*కర్ణ మహా భారతం -12*
🏹
రచన : శ్రీ శార్వరి
*ఉభయమిత్రులు*
👥
కర్ణ, అశ్వత్థామలిద్దరూ తల్లిదండ్రుల చాటు బిడ్డలు. గారాబంగా పెరిగినవారు. ఇద్దరు ఒక విధంగా సహజ విష్ణులు. అశ్వత్థామ ప్రతిభ రాణించలేదు. కర్ణుని ప్రతిభ రాణింపుకు రాలేదు. ఇద్దరూ బాధితులే. అశ్వత్థామకు కర్ణ తప్ప చెప్ప దగిన ఆప్తమిత్రులు లేరు. రాజపుత్రులు దగ్గరకు చేరనీయరు. కర్ణుని సమాజమే దూరం చేసుకుంది. వారి స్నేహం ఇద్దరు తండ్రులకూ ఇష్టం లేదు.
బాల్యం నుండి ఉర్వికి అశ్వత్థామ తెలుసు. అతని స్వభావం ఎరుకే. అతను మితభాషి. ముభావంగా ఉంటాడు. సౌమ్యుడు. మాట నెమ్మది, మనసు మెత్తన. అతను కౌరవుల కన్న, తనకన్న వయసులో పెద్దవాడు కనుక ఎవరితోను కలవడు. వారు ఇతనిని కలుపుకోరు. పెద్దవాడని దూరంగా ఉంచేవారు.
అర్జునుడంటే తన తండ్రికి ప్రత్యేకమైన అభిమానం. అది అశ్వత్థామకు నచ్చదు. అందరు శిష్యుల్ని ఒక్కలా చూడాలి తప్ప ఒకరినే అభిమానించడం ఏం న్యాయం? తన కన్న అర్జునుడంటేనే ఆయనకు అభిమానం. అది అన్యాయం కదా! అందుకే అశ్వత్థామ కర్ణునితో స్నేహం చేశాడు. అభిమానమే స్నేహంగా మారింది. కర్ణుని కౌశలం అతనిని ఆకర్షించింది. వీరి మైత్రి ద్రోణాచార్యకు నచ్చదు.
ద్రోణాచార్య భార్య కృపి. కొడుకు అశ్వత్థామ అంటే తగని ప్రేమ. ఒక్కడే కొడుకు. మొదట్లో ద్రోణాచార్య మహా దరిద్రుడు. హస్తిన చేరే వరకు అతను దరిద్రుడే. తలిదండ్రుల దరిద్రం బిడ్డలపై ప్రభావం చూపుతుంది. దరిద్రం కారణంగా ద్రోణాచార్యుడు భార్యతో కలహించే వాడు. ఆ ప్రేమ కారణంగానే ద్రుపదునితో వైరం ఏర్పడ్డది.
అశ్వత్థామ బాల్యం గురించి ఉర్వి తల్లి చెప్పింది.
ద్రోణుడు ఎంత పేదవాడంటే బిడ్డ పాల కోసం ఒక ఆవునైనా సంపాదించలేక పోయాడు. పసిబిడ్డకు పాలు అవసరం గదా! అశ్వత్థామకు ఆనాడు ఆవు పాలు తాగే అదృష్టం లేదు. ఒకనాడు కృపి విసిగిపోయి వేడి నీళ్లలో బియ్యం పిండి కలిపి బిడ్డకు పట్టింది. ఆ రోజునే ద్రోణాచార్యను సతాయించింది. “పాంచాలరాజు మీ బాల్యమిత్రుడే గదా! వెళ్లి ఒక ఆవు కోసం యాచించండి. మిత్రుని అర్థించడం అవమానం కాదు."
అంది.
పాంచాలుడు తన మిత్రుడన్న విషయం అప్పుడు జ్ఞప్తికి వచ్చి బయల్దేరాడు. ద్రుపదుడు ద్రోణుని అసలు గుర్తించలేదు. "స్నేహానికి ఒక స్థాయి ఉండాలయ్యా! నీకు నాకు స్నేహం ఏమిటి? నేను రాజును, నీవు కటిక పేదవు" అని అవమానించి పంపాడు. ద్రుపదునిపై ప్రతీకారం తీర్చుకుంటానని, ప్రతిజ్ఞ చేసి వచ్చాడు ద్రోణుడు.
