*భక్త పురందరదాసు కథ*
పూర్వం విక్రమార్క శకం 16వ శతాబ్దములో నవనిధి శ్రీనివాసనాయకుడనే గొప్పధనవంతుడు ఉండేవాడు. అతడు పరమ లోభి. భార్య సరస్వతీబాయి భక్తురాలు దానగుణశీలి. పతియే ప్రత్యక్షదైవమని నమస్కరించిన ఆ సాధ్వితో శ్రీనివాసనాయకుడిలా అనేవాడు “ఏమని ఆశీర్వదించను? అంకా దానధర్మాలు చేయమనా?” “స్వామీ! మీ ఆనుజ్ఞ తీసుకునే నేనీ వ్రతము ఆచరించితిని కదా!” అని బదులిచ్చిన భార్యతో “ఆ! ఆ! పొందితివి పొందితివి. తులసీపూజయే కదా ఖర్చు ఉండదులే అనుకున్నాను. కాని ఆ పేరుతో దంపతి పూజలు దానాలు ఒక్కటేమిటి అన్నీ చేశావు. నీ సుపుత్రుడు వరదుడు లెక్క చూపిన తరువాతే నాకీ విషయం తెలిసింది. నువ్విలాంటి నాగులు వ్రతాలు చేస్తే చాలు మనమందఱము తలకొక జోలె పట్టుకోవలసి వస్తుంది” అని అనేవాడు శ్రీనివాసనాయకుడు.
“రామ! రామ! అట్లా అనకండి. భగవంతుడు మనకు ఇచ్చినప్పుడే దానాదులు చేయకుంటే లేనప్పుడీయ గలమా”? అని సత్యం పలికిన సరస్వతీబాయితో శ్రీనివాసనాయకుడు “ఇందులో భగవంతుడిచ్చినది ఏమున్నది? మా తాతముత్తాతలు మా నాన్నగారు నేను ఎంతో శ్రమించి ఆర్జించినదే కదా!” అని అనేవాడు. “దానధర్మాదులకు ఉపయోగపడని ధనమెందులకు స్వామి? ఇట్టి సత్కార్యములే సద్గతులకు చద్ది మూటలని సాధుసజ్జనులంటారు” అని హితవు చెప్పిన భార్యతో భర్త “ఆ సన్యాసుల మాటలకేమిలే వాళ్ళలానే అంటారు. అవన్నీ ఆచరిస్తూ కూర్చుంటే మనకు మిగిలేది బూడిదే! చూడు సరస్వతీ! ధనమూలమిదం జగత్ అన్నారు. ఆ సిరి యొక్క గరిమ ఎంతో కష్టపడి సంపాదించిన నాకు తెలుసు” అని అనేవాడు. ఆ భార్యా భర్తల సంభాషణములు ఇలా ఉండేవి!
శ్రీనివాసనాయకుని అనంత పూర్వజన్మ పుణ్యమో లేక సరస్వతీబాయి అఖండ సౌశీల్య మహాత్మ్యమో పుట్టు లోభి అయిన శ్రీనివాసనాయకుని భక్త పురందరదాసుగా మార్చా అనుకున్నాడు పాండురంగ విఠ్ఠలుడు. ఏ దుర్గుణాన్నైనా నివారించవచ్చును కానీ లోభగుణాన్ని మార్చుట దుష్కరం అని అనుకున్న స్వామి స్వయంగా ఆ శ్రీనివాసనాయకుని వద్దకు ఒక బ్రాహ్మణుని వేషంలో వచ్చాడు. ఎవరి పాదాలకు సకల చరాచర జీవులు ముక్తికై చేతులుజోడించి నమస్కరిస్తాయో అట్టి స్వామి శ్రీనివాసనాయకుని ముందర నిలిచి ఏదైనా దానమివ్వమని యాచించేవాడు! కసురుకుంటూ వెళ్ళగొట్టేవాడు నాయకుడు.
భగవంతుడు శ్రీనివాసనాయకుడెన్ని అవమానాలు చేసినా రోజూ పుత్రవాత్సల్యంతో వచ్చి ఏదో ఒకటి దానమిమ్మని అర్థించేవాడు. భగవంతుడు ఎన్ని సార్లు అడిగినా ఆ శ్రీనివాసనాయకుడు ఒక్కసారికూడా ఏమీ ఇవ్వలేదు. ఇలా ప్రతిరోజు ఆ లక్ష్మీపతి శ్రీనివాసనాయకుని మార్చడం కోసం పడరాని పాట్లు పడ్డాడు. బహుశః ఇందుకేనేమో ఆ భగవంతుడు ఆశ్రితపక్షపాతి అని నిందింపబడినాడు. నీవే తప్ప ఇతరమెఱుగనని శరణువేడిన సరస్వతీబాయిని రక్షించటానికే నేమో ప్రాయశః స్వామి ఇన్ని పాట్లుపడ్డాడు. లేదా కర్మయే పరమాత్మ అన్న నిజం నిరూపించేలా శ్రీనివాసనాయకుని పూర్వజన్మల పుణ్యానికి ఫలముగా ఇలా అనుగ్రహించదలచినాడో స్వామి. ఆ పన్నగశాయి లీలలు అర్థం చేసుకోవటం ఎవరి తరము?
