తప్పు చేసావ్ టాటా....
నిజంగా తప్పు చేసావ్....
ఎప్పుడో శతాబ్దాలకు పూర్వం నీ పూర్వీకులు పర్షియా దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చి, కాలక్రమేణా పారిశ్రామికంగా ఎదిగి, దేశాన్ని కూడా అభివృద్ధి చేసి, నేటికీ నీ మతస్తులు అతి తక్కువగా ఉన్నప్పటికీ దేశాన్ని అత్యధికంగా పురోభివృద్ధివైపు పయనింపజేస్తూ, ప్రతీ ఇంట్లో మీ ఉత్పత్తులలో కనీసం ఏదో ఒకటి అవసరమయ్యేలా ఇంటిలోకి, మనసులలోకి చొచ్చుకెళ్లిన వ్యాపార సామ్రాజ్య కుటుంబం నుంచి వచ్చిన నువ్వు.....
ముంబై తాజ్ హోటల్ మీద ముష్కరుల దాడిలో అన్యాయంగా చనిపోయిన నీ సిబ్బంది కుటుంబాలకి మొత్తం నష్టపరిహారం ఒకేసారి ఇచ్చి, ఆ కుటుంబాల్లో పిల్లలకు ఉచిత విద్య అందించి, ఒకరికి ఉద్యోగం ఇచ్చిన నువ్వు....
ఆ దాడి సమయంలో, నీ ప్రపంచస్థాయి ప్రసిద్ధ తాజ్ హోటల్ తో ఏమాత్రం సంబంధంలేని, ఏ స్థాయికి సరిపోని, ముష్కరుల దాడికి కూడా లోనుకాని చుట్టుపక్కల చిరు వ్యాపారులకు సైతం (చేపలు పట్టడం , పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల) వారి కుటుంబాల కోసం ఆలోచించి, వారందరికీ నష్టపరిహారం అందించి, ఆర్ధికంగా అండగా, మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచిన నువ్వు....
ఉగ్రవాదుల దాడులైనా, ప్రత్యక్ష యుద్దాలైనా, కరోనా వంటి ప్రపంచ మహమ్మారులైనా ఏమైనా కానీ, నా దేశ సౌభాగ్యం కోసం లక్షల కోట్ల నా వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తం ఇవ్వగలను అని ధైర్యంగా చెప్పిన ప్రపంచంలోనే ఏకైక మొనగాడివైన నువ్వు....
ముంబై వీధుల్లో వర్షంలో తడుస్తూ కష్టంగా బైక్ మీద వెళ్తున్న నలుగురు కుటుంబాన్ని చూసి, మొత్తం దేశంలో అటువంటి మధ్యతరగతి కుటుంబాల కోసం ఆలోచించి, అతి తక్కువ ఖర్చుతో, నీ కంపెనీకి నష్టం వస్తున్నా సరే, నలుగురు కుటుంబం క్షేమంగా వెళ్లే కార్ ను అందించిన నువ్వు....
కార్ భద్రతా ప్రమాణాలలో ఇతర ఏ కార్ కంపెనీలు సాధించలేని 5/5 రేటింగ్ పాటిస్తూ కుటుంబ భద్రతకు భరోసాగా నిలుస్తున్న నువ్వు...
ఇంగ్లాండ్ రాజుచే బిరుదు, సన్మానం కూడా వద్దనుకుని మూగ జీవాలు కోసం ఆసుపత్రిని నిర్మించి, సందర్శించిన నువ్వు....
ఇంటిపేరుతో కంపెనీ అధిపతి అయిపోయాడు అనే విమర్శకుల మాటలను వమ్ము చేస్తూ దేశీయ దిగ్గజ స్థాయినుంచి అంతర్జాతీయ ప్రముఖ స్థాయికి నీ కంపెనీలను తారాస్థాయిలో నిలబెట్టిన మేరునగధీరుడవైన నువ్వు....
కొద్దిమంది వికలాంగులైన పిల్లలకు చక్రాల కుర్చీలు అందించి అక్కడి నుంచి తిరిగి వెళ్లబోతుంటే ఆ పిల్లల్లో ఒకడు నీ కాలు పట్టుకున్నాడు. నువ్వు మెల్లిగా నీ కాలును విడిపించడానికి ప్రయత్నించినా పిల్లవాడు వదలలేదు మరియు అతను నీ ముఖం వైపు చూస్తూ నీ కాళ్ళను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు వంగి పిల్లవాడిని ఇంకేమైనా కావాలా? అని అడిగితే, అప్పుడు ఆ పిల్లవాడు ఇలా అన్నాడు: "నేను మీ ముఖాన్ని గుర్తుంచుకోవాలనుకుంటున్నాను, తద్వారా నేను మిమ్మల్ని స్వర్గంలో కలిసినప్పుడు, నేను మిమ్మల్ని గుర్తించగలను మరియు మరోసారి ధన్యవాదాలు చెప్పగలను." అటువంటి ఎంతోమంది విధి వంచితులకు సహాయసహకారాలు అందించి వారి నిండు మనసుల్లో కొలువైన నువ్వు.....
