ఓం నమో భగవతే శ్రీ రమణాయ
నదులు, సముద్రమును చేరి తమ వ్యక్తిత్వాన్ని(స్వభావాన్ని) కోల్పోతాయి. కాని అదే నీరు ఆవిరియై, వర్షమై గిరులపై కురిసి, ఏరులై సముద్రమునే చేరుతుంది. అట్లే వ్యక్తులు నిద్రలో తమ వ్యక్తిత్వమును కోల్పోతారు. కాని తమకు తెలియకున్నా, వారి వారి పూర్వ వాసనలకు అనుగుణంగా వ్యక్తులుగనే మరలి వస్తారు. ఆ విధంగా మృతి(చావు)లోగూడ సత్(ఆత్మ, సత్యం) నష్టంగాదు.
**
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ప్రశ్న :
భగవాన్! ధ్యానంలో నా మనస్సు నిశ్చలంగా ఉండటం లేదు. తద్వారా శోకం(దుఃఖం) కలుగుతుంది. ఏమి చేయాలి?
మహర్షి :
మనసు చలించినపుడెల్లా దానిని మళ్ళీ మళ్ళీ లోనికి మళ్ళిస్తూనే ఉండు. మనస్సు దుర్బలం గనుక సత్సంగం, ఈశ్వరారాధన ప్రాణాయామాదుల మూలంగా మనసును దృఢం చెయ్యి. అప్పుడు ఏమి జరుగుతుంది అంటే శోకం తొలగుతుంది. లక్ష్యం దుఃఖ నివారణమే కదా! ఆనందం నూతనంగా ఆర్జించేది గాదు. మన ప్రయత్నమంతా ఆనందం కానిదానిని ప్రక్కకు త్రోసివేయడమే.
**
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
మహారాష్ట్ర నుండి ఒక మరాఠి యువతి ఆశ్రమానికి వచ్చింది. మహర్షి సన్నిధిలో కొంత సమయం గడిపి, ఉన్నట్టుండి ఏడవటం ప్రారంభించింది. కన్నీళ్ళు కారుతూండగనే ఆమె, భగవాన్‌తో ఇలా అన్నది :
“మోక్షం అనేది ఒక్క జన్మలో సాధ్యముకాదని నాకు తెలుస్తూనే ఉన్నది. కాని ఈ జీవితంలో కాస్త మనఃశాంతికైనా నేను నోచుకోలేనా?"
నేను కొన్ని సంవత్సరాలుగా సాధన చేస్తున్నాను. అయినా నా మనస్సు స్థిరం కావడంలేదు. ధ్యానంలో ఏకాగ్రత కుదరటంలేదు. ఏమి చేయాలి?
మహర్షి, ఆమెవైపే స్థిరంగా చూపు సారిస్తూ ఇలా సెలవిచ్చారు .......
“ఆ సాధన ఇప్పుడు ఇక్కడ చేసి చూడు. అంతా సరి అవుతుంది."
ఆ తరువాత ఆమె, మహర్షి వద్ద సెలవు తీసుకొని సంతోషంతో వెళ్ళిపోయింది.
***
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ప్రశ్న :
భగవాన్! ధ్యాన ప్రయోజనం ఏమిటి? ధ్యానం, మనసును ఎట్లా నాశనం చేస్తుంది?
మహర్షి :
ధ్యానం అంటే ఒకే తలపును అంటి పెట్టుకోవటం. ఆ ఏక చింతన యితర తలపులన్నిటినీ దూరం చేస్తుంది. ధ్యానం సాగేకొద్దీ మనసు మెల్ల మెల్లగ అదుపులోకి వస్తుంది. ధ్యానం వదలకుండా చేస్తే మనస్సు దృఢపడుతుంది. అంటే చలించే మనసు యొక్క దౌర్బల్య స్థానంలోనే, ఏ భావంలేని శుద్దమనోస్థితి ఏర్పడుతుంది. శుద్ధమనసే, ఆత్మ.
***
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఒక భక్తురాలు :
భగవాన్! నేను స్వయంగా సాధన చేయలేకపోతున్నాను. ఏదైనా దైవశక్తి సహాయం కోసం ఎదురు చూస్తున్నాను! భగవాన్ దారి చూపవలెను!
మహర్షి :
ఆ సహాయాన్నే దైవానుగ్రహము అంటారు. మనస్సు దుర్బలం కనుక వ్యక్తిగతంగా మనం బలహీనం. అందుకు అనుగ్రహం కావలెను. సాధుసేవ అందుకొరకే. బలవంతుని ఆధీనంలో బలహీనుడు అణగి ఉండేటట్లు, దృఢమనసుగల సాధువుల సన్నిధిలో వ్యక్తి దుర్బల మనస్సు అణగుతుంది. వారి సన్నిధిలో ఉన్నది అనుగ్రహమే కానీ మరేదీ కాదు.
No comments:
Post a Comment