*ఆత్రేయగీత*
మొదటి భాగం
అధ్యాయము - 4.
"మనస్సు”
మనస్సంటే సంకల్పాల మూట. అన్ని చింతలకు, కోరికలకు, ఆవేశాలకు మనస్సే కారణం. ఏ అనుభూతి యైనా మనస్సే పొందుతుంది.
జీవుని జీవనప్రస్థానంలో మనస్సు ఎంతో ప్రముఖపాత్ర పోషిస్తుంది. పంచ కర్మేంద్రియాలను, పంచ జ్ఞానేంద్రియాలను శాసించేది మనస్సే. పని చెయ్యాలన్న కోరిక పుట్టేది మనస్సులోనే.
మనస్సు చేసే పనేంటంటే జ్ఞానేంద్రియాల ద్వారా విషయ దృశ్యాలను గ్రహించి బుద్ధికి చేర్చడం, బుద్ధి నిర్దేశించిన పనులను కర్మేంద్రియాల ద్వారా చేయించడం.
మనస్సు చంచలమైంది, చపలమైంది. దానిని నిగ్రహించుట కష్టము కానీ అసాధ్యము కాదు. ఈ చపలత్వము, చంచలత్వము నుండీ బయటపడాలంటే ముందుగా అవి మనస్సులో ఎలా ప్రవేశించాయో తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే స్వతహాగా ఇవి జీవునిలో లేవు. జీవుని అజ్ఞానంవలన, అజాగ్రత్త వలన ఇవి ప్రవేశించాయి.
మనస్సు జడమైనది కావునా స్వతహాగా ఏ కార్యము చేయలేదు. చైతన్యవంతమైన ఆత్మతో కలయిక వలన దీనికి చైతన్యం వచ్చింది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనస్సు జీవుని ఆధీనంలోకి వస్తుంది.
మనస్సు సహకరించడంతోనే జ్ఞానం తన పని మొదలుపెడుతుంది, జ్ఞానంతో ఆత్మను గ్రహించడం సులభము.
భగవంతునికి ఒక రూపం, ఒక నామం, ఒక మంత్రం కల్పించుకుంటున్నది మనస్సే. అనుమానం కలగడానికి, నమ్మకం కలగడానికి, కోరిక కలగడానికి, ద్వేషించడానికి, ప్రేమించడానికి, ఆలోచించడానికి మనస్సే కారణం.
దేని దగ్గరకు మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదియే “ఆత్మ”. సంకల్ప, వికల్పాలను చేసేది జీవుని మనస్సే. అలాగే ఉపాసించేది కూడా మనస్సే.
ఆత్మజ్ఞానం పొందగోరేవారు ముందుగా తెలుసుకోవలసింది “మనస్సు”ని! అందుకు మనస్సు సహకరించదు! కారణం ఆలోచించేది, ఆలోచింపబడేది కూడా మనస్సే కాబట్టి! అందుకే “బుద్ధి”ని వాడుకోవాలి! బుద్ధితో “జ్ఞానం” వికసిస్తుంది! జ్ఞానాన్ని “ఆత్మ” వైపు మళ్లించాలి. తద్వారా “ఆత్మానుభూతి” కలుగుతుంది!
శుద్ధి పొందిన మనస్సుతో పరమాత్మను గ్రహించవచ్చు. ఆత్మానుభూతికి మనస్సే ప్రధానము.
No comments:
Post a Comment