుతోంది ఆ పిల్ల.రేపు పిల్లలు పుడితే ఎట్లాగో? ఏమిటో? వాడే నీళ్లు పోసి,పాలు పట్టి చూసుకోవాలో ఏమో?అక్కడ ఉండలేకపోయాను. మీ బావగారికి ఇంట్లో ఒక్క పని చేయడం తెలియదు. నేను వెంటా వెనకా ఉండి చూసుకునేదాన్ని. మహారాజులాగా బ్రతికి వెళ్లిపోయాడు మహానుభావుడు. మా మామగారు మాత్రం కుండలో మంచినీళ్లు గ్లాసుతో ముంచుకొని ఎరగడు.అట్లాంటివంశంలో పుట్టి వీడు కూలీ వెధవలాగా పెళ్ళాం చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటే నాకెంత కష్టం వేస్తుంది చెప్పు!ఇంట్లో ఉంటే సరే!ఎలా ఉన్నా ఫర్వాలేదు.. బయటికి వెళ్లేటప్పుడు కొంచెం మంచి డ్రెస్సులు వేసుకోవద్దూ!దిక్కుమాలిన జీన్స్ ప్యాంట్లు, టీ షర్థులు వేసుకుంటుంది. పెళ్లి కానంతవరకు చిన్నపిల్లలే అనుకుందాము!పెళ్లయ్యాక కాస్త బాధ్యతగా ఉండొద్దూ? నేనేమన్నా అంటే అత్తగారు నస పెడుతుందని అనుకుంటారు. ఉద్యోగం చేస్తుందనే కానీ బొత్తిగా సాంప్రదాయం తెలీదు. మా కాలంలో ఇలాటివి ఎరుగుదుమా? అప్పటికీ మెల్లగా చెబుతుంటా చీరలు కట్టుకోమని.. పెద్దకోడలు ఇలా ఉంటే ఇక చిన్నకోడలు మరీ అధ్వాన్నం.. సెలవు రోజు లేటుగా నిద్రలేస్తుంది. ఆ తర్వాత హడావుడి.. ఏ పని చెయ్యటమూ చేతకాదు.. బయటతిళ్ళు అలవాటు. వంట చేసుకోవాలంటే కష్టం. అప్పటికీ నేను చేసిపెడతాను. పొద్దున్నే లేచి నాకు సహాయం చెయ్యాలని తెలీదు. వాళ్ళ పుట్టింట్లో ఉన్నట్లు పెళ్లయ్యాక కూడా బద్ధకంగా ఉంటే బాగుంటుందా? నేను నా పెళ్లయిన కొత్తల్లో మా అత్తగారికంటే ముందే లేచి కాఫీ డికాషన్ వేసి టిఫిన్లు చేసేదాన్ని. మా అత్తగారికి మా తోడికోడళ్లందరికంటే నేనంటేనే ఇష్టం...ఇద్దరి కోడళ్లకూ నా మాటంటే లక్ష్యం లేదు..మనసులో నేను ఎంతో బాధ పడుతున్నాను!"ఈసారి కొంగుతో గట్టిగా ముక్కు చీదుకుంది పార్వతమ్మ.
రఘురాముకు విషయం అర్థమైంది.' జనరేషన్ గ్యాప్.. తరాల మధ్య అంతరం.. లోకజ్ఞానం లేకపోతే వచ్చే సమస్య. ఇప్పుడు అక్కయ్యకు మెల్లగా చెప్పకపోతే రేప్పొద్దున పిల్లల దగ్గర మిగిలిన జీవితమంతా ఎలా ఉంటుంది?
పిల్లల్లో ఎంచదగ్గ లోపాలేమీ లేవు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదని పెద్దవాళ్లకు తెలియాలి.ప్రతి నిమిషమూ పిల్లల్ని గమనిస్తూ ఉండే కంటే ఏదో ఒక కాలక్షేపము చూసుకుంటే కొంత హాయిగా ఉంటుంది. ఇదంతా అక్కయ్యకు అర్థమయ్యేలాగా చెప్పాలి.ఆమెను సరైన దారిలో పెట్టాలి.'
