Sunday, October 6, 2024

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

 🕉️ ఓం నమః శివాయ 🕉️

*అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.* 

 *అమ్మని పిలవాలి, కొలవాలి,పూజించాలి, ధ్యానించాలి.* 

విశేషించి బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం అమ్మ వారిని పరాశక్తి, అపరాజిత, లలితాదేవి, త్రిపురసుందరి, రాజ రాజేశ్వరి, కాత్యాయని, చిద్రూపిణి, పరదేవత, అపరదేవత, భగవతి- అని స్తుతించాయి.  

జగన్మాత నవదుర్గలుగా రూపాలను దాల్చి.. రాక్షసులను హతమార్చింది. లోకమాతే స్వయంగా యుద్ధానికి దిగటానికి కారణం. 

ఈ రాక్షసులందరూ స్త్రీని అబలగా భావించి ఏ పురుషుని చేతిలోనూ మరణించకూడదని వరం పొందటం. అందుకే సకల దేవతల శక్తులనూ తాను పొంది పరాశక్తిగా రూపొందింది. 

బ్రహ్మదేవుని శక్తితో బ్రాహ్మిగా, మహేశ్వరుని శక్తితో మాహేశ్వరిగా, కుమారస్వామి శక్తితో కౌమారిగా, విష్ణుశక్తితో వైష్ణవిగా, వరాహస్వామి శక్తితో వారాహిగా, మహేంద్రుని శక్తితో మాహేంద్రిగా, కాళిక శక్తితో చాముండిగా అవతారాలు దాల్చి.. 

దుష్టశక్తులను చీల్చి చెండాడింది. అంతేనా! సప్త మాతృకలుగా వెలసి శిష్టులను రక్షించుకుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనేది లోకసామాన్యం. కానీ అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే.. 

రాక్షసులంటే వేరెక్కడో కాదు మనలోనే ఉగ్రతాండవం చేస్తున్నారు. అంటే మనలోని దుష్ట శక్తులూ, దుర్మార్గపు ఆలోచనలే మనల్ని రాక్షసులుగా చేస్తున్నాయి. చెడు మార్గంలో నడిపిస్తున్నాయి. 

మనలో దుర్మార్గం నశిస్తే మనసు సాత్త్వికమవుతుంది. అప్పుడు జగన్మాత సాక్షాత్కారిస్తుంది. అమ్మని పిలవాలి, కొలవాలి, 
పూజించాలి, ధ్యానించాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. 

పిల్లలు జగన్మాత స్వరూపాలు
మన సంప్రదాయంలో ఆడపిల్లలను అమ్మ వారిగా భావిస్తాం. చిన్నవయసులో అమ్మాయిలను జగజ్జనని ప్రతిరూపాలుగా పూజించి తరిస్తాం. 

ఏడాది పాపను కుమారిగా, మూడేళ్ల పాపను త్రిమూర్తిగా, నాలుగేళ్లకి కళ్యాణిగా, ఐదేళ్లకి కాళికగా, ఏడేళ్లకి చండికగా, ఎనిమిదేళ్లకి శాంభవిగా, తొమ్మిదేళ్లకి దుర్గాదేవిగా, పదేళ్ల చిన్నారిని సుభద్రాదేవిగా అలంకరించి అర్చిస్తాం. 

ఇలా బాలను పూజించటం అంటే బాలాత్రిపుర సుందరిని ఆరాధించటమే.దేవీ ఆలయాల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంగా అలంకరించి నివేదనలు సమర్పిస్తారు. పాడ్యమి నాడు బాలాత్రిపుర సుందరిగా అర్చించి పులిహోర నివేదిస్తారు. 

విదియనాడు గాయత్రీమాతగా కొబ్బరన్నం నైవేద్యంగా పెడితే, తదియనాడు అన్నపూర్ణాదేవిగా ఆరాధించి మినపగారెలు సమర్పిస్తారు. 

