A Janaki:
*మమకారం ...*
*ఒకచో అవరోధం .*
➖➖➖✍️
```
పండరీపురం దగ్గరవున్న చంద్రభాగానది వొడ్డున ‘పరమానంద యోగి’అనే పరమభక్తుడు ఉండేవాడు. అతడు అనునిత్యం పాండురంగని ధ్యానంలో తరిస్తూ వుండేవాడు.
ప్రతి ఉదయం ఆయన లేవగానే, యింటివద్ద కాలకృత్యాలు తీర్చుకుని, చంద్రభాగానదిలో స్నానమాచరించి, నది వొడ్డున నిలబడి భగవద్గీతలోని 700 శ్లోకాలను పఠిస్తూ ఉండేవాడు.
ప్రతిశ్లోకం చివరన...
‘ఓం పాండురంగాయనమః’ అని పాండురంగనికి ఆ ఫలాన్ని అర్పిస్తూ ప్రార్ధించేవాడు.
ఈ కార్యక్రమం పరమానంద యోగి, క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేసేవాడు.
ఒకరోజు ఆ యోగివుంటున్న గ్రామంలో భారీవర్షం పడి జనజీవనం స్తంభించిపోయింది.
ఆ సమయంలో, శాలువాలు అమ్ముకునే ఒక వర్తకుడు, ఆ గ్రామంగుండా వెళ్ళవలసివచ్చింది. ఆ వర్తకుని వద్దవున్న అమూల్యమైన శాలువాలు తడిసిపోయే ప్రమాదం వుండడంతో, తనకు వచ్చే అపారనష్టాన్ని తలుచుకుంటూ, ఆ నష్ట నివారణకు, ప్రతి యింటికీవెళ్లి, తనకు ఆరాత్రికి ఆశ్రయమివ్వమని కోరసాగాడు.
కానీ, అందరివీ, చిన్నచిన్న యిండ్లు అవడం వలన, యెవరూ ఆయన కోరిక మన్నించ లేదు సరిగదా, ఆయన ముఖంమీదే తలుపులు వేసుకోసాగారు. ఆ వర్తకుడు, యెంతో దిగులుగా తిరుగుతూ, పరమానంద యోగి వుంటున్న చిన్నగుడిసెకు కూడా వచ్చి, ఆశ్రయం అడిగాడు.
ఆ వ్యాపారి కష్టాన్ని గ్రహించి పరమానంద, వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానించి, గుడిసె మొత్తంలో నీళ్లుకారని కొద్ది ప్రదేశాన్ని చూపించి, అక్కడ ఆయన అమూల్యవస్త్రాలు పెట్టుకోమని చెప్పాడు.
ఆ చిన్న ప్రదేశంలోనే వర్షంవస్తే, యోగి పడుకునేది, తడవకుండా. అయినా, ఆ సమయంలో, తన అవసరం తనకు గుర్తు రాలేదు, యోగికి. ఉన్నంతలో ఆ వ్యాపారికి తినడానికి పెట్టి, తానూ, ఆ వ్యాపారి, గుడిసెలో యింకొక ప్రక్క తడిగావున్న ప్రదేశంలోనే తలదాచుకుని, ఆ రాత్రంతా కాలక్షేపం చేసారు, భగవన్నామ స్మరణలో.
మరునాడు తెల్లవారుతూనే, వర్షం తగ్గుముఖం పట్టింది. ఆ వ్యాపారి పరమానంద యింటినుండి బయలుదేరుతూ, యెంతో కృతజ్ఞతా పూర్వకంగా, ‘మీరు నన్నూ, నా కుటుంబాన్ని, కష్టాల బారిన పడకుండా కాపాడారు. మీ ఋణం తీర్చుకోలేనిది. నా కృతజ్ఞతా సూచకంగా, యీ శాలువా తమరికి బహూకరిస్తున్నాను. కాదనకండి’ అని ఒక అతి ఖరీదైన, సుందరమైన శాలువా, యోగికి యిచ్చి నమస్కరిస్తూ శలవు తీసుకున్నాడు.
ఆ శాలువాని కాదనకుండా అంగీకరించాడు పరమానంద యోగి. దానిని నడుముకు కట్టుకుని, యధాప్రకారంగా, నది ఒడ్డుకు బయలుదేరి యోగి, భగవద్గీత శ్లోకాలు వల్లెవేయడం ప్రారంభించాడు. అయితే, నోరు దానిపని చేస్తున్నది గానీ, చేతులు మాత్రం, యెక్కువసేపు జోడించి, పాండురంగని స్తుతించలేక పోతున్నాయి. ‘ఎక్కడ నడుముకు కట్టుకున్న ఆ అందమైన, ఖరీదైన శాలువా తడిసిపోతుందో, మరకలు పడతాయో’ అని మాటిమాటికీ, దానిని సర్దుకోవడమే సరిపోయింది, యోగీ పరమానందకి.
యోగికి శ్లోకాలమీద ధ్యాస కుదరడంలేదు, శ్లోకం చివర
‘ఓం నమో పాండురంగాయనమః’ అన్నాడో లేదో గమనించడం లేదు. ఈ విధంగా ఆరోజు ప్రార్ధన ముగిసింది. ఎంతో అసంతృప్తిగా అనిపించింది యోగికి.
తాను చేసిన పొరపాటు అర్ధమైంది. అపరాధనా భావం ముంచెత్తింది యోగీ పరమానందని.
తాను చేసిన ఘోరతప్పిదం తనకు అర్ధమైంది. తననుతాను శిక్షించుకోవాలనుకున్నాడు.
