*ఆత్రేయగీత*
రెండవ భాగం
"పరావిద్య - అపరావిద్య" - 5వ భాగము
శ్రీ శాస్త్రి ఆత్రేయ
స్వప్న, జాగ్రదావస్థలలో కూడా ఏదీ విశ్వంతో ముడిపడివుంటుందో అదే పరమాత్మ. సకల జీవులలో అది జీవాత్మగా ప్రకాశిస్తుంది. జీవభావాన్ని పొందినవాడు, దానిని కలిగించువాడు కూడా పరమాత్మే.
ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది, అన్ని భూతములయందు నెలకొనియున్నది ఆ పరమాత్మే. ఏ శక్తితో గ్రహములు, నక్షత్రములు, ద్వాదశ సూర్యులు ఒక నిర్ణీతకక్షలో సంచరిస్తున్నాయో ఆ శక్తే పరమాత్మ. ప్రతిజీవి హృదయంలో పరమాత్మ సూక్ష్మరూపంలో వున్నాడు. ఉపాధులు వేరైనప్పటికీ ఆత్మ వస్తువు ఒకటే. నదులు వేరైనప్పటికీ నీరు ఒక్కటే కదా! ఒకే శక్తి నానావిధాలుగా వ్యక్తమౌతుంది. దీనిని గ్రహింపక నామరూప భేదాన్ని పరిగణిస్తుంటాడు జీవుడు.
పురమనగా శరీరము, అది పురుషునికి (ఆత్మకు) నివాసస్థానము. ఆ పురుషుని(ఆత్మను) ధ్యానించు వాడు ఎటువంటి దుఃఖమును పొందడు. శరీరం క్షీణించిపోతుంది, కొన్నాళ్ళకు నశిస్తుంది కానీ ఆత్మ మాత్రం నిత్యంగా వుండి ఇంకో శరీరాన్ని దాలుస్తుంది. జీవాత్మ శరీరాన్ని వదిలిన పిమ్మట ఆ జీవుని కర్మానుసారంగా, జ్ఞానానుసారంగా మరొక దేహాన్ని దాలుస్తుంది. కర్మ, జ్ఞానాన్ని బట్టీ అది మానవ, పశువు, పక్షి వంటి చర రూపాన్ని పొందవచ్చు లేదా చెట్టు, చేమ వంటి అచర రూపాన్నైనా పొందవచ్చు.
ఎలాగైతే నీరు, వాయువు ఏ వస్తువులో ప్రవేశిస్తే ఆ రూపం దాలుస్తుందో, అలాగే ఆత్మ కూడా ఆయా భూతములలో ప్రవేశించి ఆయా రూపములను ధరిస్తుంది. ఎలాగైతే సూర్యుని కాంతి ఒక వస్తువుపై పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుందో అలాగే ఆత్మ ఒక ఉపాధిలో ప్రవేశించినప్పుడు ఆ ఉపాధి చైతన్యాన్ని పొందుతుంది.
ఆ ఆత్మ వస్తువును వర్ణించుట దుర్లభము ఎందుకంటే అంతా అదే, అన్నీ అదే కాబట్టీ. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆ ఆత్మవస్తువును అనుభూతిపొంది బ్రహ్మానందాన్ని పొందుతాడు.
సకల జడజీవ పదార్ధములలో కూడిన ఈ సృష్టికి మూలమేది? అన్న ప్రశ్న ఎదో ఒక సందర్భంలో అందరూ తమకు తాము వేసుకొన్నదే! దానికి శాస్త్రయుక్తమైన సమాధానం మనకు ప్రశ్నోపనిషత్తులో లభిస్తుంది.
అన్నము (జడపదార్దము) మరియు ప్రాణము (శక్తి లేదా చైతన్యము) అనే మిధునం (జంట) మొదటిగా వెలిసింది. ఈ రెండింటి కలయికే ఈ సృష్టి. ఈ ధరణికి సంబంధించి సూర్య చంద్రులే ఈ మిధునం. ఒకటి చైతన్యాన్ని ప్రసాదించేది, ఇంకొకటి ఆ చైతన్యాన్ని స్వీకరించేది. అంటే సూర్యుడు పురుషత్వానికి, చంద్రుడు ప్రకృతికి సూచికలు.
ఆదిత్యుడు కిరణాల రూపంలో అన్ని చోట్లకి ప్రసరించి, అన్ని ప్రాణశక్తులను ప్రేరేపిస్తుంటాడు. ఇతడే వైశ్వానరుడనే పేరుతొ అన్ని జీవులందు “జఠరాగ్ని” రూపంలో వున్నాడు. జీవులలో ఆకలిదప్పులు కలుగుటకు ఇతడే కారణం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచమే తన స్వరూపంగా కలవాడు. ఇతడే కాలాన్ని శాసిస్తున్నాడు. కాలగమనం ఇతడివల్లనే సాధ్యపడింది. దిక్కులను సూచించేది ఇతడే.
పగలు-రాత్రిగా, శుక్ల-కృష్ణ పక్షాలుగా, అన్నము - వీర్యంగా, పదార్ధము-చైతన్యంగా, స్త్రీ-పురుషునిగా, జీవుడు - ఆత్మగా, ఆత్మా-పరమాత్మగా ఇలా అనేక మిధునములుగా వ్యక్తమౌతున్నవాడూ ఇతడే.
జీవులు చిత్తశుద్ధితో, జ్ఞానంతో, తపస్సుతో ఈ నిత్యసత్యమైన పరమాత్మను గ్రహించవచ్చు
No comments:
Post a Comment