వ్యాపారం లాభసాటిగా మాత్రమే కాదు, విలువలతో కూడా నిండి ఉండాలి అని కుటుంబాల పరిరక్షణకై, వారి ఆరోగ్యం కోసమై ఇంతవరకు మద్యపానం, ధూమపాన రంగాల్లో అడుగుపెట్టని నువ్వు....
ఖరీదైన కాన్సర్ చికిత్సకు అతి తక్కువ ఖర్చుతో అత్యున్నత నాణ్యమైన వైద్య సేవలు దేశవ్యాప్తంగా అందిస్తున్న నువ్వు....
దేశంలోనే మొదటి విమానయాన సంస్థను మీ కుటుంబం నడుపుతున్నప్పుడు అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని జాతీయం చేసేస్తే..... మొన్నటివరకు విపరీత నష్టాల్లో ఎగురుతున్న ఆ ఎయిర్ ఇండియా కంపెనీని కొనుగోలు చేసి, తిరిగి అభివృద్ధి దిశగా రెక్కలు తొడుగుతున్న నువ్వు...
భారత్ మరియు విదేశాల్లో ఉన్న తమ హోటళ్ళన్నీ రీమోడలింగ్ చేయడం కోసం అతి పెద్దవైన టెండర్లను నీ కంపెనీ ఆహ్వానించినపుడు కొన్ని పాకిస్తానీ కంపెనీలు మన కేంద్ర మంత్రులతో నీకు సిఫారసు చేయించుకున్నపుడు "మీరు సిగ్గు లేని వారు కావచ్చు, నేను కాదు" అని మన దేశ కేంద్ర మంత్రులకు (కాంగ్రెస్ పార్టీ) ముఖం మీద చెప్పిన నువ్వు....
రెండు ఇస్లామిక్ దేశాలు నీ కంపెనీ సుమో కార్లను దిగుమతి చేసుకునే ముందు, పాకిస్తాన్ కు కూడా మీరు సుమో కార్లను పంపాల్సిందే అని అంటే, రక్తపు కూడు నాకూ, మా శ్రామికులకు అలవాటులేదని ఆ మొత్తం ఆ ఆర్డరును తిరస్కరించిన నువ్వు....
భారతదేశాన్ని వసుధైక కుటుంబంలా భావించి, భారతీయులను నీ కుటుంబసభ్యులుగా పరిగణించి, వాళ్ళందరి అవసరాలను తీరుస్తున్న నువ్వు.....
ఇంతవరకు దేశ చరిత్రలో ఏ పారిశ్రామికవేత్త మరణం ఇంతలా కోట్లమందిని, వ్యాపారమే తెలియని సామాన్యులను సైతం బాధపెడుతున్న మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నువ్వు.....
"ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమిపై తిరిగాడంటే భవిష్యత్ తరాలు విశ్వసించవేమో" అని మహాత్మా గాంధీని ప్రశంసిస్తూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పిన మాటలకు ప్రతిగా,
"ఇలాంటి ఒక దిగ్గజ పారిశ్రామికవేత్త, దాతృత్వం-మానవత్వం-దేశభక్తితత్వంతో ఈ భూమిపై తిరిగాడంటే భవిష్యత్ పారిశ్రామికవేత్తలు విశ్వసించరేమో అనేవిధంగా నీకు నీవే సాటిగా నిలిచిన నువ్వు....
స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి నేటివరకూ తరతరాలుగా ఒకే కుటుంబ వారసులమని గొప్పలు చెప్పుకుంటూ దేశాన్ని, రాష్ట్రాలను యేలేస్తూ, అధో:గతిపాలు చేసేస్తున్న ఈ క్లిష్ట సమయంలో,
నువ్వు నీ వ్యక్తిగత జీవితాన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా,
నీలాంటి అపురూపమైన వారసుడిని ఈ దేశానికి అందించకుండా,
లేదా ఎవరినైనా నీలాగ తీర్చిదిద్దకుండా,
మా భవిష్యత్తు కోసం ఆలోచించకుండా,
రతన్ లాంటి రత్నం ఉన్నారు అని చెప్పుకోనీయకుండా,
నీ భారతదేశ కుటుంబాన్ని విడిచి వెళ్లి
చాలా పెద్ద తప్పు చేసావ్ టాటా... రత్నమైన టాటా...
నువ్వు చేసింది తప్పే....
కానీ ఒక విషయం నిత్య సత్యం.
ప్రపంచంలో కోహినూర్ వజ్రం ఒక్కటే ఉంటుంది. ఇంకొకటి ఎప్పటికీ ఉండదు.
No comments:
Post a Comment