*ఆత్రేయగీత*
మొదటి భాగం
అధ్యాయము - 10
"ధర్మము”
సులువుగా చెప్పాలంటే ఏది అందరికీ శ్రేయస్కరమో అదే ధర్మము!
తన జీవనం తాను కొనసాగిస్తూ, సమాజం కోసం పాటుపడడం ధర్మం! అదేవిధంగా తనుపొందిన ఈశ్వర జ్ఞానంతో తాను తరిస్తూ ఇతరులను తరింపచేయడమే ధర్మం!
అటువంటి శ్రేయోదాయకమైన ధర్మాలలో అత్యంత పురాతనమైనది, ఎప్పుడూ నూతనంగా (క్రొత్తదిగా) విరాజిల్లేది సనాతనధర్మము!
వేదాలలో సూచించిన కర్మమార్గాన్ని, వేదాంతములలో (ఉపనిషత్తులు) సూచించిన జ్ఞానమార్గాన్ని సమన్వయపరిచేదే ధర్మం.
ధర్మం కాలానుగుణంగా మారవచ్చు కానీ సత్యం మారదు! అందుకే సత్యాన్ని ఆధారం చేసుకున్న ధర్మమే ఆచరణీయయోగ్యము!
సత్యము లోపించిన ధర్మము ఎక్కువ కాలము నిలబడదు. ధర్మము లేనిదే శాంతి, ప్రేమ, అహింసలకు మనుగడలేదు!
ఎంతోమంది మహర్షులు, ఎంతో తపనతో, తమ జ్ఞానానికి అందినంత మేర పరిశోధించి, లోతుగా విశ్లేషించి, అనుభూతి పొంది, మానవుల శ్రేయస్సుకోరి, అందరూ ఆచరించేటందుకు వీలుగా కర్మ, జ్ఞాన సూత్రాలతో కూడిన మానవధర్మాన్ని రూపకల్పన చేసేరు.
అసలు సత్యాన్ని గ్రహించడమే అంతిమ లక్ష్యంగా భావించి మహనీయులు సనాతనధర్మాన్ని ఎంతో నేర్పుతో రూపొందించడం జరిగింది. వారికి ఇంకొక ఉద్దేశము వుండేది కాదు. వారికి కులాలు తెలియవు, మతాలు అస్సలు తెలియవు. వారికి తెలిసిందల్లా “సర్వే జనాః సుఖినో భవంతు" మాత్రమే.
సనాతనధర్మం కేవలం సత్యాన్నే బోధిస్తూ, ఆ సత్యాన్ని జ్ఞానంతోనే తెలుసుకోవాలని గట్టిగా చెప్తుంది. అందుకు జ్ఞానంతో కూడిన కర్మలను ప్రతిపాదించింది. అంతేగానీ ధర్మం పేరిట ఎన్నో మతాలను, సాంప్రదాయాలను సృష్టించుకోడానికి కాదు.
అటువంటి మహత్తర ఆశయంతోనే దీని రూపకల్పన జరిగింది. కొన్ని వేలయేళ్ళ నుంచి జనులు ఎంతో విశ్వాసంతో దానినే నమ్మడం, ఆచరించడం జరిగింది.
కారణం సనాతనధర్మం వెనుక సత్యం వుంది కాబట్టీ. సత్యంతో పాటు జ్ఞానము, నిస్వార్థము వున్నాయి కాబట్టి. అందుకే ఎన్ని యుగాలైనా సనాతనధర్మం సనూతనంగానే వుంది.
సత్యం నుండి ధర్మం పుట్టింది! ధర్మంనుండి శాంతి, ప్రేమ, అహింసలు పుట్టేయి! అందుకే మన పూర్వీకులు సూచించిన “మానవధర్మంలో వీటిని వరుసక్రమంలో "సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస”లుగా పేర్కొన్నాయి!
సత్యం లేని ధర్మం ఆచరణ యోగ్యంకాదు! ధర్మం లేని శాంతి, అశాంతికి దారితీస్తుంది! ధర్మంలోని ప్రేమ, కపటాన్ని ఆశిస్తుంది! ధర్మం లేని అహింస, హింసను కోరుతుంది!
కాలక్రమేణా మానవుల ఆలోచనలో చాలా మార్పులు వచ్చేయి. సత్యం మాయమై స్వార్థ ప్రయోజనాలు చోటుచేసుకున్నాయి. సత్యం ఆధారంలేని ధర్మాలు ఆవిర్భవించేయి. సులువుగా అర్థమయ్యే ధర్మం ఎంతో
క్లిష్టమైందిగా తయారైంది.
అందుకే ధర్మాన్ని తెలుసుకోవాలంటే, సత్యాన్ని గ్రహించిన గురువును ఆశ్రయించాలి! అటువంటి మహత్తర ధర్మాన్ని మనం ఆశ్రయిస్తే, ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది!
అన్ని ధర్మాలు సత్యాన్ని తెలియపరిచేవే! అన్ని విశ్వాసాలు పరమాత్ముని తెలుసుకోడానికే! వాటికే మానవుడు ఒక్కోపేరు పెట్టుకున్నాడు! వాటిలోనే ఎన్నో సాంప్రదాయాలు, నియమాలు
కల్పించుకున్నాడు! సత్యం ఆధారంగా వున్నవి నిలుస్తాయి! స్వార్ధం ఆధారంగా వున్నవి నశిస్తాయి!
No comments:
Post a Comment