కురు రాకుమారులకు గురువైన తర్వాత తన ప్రతీకారం గుర్తుకు వచ్చింది. తన శిష్యులకు మనసులోని మాట చెప్పాడు. "మీరు ఎవరైనా ద్రుపదుని పట్టి బంధించి తీసుకు వచ్చి గురుదక్షిణగా ఇవ్వండి" అని.
వెంటనే కురు సోదరులు నూరుగురు బయలుదేరి వెళ్లి చావు దెబ్బలు తిని వచ్చారు. అర్జునుడు ఒంటరిగా వెళ్లి ద్రుపదుని ఓడించి బందీగా తెచ్చాడు.
ద్రుపదుని చూచి ద్రోణుడు పరిహాసం చేశాడు.
"నీవు చిన్నతనంలో నాకు ఒక మాట ఇచ్చావు. రాజువై మాట తప్పావు అవమానించావు. ఇప్పుడు నీ రాజ్యం, నీ ప్రాణం నా చేతిలో ఉన్నాయి. అయినా స్నేహితుడిగా నిన్ను క్షమిస్తున్నాను. నేను బ్రాహ్మణుడిని, నీ రాజ్యం నాకు వద్దు. నీవే తీసుకుపో. ధర్మంగా జీవించు. మిత్రద్రోహివి కావద్దు ద్రుపదా!" అన్నాడు.
పాంచాల రాజు ద్రోణునిపై కక్ష గట్టాడు. ద్రోణుని సంహరించగల కొడుకు కోసం యజ్ఞం చేశాడు. అప్పుడే అతనికి దృష్టద్యుమ్నుడు కలిగాడు. తనని ఓడించిన అర్జునుడే తనకు అల్లుడు కావడం ద్రుపదునికి కలిసొచ్చింది.
ద్రోణాచార్యునికి కర్ణుని పట్ల అయిష్టమే గాని శత్రుత్వం లేదు. ప్రతిభ కారణంగా కర్ణార్జునులు శత్రువులు. ద్రుపదుడు, ద్రోణుడు మిత్రభేదం వల్ల శత్రువులు. కర్ణునిపై అర్జునుని వైరానికి అర్థం లేదు. ద్రోణుని అయిష్టత, అన్యాయం. అర్జునునికి మరొక శత్రువు ఏకలవ్యుడు. అతను ద్రోణాచార్యకు ఏకలవ్య శిష్యుడు. ఆయన విగ్రహాన్ని గురువుగా భావించి విద్య నేర్చాడు. అది కారణంగా ద్రోణుడు ఏకలవ్యుని బొటనవేలు గురుదక్షిణగా కోరాడు. అసలు తనకే గురుదక్షిణకు అర్హత లేదు. పరోక్ష గురువు పరోక్ష శిష్యుడు. ద్రోణుడిది కుటిల బుద్ధి ... అర్జునునికి ఎదురు లేకుండా చేయడం. మిగిలింది కర్ణుడు ఒక్కడే. అతని అడ్డు తొలగించుకోవడం ఎలా! ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుని పక్షం. తాను కౌరవుల గురువు. కృపాచార్య రాజ పురోహితుడు. అస్త్ర విద్యా ప్రదర్శన వల్ల కర్ణుని అడ్డు తొలిగిందని భ్రమించాడు ద్రోణుడు. ఓడించలేక అవమానించి కుతి తీర్చుకున్నాడు. బ్రాహ్మణుడు కదా! ఓడినా పై చేయి తనదే కావాలి.
ద్రోణుడు తిరస్కరించినా, భీష్మాచార్య కర్ణుని ప్రతిభను ప్రశంసించాడు! ద్రోణుడు కాదన్నా, కర్ణుడు పరశురాముని వద్ద విద్యలు నేర్చాడు. పరశురాముడు భీష్మునికి గురువు. పరశురాముని శిష్యుడైన కర్ణుడిని గెలవడం అసాధ్యమ ని ద్రోణుడికి తెలుసు. ఆ విషయం భీష్ముడికీ తెలుసు. గురువులకు అసూయలు ద్వేషాలు ఉంటాయనడానికి వారే నిదర్శనం.
