సందేహానికి, ధర్మ సందేహానికి తేడా ఏమిటి?
సందేహం ప్రతి ఒక్కరికీ వచ్చేదే.
వినుదట జీవుల మాటలు, చనుదట చనరాని చోట్లకు…. భక్తులకోసం—
సందేహమయ్యె కరుణావార్థీ! —అని గజేంద్రుడు భగవంతుడి ఉనికి గురించి సందేహంలో పడ్తాడు.
పెద్దవాళ్లు ఈ మాట చెప్పారు. భగవంతుడు ఎపుడూ భక్తపరాధీనుడు అని.
కానీ, ఇపుడు నా విషయంలో జరగలేదే— నీనింత కాలంగా ఏడుస్తూ ఉన్నా ఆయనకు నా ఘోష వినబడలేదే?
వాళ్ళు చెప్పింది అబద్ధమా ? —అని సందేహం వచ్చింది.
భగవంతుడు కనబడ్డాడు.
సందేహం తొలగి పోయింది .
*****
రెండు రకాల ధర్మాలు స్ఫురిస్తూ ఉన్నాయి.
ఏ ధర్మం ఇపుడు నేను పాటించాలి? అని ఆలోచనలో పడితే అది ధర్మసందేహం.
భారతం, మన పురాణాలూ ఈ ధర్మసందేహాలు తీర్చి మనిషిని చక్కటి మార్గంలో నడపడానికని పుట్టినవే. భారతంలో శాంతి ఆనుశాసనిక పర్వాలలో ధర్మరాజు అడగగా భీష్ముడు చెప్పిన కథలు ఇలాంటి ధర్మసందేహాలు తీర్చడానికి చెప్పినవే.. కేవలం కథలు వినడానికి ఆ దశలో ఉన్న తాతగారిని వాళ్ళు శ్రమపెట్టలేదు.
రామో విగ్రహవాన్ ధర్మః —అని చెప్పారు.
రాముడు ఆచరించినట్లు అందరూ నడవాలి.
ఆయా సందర్భాలలో రాముడి ప్రవర్తన గమనిస్తే మనకేర్పడే సందేహాలు తీరిపోతాయి.
వేదములకు అఖిల స్మృతి|
వాదములకు బహుపురాణ వర్గంబునకునకున్ |
వాదైన చోటులను తా |
మూదల ధర్మార్థకామ మోక్ష స్థితికిన్| —
అని నన్నయ వ్యాస మహాభారతం గురించి అంటాడు.
ధర్మం ఒకటే కాదు. అర్ధం, కామం , మోక్షం ఈ నాలుగు విషయాలలోనూ మనిషికి ఏర్పడే సందేహాలు తీరడానికి భారతమే ప్రమాణమైన ఆకరం అని.
ఒకే వేదంలోనే ఒక వేదవాక్యం ఒకటి చేయవలెనని శాసిస్తున్నది. మరో వేదవాక్యమేమో మరొకటి చేయమంటున్నది.
ఒక సంకటస్థితి వచ్చిపడింది .
ఈ రెండింటిలో ఇపుడు ఏది శిరోధార్యం? అని సందేహంలో పడినప్పుడు భారతంలో కనబడినదే ఆచరించండి—అని.
మాతా పితల మాట తప్పక పాటించాలి.
మాతృదేవో భవ! పితృదేవో భవ! అని రెండు అనుశాసనాలు . రెండింటిలో ఏది బలీయం?
సత్యవతి వ్యాసమహర్షితో అంటుంది:—
జనకునకున్ స్వామిత్వము తనయోద్దేశమున నున్కి నిత్యము.
కానీ , నా మాట గూడా పాటించవచ్చు.
వంశం నిలపవలసినదిగా కోరుతూ (ఆది. 4–240) ఆమె అన్నమాట ఇది.
అంటే ఇక్కడ తండ్రికి కొడుకుపై పూర్తి అధికారం ఉన్నది అని.
****
మాతృదేవోభవ అని గూడా ఉంది గదా!
తల్లి మాట ఎపుడూ తోసివేయని నియమంలో ఉన్నవాళ్ళు పాండవులు.. ఆమే చిన్నప్పటి నుంచి పెంచి పోషించింది..
లక్క యింట తగలబెట్టడానికి ఆ పంపడం. .
పైకి —*కాశీలో గంగకు పుష్కరాలు వచ్చాయి. అక్కడ కొంతకాలం ఉండి, పాండురాజుకు ఔర్ధ్వదైహిక కర్మలు చేసి రండి*— అని చెప్పాడు ధృతరాష్ట్రుడు.
"ఇపుడే యువరాజైన వాణ్ణి ఇలా పంపేస్తున్నాడేమిటి? " —అని ధృతరాష్ట్రుడి బుద్ధి ఎరిగినవాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు.