వెంటనే, దగ్గరలోని తన వరిపొలంలోకి వెళ్లి, నాగలిని ఆ శాలువాతో కట్టి, దానిని తన నడుముకు బిగించుకుని, పాండురంగని ధ్యానం చేస్తూ, ఆ వరిపొలం దున్నసాగాడు.
ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి, తాను నాగలితో ముడివేసుకున్న శాలువాను విప్పి, ‘ఎవరు నిన్ను యింత ఘోరశిక్షకు గురిచేసారు?’ అని లాలనగా అడిగాడు.
దానికి సమాధానంగా,’బాబూ! నన్ను ఆపవద్దు.నన్ను యెవరూ శిక్షించలేదు. నన్ను ఆ పాండురంగడు శిక్షించే లోపే, నాకు నేనే ఈ శిక్ష వేసుకున్నాను’అని చెప్పి మళ్ళీ శాలువా కట్టుకోబోయాడు.
అందుకు ఆ బాలుడు, ‘అయితే, ఆ పాండురంగడే, నిన్ను ఆపితే ఆగుతావా?’ అని అంటూ, పాండురంగని రూపంలో ప్రత్యక్షమై, ‘నీలో ఏ తప్పిదము లేదు. నీకు ఏకొంచెం మమకార వాసనలు వున్నా, అవి యీ నాటితో తీరిపోవడానికే, నీకు యీ శాలువా మీద మమకారం కలిగేటట్లు చేశాను. నీవు ఆ వ్యాపారి నుండి, యేమీ ఆశించి అతనికి ఆశ్రయం కలిపించలేదని నాకు తెలుసు పరమానందా! నీలో వున్న అపరాధ భావం యిప్పటితో, తొలగిపోయింది’ అని భుజం తట్టి పాండురంగడు అంతర్ధానమయ్యాడు.
ఆనందాశ్రువులు వర్షిస్తుండగా, పరమానంద యోగి, పాండురంగని రూపాన్నే తలుచుకుంటూ, అక్కడే కూర్చుండి పోయాడు.
ప్రహ్లాదుడు చెప్పిన నవ విధ భక్తి లక్షణాలలో సారాంశం ఇదేకదా!
శ్రవణం, కీర్తనం, విష్ణోఃస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవే కదా నవవిధ భక్తిమార్గాలు.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
```
*_కోరని వరం_*
ఎవరైతే కోరికలన్నింటినీ విడిచిపెట్టి భగవంతుని వైపుకు సాగుతారో.. సముద్రం వంటి విశాలమైన మనసున్న అటువంటి వారిని.. నదులు సముద్రంలో కలిసినట్లుగా నదులవంటి విషయభోగాలు వెతుక్కుంటూ వస్తాయి.
ఒకసారి అన్నదమ్ములైన రావణ, కుంభకర్ణ, విభీషణులు ముగ్గురూ కలిసి బ్రహ్మను గురించి తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మదే వుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు తనకు ఎవరి వలనా మరణం కలగకూడదు అనే వరాన్ని కోరాడు. అప్పుడు బ్రహ్మ 'అది అసాధ్యం. దీనికి బదులు వేరే ఏదైనా వరం కోరుకో' అన్నాడు. రావణుడు ఆలోచించాడు-నరులు, వానరాలు అల్పప్రాణులు, బలం లేని వారు కనుక వారి వలన మరణం ఎలాగూ రాదు. బలవంతులైన యక్షులు, రాక్షసులు, దేవ తలు మొదలైన వారితోనే మరణం లేకుండా వరం కోరుకుంటే చాలు అనుకున్నాడు.
బ్రహ్మని కూడా అదే కోరాడు. 'తథాస్తు' అన్నాడు బ్రహ్మ. కుంభకర్ణుడు కూడా చావు లేని వరాన్ని పొందా లనే ఉద్దేశంతోనే తపస్సు చేసినా చివరకు బుద్ది భ్రమించి 'తనకు చక్కగా నిద్ర రావాలి' అనే వరం కోరుకున్నాడు. మహా సాత్వికుడైన విభీష ణుడు రావణ కుంభకర్ణులవలె తనకు ఎప్పుడూ మరణం రాకూడదని ఆశపడలేదు. 'ఎంతటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా నా బుద్ధి చెడు దారి పట్టకూడదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుని మరవకుండా ఉండునట్లు వరాన్ని ఇస్తే చాలు. ఇదొక్కటే నా కోరిక' అన్నాడు. విభీ షణుడి మాటలను విని సంతోషపడిన బ్రహ్మదే వుడు రాక్షసుడిగా జన్మించి ఉత్తమమైన సంస్కారం లేకపోయినా, నీ బుద్ధి మాత్రం అధర్మం వైపు సాగటం లేదు. నీలో ఉన్న ఈ సుగుణాలను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే 'నీవు అడగకపోయినా నిన్ను చిరంజీవిగా ఉండేట్లు వరం ఇస్తున్నానని' అన్నాడు.
అమరత్వం కోసం వందల సంవత్సరాలు తపస్సు చేసినా రావణుడికి తాను కోరుకున్నది దక్కనేలేదు. తనకు చావు రాకూడదు అని ఎప్ప టికీ కోరని విభీషణుడికి మాత్రం అమరత్వం దక్కింది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పే మాట ఇదే. మానవుడు విషయభోగాల వెంటపడి పరిగె త్తినంత కాలం అతడు కోరుకున్న భోగాలు అతడి నుంచి మరింత దూరమవుతాయి.
----సేకరణ
No comments:
Post a Comment