అర్జునుని అతిగా అభిమానించిన నేరానికి ద్రోణుడు కన్న బిడ్డను దూరం చేసుకోవలసివచ్చింది. అశ్వత్థామ కర్ణల స్నేహానికి కారణం తెలియలేదు ఉర్వికి. ఇద్దరికీ అయిష్టుడు అర్జునుడు. అందుకు ద్రోణాచార్య కారణం.
"మిమ్మల్ని చూచి చాలా కాలమైంది. మీ అమ్మగారు బాగున్నారా?" వినయంగా ప్రశ్నించింది ఉర్వి అశ్వత్థామను.
అతనికి ఆడవారితో మాట్లాడడం భయం. సిగ్గు. పొడిగా సమాధానం చెప్పాడు.
"బాగున్నది. అమ్మ మీ యోగక్షేమాలు ఎప్పుడూ విచారిస్తుంది." ఒక మాట అదనంగా కలిపాడు.
"మా కర్ణుడు అదృష్టవంతుడు. కర్ణుని ఇల్లాలిగా నీవూ అదృష్టవంతురాలివి.”
"ఈసారి నేను మీతో వస్తాను. అమ్మగారి ని చూచి చాలా కాలమైంది” అన్నది ఉర్వి.
అశ్వత్థామ వినీ విననట్లు తలవంచుకుని కర్ణుని కోసం మిద్దె పైకి వెళ్లాడు. అటువంటి సమయాల్లో ఉర్వి చిత్రంగా కనిపిస్తుంది. కర్ణుని కవచ కుండలాలవలె అశ్వత్థామ తలపై సహజ రత్నం ఒకటి ఉంది అది శిఖామణి. అతను అజరామరుడు. ఆ రత్నం ఉన్నంత కాలం అతనిని ఎవరూ ఓడించలేరు. అతనికి వృద్ధాప్యం రాదు. మరణం రాదు. జబ్బు చేయదు. అది మృత్యుంజయ రత్నం. ఇద్దరు దైవప్రసాదులే.
కర్ణుని స్నేహం వద్దని అశ్వత్థామను మేనమామ హోదాలో కృపాచార్య ద్రోణాచార్య ఎంత బోధించినా, అశ్వత్థామ అతని స్నేహం మానలేదు.
ఒకసారి రాధ మాటల సందర్భంలో అన్నది. ద్రోణాచార్య తిరస్కారం మరచి పోలేకపోయాడు రాధేయుడు. చాలా రోజులు దిగులుపడ్డాడు. దిగులుతో కుమిలిపోయాడు. ఉర్వీ తనని ఓదార్చడం నా వల్ల కాలేదు. తనకెందుకు విద్య నేర్పలేదు. ఇప్పటికీ అర్థంకాదు అనేవాడు. తనకా అర్హత ఉంది. తన జననం తెలియదు. అంతమాత్రాన తాను అనర్హుడా? కులహీనుడా? ఎట్లా?
రాధ ఉర్వి కళ్లలోకి నిదానించి చూచింది. ఆమె కళ్లు అగ్ని కణాల్లా రగులుతున్నా యి. రాచబిడ్డకూ పౌరుషం ఎక్కువ. అన్యాయం సహించని తత్వం. ఈమే ఇలా అయితే రాధేయుడు ఇంకెంత బాధ పడి ఉంటాడో.
రాధేయుడు రణ విద్యలు స్వయంగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు శోణ సహాయంతో. యుద్ధ ఆయుధాలన్నీ సేకరించాడు. సూర్యాస్తమయం తర్వాత సాధన చేసేవాడు. తనకు క్రమశిక్షణ, పట్టుదల ఎక్కువ.
"నేనూ నీవూ ఏం చేయగలం ఉర్వీ. నాకు తెలుసు తన బాధ. నీవు మాత్రం ఏం చేయగలవు? కసి అన్నది విషంగా పని చేస్తుంది. ఆత్మకు క్షోభ కలిగిస్తుంది."
అత్తాకోడలు మాట్లాడుకుంటుండగా శోణ అక్కడకు వచ్చాడు. చివరి మాటలు అతని చెవిని పడ్డాయి. వెంటనే అన్నాడు.
"లేదమ్మా! ఆ అవమానాలే అన్నలో పౌరుష జ్వాలల్ని రేపాయి. అవే తనని మహావీరుని చేశాయి" అని ఉర్వి వేపు తిరిగి చూచాడు.
