Tuesday, October 8, 2024

 Vedantha panchadasi:
దర్శనాదర్శనే హిత్వా స్వయం కేవలరూపతః ౹
యస్తిష్ఠతి స తు బ్రహ్మన్ బ్రహ్మ న బ్రహ్మవిత్ స్వయమ్ ౹౹68౹౹

68. బ్రహ్మము తనకు సాక్షాత్కరించెనా లేదా అనే ఆలోచనలు లేక సచ్చిదానందముతో ఏకత్వమును సదా అనుభవించుచు ఉండే పురుషుడు కేవలము బ్రహ్మవిదుడు కాడు.సాక్షాత్తు బ్రహ్మమే. ముక్తికోపనిషత్తు 2.64.
వశిష్ఠుడు కూడా రామున కిట్లుపదేశించెను.

జీవన్ముక్తేః పరా కాష్ఠా జీవద్వైత వివర్జనాత్ ౹
లభ్యతేఽ సావతోఽ త్రేదమీశద్వైతాద్వివేచితమ్ ౹౹69౹౹

69. ఈశ్వరసృష్టపై ఆరోపింపబడిన జీవసృష్టిని పరిత్యజించుటచే జీవన్ముక్తి పరాకాష్ఠ సిద్ధించును.అందుచే ఈ ప్రకరణమున ఈశ్వర సృష్టి నుండి జీవసృష్టి వివేచింపబడినది.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
చతుర్థ ప్రకరణము:సమాప్తము

అనంతముగానున్నట్లు కనిపించు ఈ అజ్ఞానప్రవాహమును మహాత్ముల నిరంతర సాహచర్యమువలన మాత్రమే దాటగలము.అట్టి సాహచర్యమువలన ఏది కోరదగినది,ఏది పరిహరింపదగినది అను వివేకము ఉదయించును.

అప్పుడు మోక్షము పొందవలెనను కోరిక ఒకటే కలుగును.ఇది గాఢమయిన విచారణకు దారితీయును.విచారణ మానసికపరిమితిని క్షీణింపజేయును గనుక అప్పుడు మనస్సు సూక్ష్మమగును.

అంతర్ధ్యానముచే మనసును ఆత్మయందు ఐక్యము చేసి అద్వితీయమైన పరమాత్మ నేనను భావనాశక్తి గలిగినవాడు 
జీవన్ముక్తు డనబడును.

జీవన్ముక్తుడైన మహాత్ముడు జరిగిన విషయము సుఖముగాని, దుఃఖముగాని,గొప్పదిగాని,చిన్నది గాని చింతింపడు.ఈ విషయమునకు ముందు రాబోవుసంగతి యెట్లు జరుగునో అని విచారింపడు. వర్తమానకాలమునందు ప్రాప్తించినది ఉదాసీనుడై సంతోషముతో స్వీకరించును.

తనను,ఇతరుని భేదరహితుముగా చూచువాడును,సర్వము చిత్స్వరూపముగా గనువాడెవడు గలడో వాడు బ్రహ్మమును తెలిసిన వాడని యర్థము.
               ---- జ్ఞానవాసిష్ఠము

మోక్షమనగా ఆకాశమందును,పాతాళమందును,భూలోకమందును లేదు.
విషయత్యాగముచే మనశ్శాంతి ఏదిఎలదో అదే మోక్షమని ఎఱుంగ వలయును.

ఏ పురుషుడు ఎల్ల కోరికలను విడిచి దేనియందును ఆశలేనివాడై అహంకారమమకారములు,
సమస్త విషయ వాసనలు నశించినవాడై సంచరించుచుండునో అట్టి 
స్థిత ప్రజ్ఞుడు శాశ్వతానంద మోక్షము పొందును.

నీవు చైతన్యజ్యోతివి.నీలో లోకములు పాతుకొనియున్నవి.నీకు మిత్రుడెవరు?అన్యుడెవరు?నీవు అపరిచ్చిన్నుడవు.జపమాలలో పూసలవలె నీలో లోకములన్నియు గ్రుచ్చబడియున్నవి.
నీవే జ్యోతివి,ఈశ్వరుడవు.

వాంఛనీయములు,అవాంఛనీయములను భావములను పరిత్యజించి సమభావనలను అనుభవించిన జననచక్రము ఆగిపోవును.

బ్రహ్మసాక్షాత్కార ప్రాప్తి గురించి ఆలోచన కూడా లేక నిరంతరము సచ్చిదానందముతో ఏకత్వమును అనుభవించుచు ఉండే పురుషుడు కేవలము బ్రహ్మవిదుడు కాడు,సాక్షాత్తు బ్రహ్మమే.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*ద్వైత వివేకప్రకరణమను చతుర్థ ప్రకరణము సమాప్తము.*.  

No comments:

Post a Comment