ఇది బాగా ఎరిగిన విదురుడు సాగనంపేటప్పుడు అందరితోపాటు నడుస్తూ ధర్మరాజుకు ఉన్నసంగతి మాటల్లోమాటగా ( వేరే వాళ్ళకు సందేహం రాకుండా ) అన్ని జాగ్రత్తలతో చెప్పేశాడు.
ఎవరికీ" ఆ మాటల్లో ఏమో ఉంది" అని అనిపించలేదు.
కుంతీదేవికి కొంత అర్థమయింది.
ఆమె జాగ్రత్తగా మాట్లాడుతున్నది.
"విదురుడు నీతో ఏదో చెప్పాడే. నీను వినదగిందైతే చెప్పు" అనింది చాటుగా మిగిలిన సోదరులకూ తెలియకుండా.
ధర్మరాజు నోరుమెదపలేదు..
చెప్పకపోతే తల్లి మాట విననట్లే ఔతుంది —అని ఆమె *చెప్పదగినదైతే* అని ముందే అని ధర్మరాజును రక్షించింది.
రహస్యం పెదవి దాటితే ఊరుదాటుతుంది.
లక్కఇల్లు చేరిన తర్వాత ఆ గుట్టు సోదరులందరి సమక్షంలో వినిపిస్తాడు ధర్మరాజు .
****
ధర్మం విషయానికి వస్తే—
ధృతరాష్ట్రుడు అన్యాయంగా జూదం ఆడించాడు.
రాజు, ( పెద్ద) తండ్రి.
ధర్మరాజు ఆడాడు.
ద్రౌపది అధర్మవిజిత అయింది.
ఈ సంగతి వికర్ణుడికే తెలిస్తే ధర్మరాజుకు తెలియదా? తెలుసు.
అక్కడ జరిగింది ఏమిటి? రాజు హృదయం స్పష్టంగా తెలియక భీష్ముడు మొదలైన పెద్దలు నోరుమెదపలేదు.
ధృతరాష్ట్రుడు * ద్రౌపది ధర్మ విజితా? అధర్మ విజితా ?* అని సభాసదులను అడగలేదు. వికర్ణుడు ఈ ప్రశ్న లేవదీశాడు.
ఈ సూక్ష్మం ధర్మరాజు చెప్పదలిస్తే చెప్పగలడు. అతడు సమర్థుడు అంటాడు భీష్ముడు.
ధృతరాష్ట్రుడు * కిం జితం? కింజితం?* అంటున్నాడు.
అది వింటూన్నాడు ధర్మరాజు. రాజు హృదయం అది. తెలుస్తూ ఉన్నది.
*రాజా పరం ధర్మః* అని ప్రవర్తిస్తున్నాడు ధర్మరాజు .
ఇక్కడ ఆ రాజపదవిలో ఉన్నవాడు చొరవ చేసుకుని ఆ భీష్ముడి మాట వింటూ ఉన్నవాడు ధర్మరాజును అడగాలి కదా!
"నీవేమంటావు? ద్రౌపది ధర్మవిజితా? కాదా?—నీ అభిప్రాయం ఏమిటి ?" అని.
సింహాసనస్థుడైన ఆయన అడగలేదు.
సభ అన్నపుడు అగ్రాసనసస్థుడైన రాజు అభిప్రాయం పాటించడం, దానికి తగినట్టు సభలో నడుచుకోవడం అందరి విధి ఔతుంది.
(మొదట పిలిపించినపుడే విదురుడి దగ్గర ఈ చర్చ చేశాడు ధర్మరాజు. పోగొట్టుకొనడానికే తలపడి వచ్చారు అందరూ . ఐనా, జూదం జరగకుండా చేయాలని చూచాడు ధర్మరాజు . కాలేదు).
భీష్ముడు తన జీవితంలో నమ్మి ఆచరించిన ధర్మమే అది. ధర్మరాజూ అదే ధర్మం పాటించాడు.
*****
సత్యం పలకాలి. అసత్యదోషం చాలా గొప్పది.
కానీ, అది అహింస కంటే బలమైనది కాదు అని తెలుసుకోవాలి.
అందుకే
భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు అంటుంది భారతం. .
ఇది ఉపాధిభేదాన్నిబట్టి మారడమూ ఉంటుంది.
అగ్నిదేవుడికే ఈ పరీక్ష వచ్చింది.
పులోమ ఒక ఋషికి భార్య అయింది.
ఈమె చిన్న పిల్లగా ఉన్నపుడు ఈమె తండ్రి పులోముడు అనే ఒకడితో "ఈ అమ్మాయిని నీకిస్తానురా" —అని చెప్పాడు.
తర్వాత ఆ పులోముడు దుష్మర్ముడై ఊరు వదలివెళ్ళిపోయాడు. సంఘబహిష్కృతుడైనాడు.
