కోరికల కోతులనుంచి ఎలా విముక్తుల అవ్వాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.
ఆధ్యాత్మికత అంటే కేవలం పుస్తకాల జ్ఞానమే కాదు. అది హృదయాన్ని తాకే అనుభవం. ఈ సత్యాన్ని రామకృష్ణ పరమహంస సులభమైన ఉపమానాల ద్వారా, సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పేవారు. ఆయన మాటల్లో గంభీరమైన తత్త్వం కూడా పసిపిల్లలకి సైతం అర్థమయ్యేలా ఉండేది.
ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యులకు బోధ చేస్తూ ఇలా చెప్పారు... 'మనిషి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు, మనసు తరచూ చెదిరిపోతుంది. దానికి కారణం వాసనలు, కోరికలు. అవి మనిషిని వెంబడించే కోతుల్లాంటివి' అన్నారు. అదె లాగో వివరిస్తూ ఒక కథ కూడా చెప్పారాయన.
'ఓ చెట్టు మీద కోతుల గుంపు కూర్చుంది. ఒక కోతిని బలవంతంగానో బెదరగొట్టో తరిమేస్తే, మిగతావన్నీ కూడా అక్కడనుంచి దూకి పారిపోతాయి. కానీ మళ్లీ కాసేపటికే తిరిగి వచ్చేస్తాయి. అలాగే మన మనసు కూడా కోతులతో నిండిన చెట్టులాంటిది. ఒక కోతిని తరిమితే కాసే పటికే మరో కోతి వస్తుంది. అదే కోరికల స్వభావం కూడా. కష్టపడి ఒక కోరికను వదిలించుకుంటే, వెంటనే మరో కోరిక మొగ్గ తొడుగుతుంది. అందుకే మనిషి జీవితం అంతా విషయ వాంఛలతో పోరాటంలోనే గడుస్తుంది' అని చెప్పారు పరమహంస.
నిజమేకదా. మనిషికి జీవిత మంతా ఒకదానివెంట ఒకటిగా వచ్చే కొత్త కొత్త కోరికలను నెరవేర్చుకోవడంతోనే సరి పోతుంది. ఉదాహరణకు- మొదట కాస్త డబ్బు ఉంటే చాలనుకుంటాం. ఆ డబ్బుతో అవసరాలు తీరాక విలాసాలకు వెళ్తాం. అవీ వచ్చాక పేరు కావాలి, పేరు వచ్చిన తరవాత అధికారం కావాలి. ఇక వాటికి అంతం అంటూ ఉండదు. ఇవన్నీ వరసగా వచ్చే కోతుల్లాంటివే.
అంతమాత్రాన కోరికలను వదిలించుకోవడం మన వల్ల కాదని రామకృష్ణ పరమ హంస చెప్పలేదు. వాటినెలా గెలవాలో బోధించారు. కోటానుకోట్ల కోరికలను అదుపు చేయాలనే ప్రయత్నంలో సమయాన్ని వృథా చేయవద్దన్నారు. 'ముందుగా ఒకే ఒక్క కోరిక - భగవంతుడి గురించి ఏర్పరచుకోవాలి. ఆ ధ్యాసలోకి ఎప్పుడైతే మనసు మళ్లు తుందో అప్పుడు మిగతా కోరికలన్నీ తామరాకుపై నీటి బిందువుల్లా వాటంతటవే జారి పోతాయి' అని చెప్పేవారు. గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఇది. మనసు భగవంతుడి పైన నిలిచినప్పుడు ఇహలోక వాంఛలు మనసులోకి ఎలా రాగలుగుతాయి?
ఈ మాటలు మన దైనందిన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. కుటుంబం, ఉద్యోగం, సంపాదన- ఇవన్నీ అవసరమే. కానీ మనసంతా అవే నిండిపోకూడదు. ఒక నిశ్చల ఆధ్యాత్మిక కేంద్రం మనిషికి అవసరం. అది లేకపోతే కోరికల కోతులు మనల్ని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వవు. రోజులో కొంత సమయం భగవన్నామస్మరణ, ప్రార్థన, ధ్యానానికి కేటాయిస్తే, మనసు ప్రశాంతమవుతుంది.
రామకృష్ణ పరమహంస చెప్పినట్లు, కోరికల నుంచి విముక్తం కావడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం- ఆ పరమాత్మను ఆశ్రయించడం. మనసా వాచా కర్మణా ఆయనపై నిలిచిన మననే నిజమైన శాంతిని, అసలైన ఆనందాన్ని అనుభవిస్తుంది.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment