రామాయణమ్..89
...
అయోధ్య నుండి వచ్చిన దూతలు కేకయ రాజు అశ్వపతికి,యువరాజు యుధాజిత్తునకు నమస్కరించి నిలుచొని ,భరతుని వంక చూసి మన రాజపురోహితులు,మంత్రులు నిన్ను శీఘ్రముగా తిరిగి రమ్మని కోరినారు .నీతో చాలా తొందరపని ఉన్నదట! అని పలికి వారు తెచ్చిన విలువైన కానుకలను భరతుడి ద్వారా కేకెయ రాజుకు అందించారు.
.
అప్పటికే తనకు వచ్చిన కలతో దిగులుగా ఉన్న భరతుడు వారి నుద్దేశించి , మా తండ్రిగారు క్షేమమేనా ? మా రాముడు ,మహాత్ముడైన లక్ష్మణుడు వీరికి కుశలమే కదా?
.
పూజ్యురాలు ధర్మమునందే ఆసక్తిగలదీ ,ధర్మము నెరిగినదీ ,ధర్మమునే చూచేటటువంటిది ధీమంతుడైన రాముని తల్లి కౌసల్యామాత క్షేమమే కదా!
.
ధర్మములు తెలిసినది,లక్ష్మణ,శత్రుఘ్నుల కన్నతల్లి,మా మధ్యమాంబ సుమిత్రామాత కుశలమే కదా!.
.
తన సుఖమునే కోరుకునేది (ఆత్మ కామా),ఎల్లప్పుడూ తీవ్రముగా ప్రవర్తించేదీ( సదా చణ్డీ), కోపస్వభావము కలదీ (క్రోధనా),తానే బుద్ధిమంతురాలు అనే గర్వము కలది(ప్రాజ్ఞమానినీ) ,అయిన నా తల్లి కైక ఏ రోగము లేకుండా ఉన్నది కదా ఆవిడకు కుశలమే కదా !
.
భరతుడు పలికిన మాటలు విన్న దూతలు ! ఓ నరశ్రేష్ఢా నీవు ఎవరి క్షేమము కోరుచున్నావో వారందరూ క్షేమమే నిన్ను ఐశ్వర్యము,లక్ష్మి వరించుచున్నవి శీఘ్రముగా రధముపై కూర్చొని ప్రయాణించవయ్యా! .
.
వీరి మాటలు విన్న భరతుడు తాతగారి వైపు తిరిగి నన్ను దూతలు తొందరపెడుతున్నారు మరల మీరెప్పుడు రమ్మనమనిన అప్పుడు వస్తాను అని శెలవు తీసుకొని ఆయన ఇచ్చిన కానుకలు స్వీకరించి వాటిని నెమ్మదిగా వెనుక తీసుకు రమ్మని చెప్పి తాను శత్రుఘ్నునితో కలిసి బయలుదేరి ఏడవ నాటికి అయోధ్యా నగర పొలిమేరలకు చేరుకున్నాడు.
.
ఎప్పుడూ సందడిగా కావ్యగోష్ఠులు,గీత వాయిద్యాలతో,భేరీ మృదంగ,వీణాధ్వనితో, నృత్యప్రదర్శనలతో కోలాహలంగా ఉండే అయోధ్య ఏ విధమైన జన సంచారములేని వీధులతో శ్మశాన నిశ్శబ్దంతో అడుగుపెట్టగానే వళ్ళు గగుర్పొడిచే వాతావరణంతో కనపడ్డది భరతుడికి.ఆనందశూన్య అయోధ్య ఆయనకు గోచరమయ్యింది. ఆయన మనసు ఈ వారంరోజులూ కీడు శంకిస్తూనే ఉన్నది ఈ వాతావరణం చూడగనే అది బలపడ్డది.
.
తన రధ సారధితో ,సారధీ రాజు మరణించినప్పుడు ఏ వాతావరణం ఉంటుందో అది నాకు కనపడుతున్నది. అయోధ్యలోని భవనములన్నీ కళావిహీనము,శోభావిహీనమై కనపడుతున్నాయి.
.
దేవాలయాలలో నిత్యపూజలు జరుగుతున్నట్లుగా లేదు మాలికల శోభలేదు. అయోధ్య అంతా ఒక నిశ్శబ్దం ఆవరించి ఉన్నది ఇది నేనెరిగిన అయోధ్యకాదు ! అని అనుకుంటూ సంతోష హీనుడై తండ్రిగృహంలో ప్రవేశించాడు.
.
తనను చూడగనే ఎదురు వచ్చి దుమ్మకొట్టుకు పోయిఉన్నాసరే తన శరీరాన్ని ప్రేమతో నిమిరి తన శిరస్సు వాసన చూసి గాఢంగా కౌగలించుకొనే ప్రేమమూర్తి తన తండ్రి అచటలేడు!
.
తన తల్లి ఇంట్లో ఉన్నాడేమో అని కైక ఇంట అడుగు పెట్టాడు.
.
కొడుకును చూడగనే ఎగిరి గంతేసి ఆసనమునుండి లేచింది కైక.
.
NB
.
మహర్షి వాల్మీకి కైక గురించి వాడిన విశేషణాలు గమనించండి!
.
ఆత్మ కామా : తన సుఖాన్నే కోరుకునేది
.
సదా చణ్డీ : ఎల్లప్పుడూ తీవ్రంగా ప్రవర్తించేది
.
క్రోధనా : ఎప్పుడూ కోపంగా ఉండేది
.
ప్రాజ్ఞమానినీ : తానే బుద్ధిమంతురాలిని అనే గర్వము కలిగినటువంటిది.
.
మనుషుల స్వభావం గూర్చి మహర్షి వాడే విశేషణాలు రామాయణంలో కోకొల్లలు ! వాటిని విశ్లేషిస్తే చాలు ! అపారమైన మానవ మనస్తత్వ శాస్త్రం మనకు కరతలామలకమవుతుంది.
.
వూటుకూరు జానకిరామారావు
.
No comments:
Post a Comment