చవితినాడు శ్రీలలితాదేవిగా పూజించి పెరుగన్నం నివేదిస్తే, షష్ఠినాడు మహాలక్ష్మిగా పూజించి కేసరి పెడతారు. సప్తమినాడు మహాసరస్వతిగా అర్చించి అల్లంగారెలు సమర్పిస్తే, అష్టమినాడు దుర్గాదేవిగా పూజించి శాకాన్నం నివేదిస్తారు. 

నవమినాడు మహిషాసుర మర్దినిగా అలంకరించి చక్రపొంగలి పెడితే, దశమినాడు శ్రీరాజరాజేశ్వరిగా అర్చించి పరమాన్నం సమర్పిస్తారు. 

ఈ పదిరోజుల్లో సరస్వతీ సప్తమి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి అత్యంత ప్రధానమైనవి. 

ఆడపిల్ల జీవనక్రమాన్ని సూచించే రూపాలు.. 
విష్ణువు దశావతారాలు జీవ పరిణామక్రమాన్ని సూచిస్తున్నట్లుగా దుర్గాదేవి నవరూపాలూ ఆడపిల్ల జీవనక్రమాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

ప్రథమం శైలపుత్రి. జన్మించి పుత్రిగా విలసిల్లడం. ద్వితీయం బ్రహ్మచారిణి. అంటే బాల్య, కౌమార దశల్లో ఆట పాటలు, చదువుసంధ్యలు. తృతీయం చంద్రఘంట యౌవనం. మంచి భర్త కోసం తపంచేస్తూ ఎదురుచూడటం. 

చతుర్థం వివాహం, సాంసారిక జీవనం. పంచమం స్కంద మాత. మాతృత్వంతో పరిపూర్ణతను సాధించటం. షష్ఠం కాత్యాయని. పిల్లలను తీర్చిదిద్దటం. సప్తమం శుభకరి. కుటుంబానికి శుభం చేకూర్చటం. అష్టమం మహాగౌరి. 

కుటుంబాన్ని వృద్ధి చేయటం. నవమం సిద్ధిధాత్రి. అందరి కోరికలనూ నెరవేర్చి గృహిణిగా విరాజిల్లడం. అంతేకాదు. 

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః’ అన్నారు. అంటే శ్రీహరి దశావతారాలు కూడా అమ్మవారి చేతివేళ్ల గోళ్ల నుంచే రూపొందాయని అర్థం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి- ఇలా అమ్మవారు మూడు శక్తులతో కూడి.. 

సర్వలోకాలనూ సంరక్షించే శక్తిమాత. ఎవరెప్పుడు పిలిచినా ఆనందంతో పొంగిపోతూ.. వారి కోరికలను తీర్చే కరుణామయి. అమ్మ కదా మరి! 

మాతృ రూపమే కాదు బుద్ధి, శాంతి, శ్రద్ధ, కాంతి, విద్య, లక్ష్మి, స్మృతి, నిద్ర, దయ, తుష్టి, భ్రాంతి.. ఇలా అనేకానేక రూపాలతో సకల జీవరాశినీ ఆదుకుంటోంది. 

అమ్మవారు దుర్గమాసురుణ్ణి చంపడం వల్ల ‘దుర్గ’ అనే పేరు వచ్చింది. దుర్గ అంటే సకల దోష నివారిణి. సర్వశుభప్రదాయిని. ‘ద’ కారం దైత్యగుణాన్ని ‘ఉ’ కారం విఘ్నాలను, ‘ర’ కారం రోగాలను, ‘గ’ కారం 

పాపాలను, ‘అ’ కారం భయాలను నశింపచేస్తాయి. అందువల్ల దుర్గను స్మరిస్తే చాలు.. చెడుగుణాలు, అడ్డంకులు, అనారోగ్యాలు, పాపాలు, భయాలు అన్నీ నశిస్తాయి. 

ఈ విషయం సాక్షాత్తూ పరమ శివుడే చెప్పినట్లుగా బ్రహ్మ మార్కండేయ మహర్షికి తెలిపాడన్నది పురాణ వచనం.

No comments:

Post a Comment