"బాధపడడం మా అన్నగారి జన్మహక్కు వదినా. తనకు కవచకుండలాలు ఎంత సహజమో బాధలు, అవమానాలు పడడం అంతే సహజం. అవే లేకపోతే అన్న ఇంత వాడయ్యేవాడు కాదు. తన జన్మ రహస్యం తెలిసేవరకు అన్న నిద్ర పోడు. దిగులు మానడు. తన శక్తి సామర్థ్యాలు హస్తినలోనే బయటపడ్డా యి. అందరూ తెలుసుకున్నారు.”
ఒకనాడు అశ్వత్థామ కర్ణునికి చెప్పాడు: “నాన్నగారు తన శిష్యులందరికీ ఒక పరీక్ష పెట్టదలచాడు. చెక్కతో ఒక చిలుకను చేయించి, దానిని చెట్టు పైన కట్టి, గురి చూచి చిలుక కంటిని కొట్టాలన్నాడు. ఒకరిని పిలిచి నీకేం కనిపిస్తోంది? అని ప్రశ్నించాడు. తను చెట్లు, కాయలు అన్నాడు. తలా ఒకటి చెప్పారు. అర్జునుడు మాత్రం 'చిలక కన్ను మాత్రమే కనిపిస్తోంది' అన్నాడు. అది ఏకాగ్రత. చివరికి అర్జునుడే గురి చూచి కొట్టాడు.”
శోణ తర్వాత మాటలు చాలా బరువుగా అన్నాడు.
అశ్వత్థామ చెప్పిన కధ విని అన్నయ్య అన్నాడు. “ఒక బాణంలో ఒక కన్ను కొట్టడం కాదు సోదరా! నేను రెండు బాణాలు ఒకేసారి వదిలి రెండు కళ్లు ఛేదిస్తాను.” ఆ పని చేసి చూపించాడు. మేం రాత్రిపూట గదా సాధన చేస్తాం. ఆ పని అన్న ఒక గుడ్డి దీపం వెలుగులో సాధించాడు. అన్నయ్య గురి తప్పదు వదినా! అన్నయ్య సాధన చేసింది తక్కువే. అయినా తన విశ్వాసం గొప్పది. పట్టుదల ఎక్కువ. రాధేయుని మించిన విలుకాడు లేడమ్మా.”
బల ప్రదర్శనకు అనుమతించకుండా వాళ్లు చాలా తప్పు చేశారు. కులం ప్రధానం కాదు గుణం ప్రధానం- కౌశలం ప్రధానం.
శోణ చెప్పింది నిజమే అనుకున్నది ఉర్వి.
ద్రోణాచార్య గురువేగాని అధర్మవర్తనుడు. అతను దుర్యోధనుని సింహాసనానికి కాపలా మనిషి, ఒకరి కోసం మరొకరికి అన్యాయం చేయడం ఏం న్యాయం? ఏం ధర్మం? అర్జునుడి కోసం కర్ణుని బలి చేయాలని చూస్తాడా దుర్మార్గుడు.
ఈ మహానుభావుడే కర్ణను అవమానిస్తూ అడుగడుగునా అడ్డు తగులుతున్నాడు. ఉర్వికి పట్టరాని కోపం వచ్చింది. చాలా కాలంగా తను గౌరవిస్తూ వచ్చింది. ఇప్పుడు అసహ్యం వేస్తోంది ఒట్టి చుప్పనాతి. అతనేం గురువు? అర్జునుని కి వినయం, విధేయత నేర్వకపోగా అసూయ, ద్వేషం రగిలించాడు. తన కక్ష తీర్చుకోడానికి శిష్యుల్ని ఉపయోగించు కోవడం దుర్మార్గం. ఇంత పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇంతకింత అనుభవించక తప్పదు.”
ఉర్వి విచక్షణకు, వింగడింపుకు అత్తమ్మ మురిసిపోయింది. కోడలి వైపు అపేక్షగా చూచింది.
"ఉష్ ... నెమ్మది. అడుగడుగునా గూఢచారులున్నారు. ఎవరు గూఢచారో, ఎవరు కాదో తెలియదు ఉర్వీ.”
