Monday, October 21, 2024

****ఆత్రేయగీత* రెండవ భాగం “పరావిద్య - అపరావిద్య" - 4వ భాగము

 *ఆత్రేయగీత*

రెండవ భాగం 

“పరావిద్య - అపరావిద్య" - 4వ భాగము

శ్రీ శాస్త్రి ఆత్రేయ

దేని దగ్గరకు జీవుని మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదే “ఆత్మ”. సంకల్ప, వికల్పాలను చేసేది జీవుని మనస్సే. అలాగే ఉపాసించేది కూడా మనస్సే. కాబట్టి ముందుగా మనస్సును శుద్ధిచేసుకొని పరబ్రహ్మమును ఉపాసించాలి. ఏ జీవుడు బ్రహ్మమును ఇలా సాధనచేస్తాడో అతనిని సర్వభూతములు కీర్తిస్తాయి.

జీవుని ముందు రెండు మార్గాలుంటాయి. ఒకటి
శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము లేక శాశ్యతానందము. ప్రేయస్సు అంటే బంధము లేక అనిత్యమైన ఇంద్రియానందము. వీటినే విద్య, అవిద్య మార్గాలనికూడా అంటారు. జ్ఞానులు శ్రేయస్సును అవలంబించి శాశ్వతసుఖాన్ని పొందుతారు. అజ్ఞానులు ప్రేయస్సును కోరుకొని క్షణికమైన సుఖాలను అనుభవిస్తూ మొహలాలసులై జననమరణ చట్రంలో ఇరుక్కుంటారు.

ఆత్మవస్తువు గురించి వినడమే ఆశ్చర్యము. విన్నవారు దానిని తెలుసుకొనుట కష్టం. దానిగురించి చెప్పే గురువు దొరకటం ఇంకా కష్టం. ఒకవేళ దొరికిన అతడు చెప్పింది అర్ధం చేసుకోవడం బహుకష్టం. ఆత్మజ్ఞానం తర్కంద్వారా అర్దంకాదు. అనుభూతి పొందిన గురుని ఉపదేశం వల్లనే అది సిద్ధిస్తుంది.

కర్మలను నిష్కామంతో ఆచరించి, తద్వారా చిత్తశుద్ధిపొంది, జ్ఞానంతో సత్యశోధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుట సులువైన మార్గము. ఆ పరమాత్మ వస్తువు కంటికి కనబడదు. ప్రతి జీవిలో నిఘాడంగా అది నెలకొనివుంది. దానిని
జ్ఞాననేత్రం(ఆత్మనిష్ఠ)తో గ్రహించవచ్చు.

ఈ ఆత్మజ్ఞానంతో సత్యమైన, సనాతనమైన,
నిత్యమైన, శాశ్వతమైన, సర్వవ్యాపకమైన, పురాణమైన "ఆత్మను” గ్రహించవచ్చు. ఆత్మ, అణువుకన్నా అణువైనది మరియు మహత్తుకన్నా మహీయమైనది. అది ప్రతిజీవి శరీరంలో నెలకొనివుటుంది. అక్కడే వుంటూ అన్నిచోట్లకు వెళ్లగలదు. జీవుని సుఖదుఃఖములతో ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. జీవి శరీరము నశిస్తుంది గాని ఆత్మ ఎల్లప్పుడూ చిదాభాసమై వుంటుంది.

మానవుని శరీరంలో ప్రముఖపాత్ర పోషించేవి
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. వీటికి చైతన్యాన్ని ప్రసాదిస్తూ, సాక్షీభూతంగా వుండేది ఆత్మ. ఇంద్రియములు మొత్తము పది. అందులో కర్మేంద్రియాలు ఐదు(మాట, చేతులు, కాళ్ళు, మలినం విసర్జించేవి, జననాంగము), జ్ఞానేంద్రియాలు ఐదు(చెవులు, చర్మము, నాలిక, కళ్ళు, ముక్కు).

కర్మేంద్రియాలతో వివిధకర్మలు చేస్తాడు మానవుడు. జ్ఞానేంద్రియాలు మనుజునికి వినికిడి, స్పర్శ, రుచి, దృష్టి, వాసనల జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఒకదానితో ఇంకొకటి పరస్పర సంబంధము కలిగివుంటాయి. ఇంద్రియములను, మనస్సును అదుపులో పెట్టుకున్న వ్యక్తికి ఇవి మిత్రులుగా వుంటాయి. ఎవడు వీటికి లోబడిపోతాడో వానికి ఇవి శత్రువులుగా వ్యవహరిస్తాయి.

మరి ఇంద్రియములను, మనస్సును జయించుట ఎట్లు? అన్నది జీవుని ముందున్న సవాలు!!

జీవుని మనస్సు చంచలమైంది, చపలమైంది. దానిని నిగ్రహించుట కష్టము కానీ అసాధ్యము కాదు. ఈ చపలత్వము, చంచలత్వము నుండీ బయటపడాలంటే ముందుగా అవి జీవుని మనస్సులో ఎలా ప్రవేసించాయో తెలుసుకోవాలి!

నిజం చెప్పాలంటే స్వతహాగా ఇవి జీవునిలో లేవు. జీవుని అజ్ఞానంవలన, అజాగ్రత్తవలన ఇవి ప్రవేశించేయి. వీటిని, జ్ఞానంతో అతిజాగ్రత్తగా బయటకు పంపాలి. అందుకు సాధన చెయ్యాలి. సాధనతో మనస్సు జీవుని ఆధీనంలోకి వస్తుంది. మనస్సును జయిస్తే అన్నీ జయించినట్లే. మనస్సుని తప్పా ప్రపంచంలో మిగతావన్నీ జయించినా, అవి కేవలం వ్యర్ధములే అవుతాయి. కావునా జీవునిలో వున్న ఆత్మే యజమాని! అదే పరమాత్మ!!.        

No comments:

Post a Comment