"ఈ విషయం గురించి నేను పిల్లలతో మాట్లాడతానులే అక్కయ్యా! వాళ్ల గురించి తెలుసు కదా!మెతక పిల్లలు..కూర్చోబెట్టి చెప్తే అర్థం చేసుకుంటారు.. ఇంతకీ కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి?"అంటూ ఆమె నాడి పట్టుకొని పరీక్షించాడు రఘురామ్.
" ప్రయాణం చేసి వచ్చాను కదా!కాస్త వాపులు, నొప్పులు ఎక్కువయ్యాయి. "అంది పార్వతమ్మ.
"ఈ సారి మందులు మార్చి ఇస్తాను!" అంటూ అల్మరాలో చూచి " అక్కయ్యా! నీకు ఇవ్వాల్సిన మందులు ఇక్కడ లేవు. కేరళ నుంచి బాక్సులు నిన్ననే వచ్చాయి. ఇంకా వాటికి విప్పి మందులు సర్ది పెట్టలేదు. రేపు నేనే ఇంటికి వచ్చి మందులు ఇచ్చి వెళ్తాను!"
"మరి నేను వెళ్లిరానా!"అంటూ పార్వతమ్మ లేచింది.
ఆవిడతో మాట్లాడుతూ వరుండా దాకా వచ్చి ఆమెను కారు ఎక్కించి మళ్లీ లోపలికి వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న ఒక్క పేషెంటును చూసి ఇంటికి బయలుదేరాడు రఘరామ్.
"మీరెప్పుడూ ఇంతే!.. టైముకు రారు!.."
చిరచిరలాడింది రమ్య.
"నా లాంటి డాక్టరును వలచి వరించావు. ఎదురుచూపులు తప్పవు మరి! ఒక్క నిమిషంలో తయారయ్యి వస్తాను!వెళ్దాము!"అంటూ బెడ్ రూము లోకి వెళ్ళాడు రఘురామ్.
సత్యనారాయణస్వామివ్రతానికి ఇద్దరూ కారులో బయలుదేరారు.
" పార్వతమ్మ అక్కయ్య వచ్చింది రమ్యా!ఆవిడతో మాట్లాడి పంపించేసరికి ఈ టైము అయ్యింది "అన్నాడు రఘురామ్.
"వదినగారు ఎలా ఉన్నారు?"
"మామూలు సమస్యలే... కానీ ఈసారి ఆవిడకు నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలి!"అంటూ టూకీగా పార్వతమ్మకు వచ్చిన సమస్య చెప్పాడు రఘురామ్.
"ఆవిడ నా మాట వింటుందా?"
సందేహంగా అడిగింది రమ్య.
"చెప్పే రీతిలో చెప్తే వింటుంది. ముందు నువ్వు మొదలుపెట్టు!తర్వాత నేను కూడా ఆవిడకు చెప్తూ ఉంటాను! ఓర్పుగా నాలుగైదుసార్లు ఆవిడకు అర్థమయ్యేలా చెబుదాము!అక్కయ్య ఎక్కువ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా శేషజీవితం గడపాలి!"
రఘురామ్ మాటలకు నవ్వింది రమ్య.
*** **** **** ***** **** **** ****
రెండోరోజు మందులు తీసుకొని పార్వతమ్మ ఇంటికి వచ్చింది రమ్య. అప్పటికి భగవద్గీత పారాయణ చేస్తూ ఉంది పార్వతమ్మ. ఆవిడ వయస్సుఅరవై ఏళ్ళే కానీ భర్త పోవడంతో క్రుంగుబాటు వల్ల ఎక్కువ వయసు ఉన్నదానిలా కనబడుతోంది. ముతకగా ఉండే నేత చీరొకటి కట్టుకొని ఉంది. చిన్నబొట్టు.మొహం కళాకాంతి లేనట్టుగా ఉంది. కుశల ప్రశ్నలు అయ్యాక
"చూడండి వదినగారు!" అంటూ తన బ్యాగులో నుంచి డ్రాయింగ్ బుక్కు ఒకటి తీసింది రమ్య.