తను అచ్చం రాజకుమారుడిలా మాట్లాడింది. ఎంతైనా క్షత్రియ బిడ్డ కదా! కోపంలో అయినా నిజం చెప్పింది.
"చారులా! చోరులా? అత్తయ్యా.”
"అవునమ్మా, అది ద్రోణాచార్య నిర్వాకం. ఎక్కడ ఏం జరుగుతుందో చారులతో రహస్యం రాబడుతుంటాడు.”
"ఓరి దుర్మార్గుడా! అయినా అతను మనల్నేం చేయగలడు అత్తయ్యా? చేయగలిగినంత ఇప్పటికే చేశాడు. జరగవలసిన అపకారం జరిగింది కదా! బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఇదేం పని?” కోపంతో అరిచింది ఉర్వి. అశ్వత్థామకు రణవిద్యలు నేర్పడం ఎందుకట? అర్జునునికి తెలిసి అతనిపై కక్ష కట్టాడు గదా. అదేం బుద్ధి.
"నోరు మూసుకోవమ్మా కోడలా! నాకసలే భయంగా ఉంది.”
అంతలో కర్ణుడు లోపలకు రావడంతో ఇద్దరూ కంగారుపడ్డారు. రాధ కోడలి వైపు దైన్యంగా చూచింది. కోడల్ని కోప్పడవద్ద ని అర్ధింపు.
"భయపడకమ్మా! తనని ఎలా శాంతింప జేయాలో నాకు తెలుసు.”
అందరిని వెళ్లిపొమ్మని సౌంజ్ఞ చేశాడు. శోణ, రాధ వెళ్లిపోయారు. అత్తమ్మ పెదవులపై దైన్యం గుర్తించింది ఉర్వి. అత్తమ్మ తృప్తిగా ఉందని గ్రహించింది.
"చిన్నరాణి గారికి కోపం వచ్చిందట. ఏంకత?" నవ్వుతూ ప్రశ్నించాడు రాధేయుడు.
"ఇక శాంతించండి దేవీ!"
"నేనేమీ తప్పుగా మాట్లాడలేదులెండి. మహాశయా" అన్నది గోముగా.
"నేనంటే గిట్టని వారందరితో దెబ్బలాడ తావా రాణీ?"
"ఆఁ ఎవరైనా సరే దొక్క చీరేస్తాను. మీ పైన ఈగ వాలినా సహించను. ఎంత గురువైనా అంత పొగరు కూడదు. అతగాడిని అసహ్యించుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది స్వామీ! తమరు అనవసరంగా వెనకేసుకురాకండి.”
"వదిలెయ్ వోయ్. తన పాపాన తనే పోతాడు. ఇంతకింత అనుభవిస్తాడు. భగవంతుడు ఎవరినీ ఉపేక్షించడు. క్షమించడు. ఆ రోజు రాకపోదు, మనం చూడకపోము. నా కోసం ఎవరితోను నీకు వైరం అవసరం లేదు. ఎవరినీ మాట తూలకు ఉర్వీ. నే చెప్పినట్లు విను?”
"వింటాను పతిదేవా, వింటాను!"
“నాకిష్టం లేని పనులు చేస్తున్నావుగా.”
"నా నోరు నా ఇష్టం. నా నోరు మూయడం ఎవరి వల్ల కాదు.”
"మీ అమ్మగారు నీకు వస ఎక్కువ పోయించి ఉంటారు కదూ.”
"వస మంచిదే. అది పిరికి మందు కాదు. నస పెట్టకపోవడం మంచిదేగా.
మొహాన అనెయ్యడం వస మహాత్మ్యం.”
"నీతో మాట్లాడి గెలవలేను ఉర్వీ.”
"హమ్మయ్య ఒప్పుకున్నారు గదా. నన్నే గెలవలేని వారు రేపు అర్జునుని ఎలా ఓడిస్తారు మహాత్మా?”
"అర్జునుడు నీలాగ ఆడది కాదు. మగాడిని గెలవడం వీరత్వం, కానీ నీవంటి అందమైన ఆడపిల్లపై గెలవడం వీరత్వం అనిపించుకోదు. ప్రేమ పిశాచిని గదా." ఇద్దరూ కడుపుబ్బ నవ్వుకున్నారు.
🏹
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆
No comments:
Post a Comment