"ఆత్రేయగీత"
నాల్గవ భాగం
“సూక్ష్మజ్ఞానము” - 10వ భాగము.
- శ్రీ శాస్త్రి ఆత్రేయ
ప్రకృతి స్వతహాగా జడమైనది కావునా ఏ కార్యము చేయలేదు. చైతన్యవంతమగు ఆత్మతో కలయిక వలన ఈ విశ్వము ఏర్పడుతున్నది. అయితే ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది.
పంచభూతములు జడమైనవని మనకు తెలుసు కానీ మనస్సు, బుద్ధి, అహంకారం (నేను అన్న భావన) కూడా జడము లేనా? అవి చైతన్యమైనవే కదా!!
అవి కూడా జడములే. కారణం అవి చపలత్వము, చెంచలత్వమును, వచ్చుట, పోవుట కలిగివున్నవే కదా! ఈ మనోబుధ్యాహంకారములను జడపదార్ధములుగా పరిగణించుటలోనే సాధకుని తెలివికి నిదర్శనము. కొంతమంది వీటిలో తాదాత్మ్యము చెంది పిమ్మట వికారము నొంది ఈ సంసారమున బందీలగుచున్నారు. కానీ జ్ఞానులు వాటిని తమనుండి వేరుగా పరిగణించి శాశ్వతచైతన్యవంతమగు ఆత్మయందే దృష్టి పెట్టి నంసారబంధము నుండి తప్పుకుంటున్నారు.
జ్ఞానులు మనస్సుతో కాక మనస్సాక్షితో తాదాత్మ్యము నొందుచున్నారు. అంటే జడమైన ప్రకృతికి ఆధారభూతుడై అదే ప్రకృతియందు సర్వత్రావ్యాపించియున్న ఆత్మస్వరూపాన్ని దర్శిస్తారు జ్ఞానులు. ఆ ఆత్మస్వరూపమే “పరమాత్మ”. పరమాత్మ ఈ చరాచర జగత్తులోని అన్ని పదార్ధములలో సూక్ష్మరూపంలో వ్యాపించియున్నాడు.
ఆధారము లేనిదే ఆధేయము వుండలేదు కదా! పాలలో నెయ్యి వున్నట్లు, గింజలో నూనె వున్నట్లు, కట్టెలో నిప్పు వున్నట్లు!! పరమాత్మా లేని వస్తువు ఈ సృష్టిలో లేదు. ఈ సత్యమును తెలుసుకుంటే, మానవుడు ఏ పాపకార్యము చేయలేడు. ఒకవేళ చేస్తే అంతా వ్యాపించియున్న పరమాత్ముడు చూస్తున్నాడని భయముంటుందిగనుక. అనుభవపూర్వక జ్ఞానము (Practical Knowledge) నకు ఇది పునాది.
జ్ఞానమనగా శాస్త్రజ్ఞానం. విజ్ఞాన మనగా
అనుభవపూర్వకమైన జ్ఞానము (Practical Knowledge). అనుభవమునకు రాని విద్య వలన ఉపయోగంలేదు. ఆధ్యాత్మికవిద్యకు అనుభవజ్ఞానమే ప్రధానము. ఆత్మను తెలుసుకొనుటకు జీవునికి జ్ఞానముతో పాటు విజ్ఞానము అవసరము. కేవలం శాస్త్రజ్ఞానంతో ఆత్మానుభూతి పొందలేరు.
ఎలాగైతే మామిడిపూతంతా పండ్లుగా మారవో. ఆధ్యాత్మికసాధన చేసిన జ్ఞానులందరు పరమాత్మను తెలుసుకోలేరు. చాలామంది మధ్యలోనే రాలిపోతారు. కొంతమంది అజ్ఞానంతో పూతదశలోనే దూరమౌతారు, ఇంకొంతమంది జ్ఞానంతో ముందుకెళ్లి ఆపిమ్మట విషయవాంఛలతో కాయదశలో పట్టుతప్పుతారు. కారణం వారికి ఎంతో శాస్త్రజ్ఞానం వుంటుంది కానీ అనుభవజ్ఞానము వుండదు. కాబట్టి ఈ రెండింటిని జోడించి అసలు సత్యమును తెలుసుకోనే ప్రయత్నంచేయాలి. దానిని తెలుసుకుంటే ఇంక తెలుసుకోవలసినది ఏమి మిగలదు.
No comments:
Post a Comment