స్పురణ
స్ఫురణ అనే పదాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో అతి తరచుగా వింటూ ఉంటాం. దీనికి సరి అయిన ఆంగ్ల పదం ఇన్ట్యూషన్ (Intution). స్ఫురణ అంటే అంతరంగంలో నుంచి ఆకస్మాత్తుగా వెలువడే ఆలోచన. ఆది ఒక సమస్యకు పరిష్కారం కావచ్చు, అంతరాత్మ ప్రభోదం కావచ్చు.
ధ్యానంలో మనసు ఆలోచనా రహితమై, నిర్మల స్థితికి చేరినప్పుడు, అహం కరిగి ఆత్మతో కలిసిపోయినప్పుడు, శరీరక స్పృహ తగ్గి, కేవలం ఎరుకతో, ఎప్పుడైతే ఆత్మతో శరీరం అనుసంధానం అవుతుందో, శరణాగతిని ప్రదర్శిస్తుందో, అప్పుడు ఆత్మ కుహరంలో నుంచి స్ఫురణ అంకురిస్తుంది.
స్ఫురణ అనేది అంతరాత్మ సందేశం. చాలా స్ప్రష్టంగా ఉంటుంది. చాలా క్లుప్తంగా ఉంటుంది. ఆది విశ్వాజ్ఞగా భావించి వెంటనే ఆచరణలో పెడితే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి.
అందుకు ఒక ఉదాహరణను ఇక్కడ వివరిస్తాను. స్ఫురణ అనేది ఎలా ఉంటుందో , ఆది ఏమి చేయగలదో ఇక్కడ నిరూపిస్తాను.
అవి నేను ఇండియాలో కోలారులో కొత్తగా మెడికల్ కాలేజి చేరిన రోజులు. అద్దె తక్కువని ఊరికి చివర ఒక పెద్ద ఇల్లు అద్దెకి తీసుకున్నాం. నేను దుర్గ మాత్రమే ఇంట్లో ఉన్నాం. కిటికీ తలుపులు అన్నీ మూసి ఫ్యాన్ వేసుకుని పడుకున్నాం. అర్ధ రాత్రి దాటింది. దుర్గ బాత్రూం కోసం లేచింది. దుర్గ నన్ను లేపింది. ఒక లైట్ కిటికీ అద్దాల ద్వారా కనిపించింది. ఆది బ్యాటరీ లైట్ అని అర్ధమయ్యింది. అది ఇంటి చుట్టూ తిరగడం ఇద్దరం గమనించాం. మనుషుల గుసగుసలు మధ్యలో వినిపిస్తున్నాయి . వచ్చింది దొంగలు (decoits) అని అర్ధమయి పోయింది. అప్పుడు మా దగ్గర ఫోన్ కూడా లేదు. ఏం చేయాలో ఆలోచించే లోపలే దొంగలు కాలింగ్ బెల్ కొట్టారు. ఇద్దరం శబ్దం చేయకుండా వణికి పోతున్నాం. అంతలో దొంగలు ముందు తలుపుపైన కొడుతూ పెద్దగా శబ్దం చేయడం మొదలు పెట్టారు. ఏం చేయాలో అర్థం కాక “ఎవరు మీరు?”, అని గట్టిగా అరిచాను. అప్పుడు వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారు. తలుపు తీయమని, తీయక పొతే పగల గొట్టుకుని లోపలకు వస్తామని, చంపేస్తామని పెద్దగా అరుస్తూ బెదిరించడం ప్రారంభించారు. పరిస్థితి చెయ్యి జారి పోతుంది అని అర్ధమవుతుంది. సమయం ఎక్కువ లేదు అని అనిపిస్తుంది. దుర్గతో, “నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వు దేవుడి గదిలోకి వెళ్ళి దాక్కో” అని చెప్పాను. దుర్గ దేవుడి గదిలోకి ఎలాగోలాగా ఈ ఆపదనుంచి గట్టెంకించమని పెద్దగా ఏడుస్తూ ప్రార్ధిస్తుంది. బయట దొంగల వైపు నుంచి వచ్చే శబ్దం పెరుగుతూ ఉంది. అప్పుడు నిస్సహాయ స్థితిలో నేనూ దేవుడిని తలచుకున్నాను.
వెంటనే స్ఫురణ రూపంలో విశ్వమ్ నుంచి సమాధానం వచ్చింది. ‘ఎదిరించు’ అని. దేవుడి విగ్రహం ముందు కొబ్బరి కాయ కొట్టటానికి ఉపయోగించే పెద్ద రాయి పైన దృష్టి పడింది. ఆది అందుకున్నాను. “నేను అమెరికానుంచి వచ్చాను.నా దగ్గర గన్ ఉంది లోపలకు వస్తే కాల్చేస్తాను” అని వారి లాగే నేనూ పెద్దగా అరవడం మొదలు పెట్టాను. వారు నమ్మినట్లు లేరు. ఇంకా అరుస్తూనే ఉన్నారు. ఇక చివరి ప్రయత్నంగా కిటికీకి దూరంగా వచ్చి ఆ రాయితో కిటికీ అద్దాన్ని గట్టిగా కొట్టాను.తుపాకీ పేలినట్లు పెద్ద శబ్దం వచ్చింది. గాజు పెంకులు పగిలి కింద పడ్డాయి. బయటి నుంచి శబ్దం రావడం ఆగియింది. వారు పారిపోవడం పగిలిన అద్దాల మధ్య నుంచి కనిపించింది. మరుసటి వారమే ఇల్లు మారాం.
ఈ సంఘటనలో నేను ఏమీ చేశాను అనే విషయాన్ని ఒక సారి సింహావాలోకనం చేసుకుందాం.
ఈ సంఘటనలో మొదట నేనేం చెయ్యగలను? అని ఆలోచించాను. “ఏమీ చెయ్యలేను” అనే నిర్ణయానికి వచ్చాను. మనసును సూన్యం చేశాను.అహం కరిగి పోయింది. ఇద్దరం మా దేహాలను పరమాత్మతో అనుసంధానం చేశాం. సంపూర్ణ శరణాగతితో ఇద్దరం ప్రార్ధించాం. స్ఫురణ రూపంలో విశ్వమ్ నుంచి సమాధానం వచ్చింది. నా శరీరంతో విశ్వమే మమ్మల్ని రక్షించే కార్యాన్ని అమలు చేసింది.
ఇది మాకే కాదు. ధ్యానంలో మనసు ఆలోచనా
రహితమైన నిర్మల స్థితికి చేర్చి,, అహాన్ని కరిగించి, శరీరక స్పృహ తగ్గించి , ఆత్మతో శరీరాన్ని అనుసంధానం గావించి శరణాగతిని ప్రదర్శించే ప్రతి వారికి స్ఫురణ రూపంలో సమాధానం విశ్వమ్ నుంచి వస్తుంది.ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ఆచార్య డా అనిల్ ప్రసాద్
No comments:
Post a Comment