ఈ పిల్లకు భృగువుతో పెళ్ళి అయింది.
భర్త వెంట తపోవనాలకు చేరింది. అంతర్వత్ని అయింది.
భర్త ఫలాహరణార్థమో ఏమో వెళ్లాడు. ఇంట లేడు.
ఈ పులోముడు చాలా కాలానికి సొంత ఊరికి వచ్చాడు.
ఈ అమ్మాయి ఆరా తీశాడు. తెలుసుకొని సరాసరి ఆశ్రమానికే వచ్చేశాడు.
ఈమె నాకు పితృదత్త. . నాది . అంటూ ఆమెను వశం చేసుకోదలచాడు.
అక్కడ హోమాగ్ని వేల్పబడి జ్వలిస్తూ ఉన్నది .
అగ్నిదేవుణ్ణి అడిగాడు. *ఈమె ఎవరు?* అని.
ఆయన అసత్యదోషానికి వెరచి సత్యం పలికాడు.
వాడామెను తరుముకొని పోతున్నాడు.
అపుడు ఆమె గర్భం నుండి చ్యుతిని పొందిన శిశువు (చ్యవనుడు) తన చూపుతో అతణ్ణి భస్మం చేశాడు. (గర్భాత్ చ్యుతః చ్యవనః) తల్లిని కాపాడాడు.
భృగువు వచ్చి అగ్నిపై ఆగ్రహించి శపించాడు.
*సర్వభక్షకుడివౌతావు * అని ఆ శాపం.
అగ్ని అపవిత్రమై పోయి హోమాలు ఆగిపోయాయి.
బ్రహ్మదేవుడు వచ్చి " నీవు సర్వభక్షకుడివే ఐనా సర్వపూజ్యుడవుతావు " అని శాపవిమోచనం చేస్తాడు.
ధర్మో రక్షతి రక్షితః అన్నది భారత పరమార్థం.
అగ్ని రక్షింపబడ్డాడు.
ధర్మరాజూ రక్షింపబడ్డాడు.
సందేహం పెద్దవాళ్ళ ద్వారా తీరేది. సమయానికి అలాంటి అవకాశం లేదు. అపుడు ఉత్తములు తమ అంతఃకరణమే ప్రమాణం అని భావిస్తారు.
****
ఎప్పుడూ తప్పు చేయని తనువు ఉన్నట్టుండి తప్పు దారిలో నడవదు.
వ్యాసుడు శిష్యుల ఆకలిబాధ చూడలేక కాశీ క్షేత్రాన్నే శపించబోయాడు…
మా భూత్ త్రైపూరుషీ విద్యా
మా భూత్ త్రైపూరుషీ ధనం
మా భూత్ త్రైపూరుషీ కీర్తిః
కాశ్యాం నివసతాం సతమ్
అని మనసులో అనుకొంటూ చేతిలోకి కమండలువు నుంచి నీరు వంచబోతున్నాడు.
కానీ, చెయ్యి ముందుకు సాగిరాలేదు..
ఉదిలకొని కంపమందుచునుండె గాని
శాపజలమందుకో కేలు సాగదయ్యె— అని కాశీ ఖండం.
ఎప్పుడూ అయోగ్యపు పని చేయని శరీరం మనసు చేసే తప్పిదానికి అడ్డపడుతుంది.
శాపం పెట్టబోవడమే మహాపాపం అయింది.
*****
దుష్యంతుడు శకుంతల క్షత్రపరిగ్రహ క్షమా? కాదా? అనే ధర్మసందేహంలో పడ్తాడు.. (క్షమా అంటే తగినది అని )
ఋషి ఆశ్రమంలో ఉంది. బ్రాహ్మణకన్య యేమో??
ఐనా నా మనసు అనుచితవిషయాలలో నడవనిది ఇపుడు ఇలా ప్రవర్తిస్తున్నదే?— అని ప్రశ్నించుకొన్నాడు.
సతాం హి సందేహపదేషు వస్తుషు
ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః —
అనుకొని ఈమె నాకు పరిణయ యోగ్యయే అనే నిర్ధారణకు వచ్చాడు. ఐనా , అడిగి తెలుసుకొందాం — అని అక్కడ వెంటఉన్న అనసూయా ప్రియంవదలను అడిగి
సూర్యవంశజుడైన విశ్వామిత్రుడి కుమార్తె అని తెలుసుకొని
తన మనసు తప్పుచేయలేదు అనుకొంటాడు. [ క్షత్రియులు క్షత్రియకన్యలనే వరించడం శాస్త్రవిహితం].
****
బహుశ్రుతులైనవాళ్ళు ధర్మసందేహాలు తీర్చడంలో దక్షులు.
No comments:
Post a Comment