Wednesday, October 2, 2024

 *ఆత్మజ్ఞానం.....*

ఉదయం ఆకాశం ఎరుపు రంగుకు తిరిగితే చాలు ఇక సూర్యుడు వచ్చినట్లే.

చెట్టుకు పూలు పూస్తే చాలు, ఇక ఫలాలు వచ్చినట్లే.

అలాగే నీ అంతఃకరణంలో దైవీసంపద కూడుకుంటే చాలు ఆత్మజ్ఞానం - తద్వారా పరమాత్మ నీలో ప్రవేశించినట్లే.
కనుక ఈ అధ్యాయంలోని విశేషాలను చక్కగా గ్రహించి ఆసురీ సంపదను దూరంగాత్రోసివేసి దైవీసంపదను ఆహ్వానిద్దాం, వృద్ధి చేసుకుందాం.

వేదాంతంలో జీవుణ్ణి పక్షితో పోలుస్తారు. పక్షికి ముఖం సన్నగా ఉండి రెండు కళ్ళూ ముఖానికి అటూ ఇటూ ఉండి వేరు వేరు దృశ్యాలను చూపిస్తాయి. కాని మానవుడిలో ఆధ్యాత్మికమో - ప్రాపంచికమో ఏదో ఒక్క దృష్టే ప్రబలంగా ఉంటుంది.

ఆధ్యాత్మిక దృష్టి ఉన్నవాడు ఇంద్రియాలను, మనస్సును స్వాధీనంలో ఉంచుకొని తనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. ప్రాపంచిక దృష్టి ప్రబలంగా ఉన్నవాడు ప్రపంచంలోనే కూరుకుపోతాడు. అతడు తనలోని వాసనలను గురించి పట్టించుకోడు. దాని కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ - మరణిస్తూ ఈ సంసార జనన మరణ చక్రంలో కూరుకుపోతాడు. ఆధ్యాత్మిక దృష్టి గలవాడు తనలోని వాసనల గురించి విశ్లేషించి, అవి ఆసురీసంపద అయితే త్రోసివేసి, దైవీసంపదను వృద్ధి చేసుకుంటాడు. పరమాత్మకు దగ్గరవుతాడు.

No comments:

Post a Comment