Saturday, October 19, 2024

 *వేదం... అనాది నిధనం.....*

వేదం మనల్ని శాసించగలదు, అందుకే శాస్త్రం అని పేరు. "శాస్త్ర జ్ఞానం భహు క్లేషం బుద్దే శ్చలన కారణం" శాస్త్రాలు అనేకం, శాస్త్రాలను చడివి మనం తెల్సుకోవాలంటే, ఒక్కోటి ఒక్కో రకంగా కనిపిస్తాయి అందులో ప్రతిపాదించిన విషయాలు. అనేక చోట్ల ఒకదానితో ఒకటి వైవిధ్యంగానూ కనిపిస్తాయి. అట్లాంటప్పుడు ఆ శాస్త్రీయమైన గ్రంథాలను చదివి ఆ విషయాలను తెల్సుకోవడం అనేది కష్టం.
మరి శాస్త్రాలనే ఎందుకు చదవాలి అంటే, మనకు అలౌకికమైన అర్థాలను తెల్సుకోవాలి అంటే శాస్త్రం తప్ప మరొక ప్రమాణం లేదు. ఎందుకంటే మన కున్న ఇంద్రియాలకి శక్తి సంకుచితమైనది. 

జ్ఞానం కలగాలి అంటే ఇంద్రియాల వల్లనో లేక ఊహించైనా కదా కలగాలి. ఇంద్రియాల వల్ల కల్గాలి అంటే ఇంద్రియాలకి సంపూర్ణమైన శక్తి లేదు. ఎదురుగుండా ఉండే వస్తువులనే మనం ఎన్నింటినో చూడలేం. అన్ని రకాల శబ్దాలని వినగల్గుతున్నామా!! అన్ని ఇంద్రియాలకీ ఉన్న శక్తి చాలా అల్పమైనది. అందుకే ఇంద్రియాల ద్వారా అన్నింటినీ తెల్సుకోలేం. మనం చూసినవాటిని బట్టి కొంత ఊహిస్తాం. దీన్ని అనుమానం అని అంటారు. మనం ఇంద్రియాల బట్టి తెల్సుకున్న దాన్ని మానం అని అంటాం, దీన్ని అనుసరించి కల్గిన జ్ఞానాన్ని మనం అనుమానం అని అంటారు. ఒకటని ఊహించి ఉంటాం, కానీ అది మరొకటి అయి ఉండవచ్చు. లౌకికమైన విషయాలయందే మనకున్న ఇంద్రియల శక్తి సంకుచితం, మన ఊహ అల్పం అయితే మనకు తెలియనటువంటి అలౌకికమైన అనేక విషయాలను గుర్తించడంలో ఇంద్రియాలు కానీ, ఊహ కానీ పనికిరావు.

వీటిని చెప్పగలిగేది వేదం ఒక్కటే. దీన్నే శాస్త్రం అని అంటారు. దాని ఏరకమైన దోశాలు ఉండవు. సంకుచితత్వం దానికి లేదు కారణం అది ఎవరూ తయారుచేసింది కాదు, ఎవరో కల్పించి వ్రాసినది కాదు. శాస్త్రం అపౌరుషేయం. అంటే జ్ఞానం కల జీవ సామాన్యం కానీ, దేవుడు కానీ  వ్రాసినది కాదు. దేవుడిని మనం గుర్తిస్తున్నాం అంటే శాస్త్రం చెప్పింది కనక గుర్తిస్తున్నాం. మన కంటికి కనిపించాడు కనక నమ్ముతున్నామా, లేదు కదా. ఆత్మను చూసా మనం గుర్తిస్తున్నాం, శాస్త్రం చెప్పింది కనక విశ్వసిస్తున్నాం. వేదానికి ఆది లేదు, అనాధి అని అంటారు. రామాయణాన్ని వాల్మికి త్రేతా యుగంలో వ్రాసెను,  భారతాన్ని వేద వ్యాసుడు ద్వాపర యుగంలో వ్రాసెను అని చెబుతాం. భాగవతాన్ని ద్వాపర అంతంలో బదరికాశ్రమంలో అలకనందా నది, సరస్వతి నది కలిసే కేశవ ప్రయాగ అనే ఒక ప్రదేశంలో ఉన్న పర్వతంపై కూర్చొని వ్రాస్తున్నాను అని వేద వ్యాసుడే చెబుతాడు. అట్లా వేదానికి వ్రాసినవాడు కానీ, ఒక కాలం కానీ లేదు. అందుకే వేదాన్ని నిత్యం అని అంటారు. ఒకప్పుడు గిర్తించబడి ఉంటుంది, ఒక్కోసారి ఎవ్వరూ గుర్తించక మరుగున పడి ఉంటుంది.

దాన్ని గుర్తించే వ్యక్తి ఉన్నప్పుడు తిరిగి ప్రకాశిస్తుంది. మన వాతావరణంలో ఎన్నో తరంగాలు ఉంటాయి, ఒక పరికరం పెట్టినప్పుడే కదా అవి మనకు అందుతున్నాయి. పరికరంలేనంత మాత్రాన అవి లేవు అని చెప్పలేం. వేదం అనేది నిత్యమైనది.  ఏదో ఒకరకమైన యోగ శక్తి విశేషం చేత, సాధనా సామర్థ్యం చేత, వారున్న సమాధి స్థితిలో వాటిని గుర్తించారు. వారినే ద్రష్టలు అని అంటారు. కల్పించారు అని చెప్పరు. దర్శించారు అని చెబుతాం. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని గుర్తించడానికి ముందు భూమికి గురుత్వాకర్షణ శక్తి లేక పోలేదు. అట్లా వేద శాస్త్రం అనేది ఎప్పటికీ ఉండేది అందుకే అనాది నిధనం అని అంటారు.

No comments:

Post a Comment