" ఏమిటిది? " అంటూ చూసిన పార్వతమ్మ ఆశ్చర్యపోయింది.
పుస్తకం నిండా చక్కటి దేవుడు బొమ్మలు వేసి ఉన్నాయి.
" అబ్బా! ఇంత చక్కటి బొమ్మలు ఎవరు వేశారు రమ్యా!" అడిగింది పార్వతమ్మ.
"నేనే వేశాను వదినగారూ! ఈమధ్య ఒక ఆరునెలల నుండి నేర్చుకుంటున్నాను.పిల్లలు ఉద్యోగాలని దూరంగా వెళ్లారు కదా! మీ తమ్ముడుగారు హాస్పిటలుకు వెళ్తే ఆయనకు ఇల్లు గుర్తుకే రాదు. ఖాళీగా ఉండటం ఎందుకని ఆన్లైనులో ఆర్ట్ క్లాసులో చేరి నేర్చుకుంటున్నాను!"
రమ్య చెప్పింది విని ముచ్చట పడింది పార్వతమ్మ.
"మీరు కూడా ఏదన్నా నేర్చుకోకూడదూ!"
"నా మొహం!నాకేమొస్తుంది?:అయినా ఈ వయసులో నేర్చుకుంటే మాత్రం వస్తాయా? పెడతాయా?.."నిరుత్సాహం ధ్వనించింది పార్వతమ్మ గొంతులో.
"ఎందుకురాదూ? మీకు ఏం పెద్ద వయసుయిపొయిందని? ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనసూ, శరీరమూ బాగుంటాయి.మీరు మీ సెల్లుఫోనులోనే నేర్చుకోవచ్చు!ఎవరికైనా మీకు తెలిసింది చెప్పొచ్చు!"
రమ్య మాటలకు నవ్వింది పార్వతమ్మ.
"ఎవరికైనా చెప్పటానికి నాకేం వచ్చు? ఈ పారాయణలూ... ఆ పారాయణలూ తప్ప!... "
బ్యాగులోంచి కొత్త సెల్ ఫోను తీసింది రమ్య.
"ఇది కొత్త ఫోన్.దీనిలో చాలా సమాచారం ఉంటుంది.మిమ్మల్ని ఒక వాట్సప్ గ్రూపులో చేరుస్తాను!అక్కడ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పించవచ్చు!లేదా మీకు తెలిసిన ఏవైనా శ్లోకాలు పద్యాలు నేర్పించవచ్చు! నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు." వివరించింది రమ్య.
"అదెట్లా? " అంది పార్వతమ్మ.
ఒక గంట సేపు సెల్లుఫోను ఎలా వాడాలో నేర్పిస్తూ అక్కడే కూర్చుంది రమ్య.
ఆ మర్నాడు రమ్య ఇంటికి వచ్చింది పార్వతమ్మ. ఆమెకు ఈ కొత్త సెల్లుఫోను చాలా బాగా నచ్చింది.అలా పదిరోజులపాటు పార్వతమ్మ దగ్గరికి రమ్య వచ్చి సెల్లుఫోను పరిజ్ఞానం అంతా నేర్పించింది. పార్వతమ్మకు కొత్త కాలక్షేపం ఏర్పడింది.
మధ్యలో రఘురామ్ వచ్చి ట్యాబు ఒకటి తెచ్చి పెట్టాడు. దానిలో తెలుగు టైప్ ఎలా చేసుకోవాలో చూపించాడు. అలా భార్యాభర్తలిద్దరూ పార్వతమ్మకు క్లాసులు తీసుకొని చాలా వరకు ఆమెకు నేర్పిస్తున్నారు.ఉత్సాహంగా నేర్చుకుంటోంది పార్వతమ్మ.ఇప్పుడామె ఒక ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు పెట్టే జూమ్ మీటింగులో పిల్లలకు రామాయణం చెప్తోంది. జూమ్ లో మంచిగా కనిపించటానికి మంచి మంచి చీరలు కట్టుకుంటోంది. నగలు పెట్టుకుంటోంది. ఇప్పుడామెలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. కొడుకుల గురించి కోడళ్ల గురించి పెద్దగా ఆలోచించటం లేదు.
నెలరోజులు గడిచాయి.
పార్వతమ్మ పెద్దకొడుకు నితీషు తల్లిని హైదరాబాద్ రమ్మని ఫోన్ చేశాడు.
రేపే ప్రయాణం.
ఆ రోజు సాయంత్రం పార్వతమ్మ కోసం కంప్యూటర్ ఒకటి తీసికొని వచ్చాడు రఘురామ్. దానిలో ఎలా మీటింగులకు హాజరు అవ్వాలో నేర్పించాడు.పార్వతమ్మ శ్రద్దగా నేర్చుకొంది.
ఆమె సంతోషంగా తను పిల్లలకు చెప్పే పాఠాల గురించి చెప్పింది.ఓపిగ్గా విన్నాడు రఘురామ్.
"అక్కయ్యా!నువ్వు ఇంకా నేర్చుకోవాలి!మనం నిత్య విద్యార్థులలాగా జ్ఞానాన్ని పెంచుకుంటూ,పంచుకుంటూ వెళ్ళాలి!కొడుకుల గురించి, కోడళ్ల గురించి ఎక్కువగా పట్టించుకోకు!పూర్వకాలంలాగా లేదిప్పుడు. ఆడపని, మొగపని అనే తేడాలు లేవు. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నట్లే మగపిల్లలు కూడా ఇంటా బయట పనులను సమర్థవంతంగా చేస్తున్నారు. అందరూ సమానమే!.. కాలం మారింది.ఈ మార్పు అంతా మన మంచికే అనుకోవాలి!అలాగే పిల్లల ఆహార విహారపు విషయాల్లో పెద్దగా పట్టించుకోకు!కోడళ్ళు చిన్నపిల్లలు.. పోనీ వాళ్ళు పుట్టింట్లో ఉన్నట్లు ఉన్నారనుకో!నువ్వు కూడా తల్లి లాగా చూసీ చూడనట్లు ఉండరాదూ!మనకు భగవంతుడు ఒక్క ఆడబిడ్డనైనా ఇవ్వలేదు.. కోడళ్లనే కూతుళ్లుగా చూసుకుందాము!వాళ్ళను బాధపెట్టి,నువ్వు బాధపడితే ఏం ప్రయోజనం? ఇప్పుడు చాలా మంది జంటలు పెళ్లి అవంగానే విడాకులు తీసికొంటున్నారు. అలా కాకుండా ఇద్దరి పిల్లల సంసారాలు చక్కగా ఉన్నాయి!అందుకు సంతోషిద్దాము!నువ్వు సంతోషంగా ఉంటూ, నీ పిల్లల్ని సంతోషంగా ఉండనివ్వు!లేకపోతే మిగిలిన జీవితమంతా బాధలమయం అయిపోతుంది."
మంద్రస్వరంతో రఘురామ్ చెప్తున్న జీవనపాఠాన్ని శ్రద్దగా విన్నది పార్వతమ్మ. ఇప్పుడిప్పుడే ఆమె మంచి విద్యార్తిగా కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటోంది. అలా నేర్చుకొని, నేర్చుకొని మంచి గురువుగా తయారవ్వాలని తాపత్రయపడుతోంది.
'ఇంక ఆమె గురించి దిగులుపడనవసరం లేద'నుకున్నాడు పార్వతమ్మ శ్రేయోభిలాషి రఘురామ్.
(సమాప్తం )
No comments:
Post a Comment