“ఏమైనా సరే నీకేమీ ఇవ్వను” అని నిక్కచ్చగా అన్నాడు ఒకరోజు విప్రవేషంలో ఉన్న భగవంతుని చూసి శ్రీనివాసనాయకుడు. “అయ్యా! వీడు నా ఒక్కగానొక్క కొడుకు. వీడికి ఉపనయనం చేయాలని సంకల్పించాను. ఓం ప్రథమంగా మీ వద్దకొచ్చాను. మీరు దయతో ఏది ఇచ్చినా తీసుకుంటాను” అని అడిగాడు భగవంతుడు. “ఏది ఇచ్చినా తీసుకుంటావా?” అని రెట్టిస్తూ “నేను ఇచ్చేది కిం అనక తీసుకు వెళిపోవాలి” అని అంటూ ఇల్లంతా వెతికి వెతికి తుప్పు పట్టిన కాణీ బిళ్ళ తెచ్చి విఠ్ఠలునికి ఇచ్చి పంపించి “పీడా వదిలింది” అనుకున్నాడు.
ఏదో పనిమీద నాయకుడు బయటికెళ్ళాడోలేదో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు విఠ్ఠలనాథుడు. “అమ్మా! నాకు సహాయం చేయండి” అని అన్నాడు స్వామి. “ఇందాకే కదయ్య మా ఆయనిచ్చారు?” అని అన్నది ఆ ఇల్లాలు. ఆ తుప్పుపట్టిన కాణీ చూపించాడు స్వామి. ఖిన్నురాలై నిస్సహాయిగా నిలుచున్న ఆమెను చూసి పరమాత్మ “అమ్మా! మీ ముక్కెర ఇప్పిస్తే నా అవసరం తీరుతుంది” అని అన్నాడు. నీళ్ళునములుతూ యాచించిన ఆ పేద బ్రాహ్మణుని చూసి జాలిపడి సరస్వతీబాయి వెంటనే తన ముక్కెర తీసి ఇచ్చింది. మనసారా ఆశీర్వదించి ముక్కెర తీసుకుని స్వామి వెళ్ళిపోయాడు.
విప్రునికి ముక్కెర ఇచ్చింది కాని భర్తకు ఏమని సమాధానం చెబుతుంది? ఏమి చేయాలిరా భగవంతుడా అని వ్యాకుల పడుతుండగా ఆమె ప్రాణాలపాలిటి రెండో కాలునిలా శ్రీనివాసనాయకుడు వచ్చి “ఏదీ నీ ముక్కెర?” అని ప్రశ్నించాడు. లోభికి ధనం తప్ప ఇంకేదీ కానరాదు కదా! ఎక్కడుందో వెతికి తెమ్మన్నాడు భర్త. “రంగ రంగ! ఏమి లీల స్వామి? నాకు దిక్కెవ్వరు?” అని భగవంతునికి మొరపెట్టుకుంది సరస్వతీబాయి. “ఇది ఏమైనా సత్యయుగమా చమత్కారాలు జరగడానికి?” అని అనుకుని మరణమే శరణ్యమని నిశ్చయించుకున్నది.
ప్రేమతో అటుకులిచ్చినందుకే స్వామి సుదామునికి అనంత ఐశ్వర్యాలు కడకు కైవల్యమిచ్చాడు. ఇక అవసరానికి ఏమీ సంకోచించక అడిగనదే తడవుగా ముక్కెర ఇచ్చిన ఆ సాధ్విని మఱుస్తాడా స్వామి? “సాధ్వీ! నీ దానగుణానికి భక్తికి మెచ్చాను. ముక్కెర ధారపోసి ముక్తేశుడనైన నన్ను కొన్నావు. ఇదుగో! ముక్తిని తులతూచిన నీ ముక్కెర” అన్న భగవంతుని అంతర్వాణి వినిపించిం
ది సరస్వతీబాయికి. ఎంతో సంతోషంతో ముక్కెర తీసుకొని భర్త దగ్గరకు వెళ్ళింది. అదిచూసి అవాక్కయ్యాడు నాయకుడు. విప్రుడు తన వద్దకే వచ్చి ముక్కెర అమ్మాడు. విషయము తెలిసింది ఆ దంపతులకు. రోజూ విప్రవేషంలో వచ్చి యాచించినది ఆ విఠ్ఠలేశుడే అని అవగతమైంది ఆ దంపతులకు. “వడివాయక తిరిగే ప్రాణబంధుడు స్వామి” అన్న సత్యం తెలుసుకున్నాడు నాయకుడు. ఆ రోజునుండి ఎన్నో దానధర్మాలుచేస్తూ భగవంతుని భక్తితో కొలుస్తూ తరించారు ఆ దంపతులు. దాదాపు నాలుగు లక్షల సంకీర్తనలు గానంచేసి భక్త పురందరదాసుగా ప్రసిద్ధికెక్కాడు శ్రీనివాసనాయకుడు.
ఈ కథలోని నీతిని చూద్దాము:
1. కర్మఫలం అమోఘమైనది. శ్రీనివాసనాయకుని పూర్వ పుణ్యం వలన భగవంతుడు స్వయంగా వచ్చి అతనిలోని లోభగుణాన్ని పోగొట్టి కాపాడినాడు.
2. ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలంటారు. ఆ సూక్తికి తార్కాణం సరస్వతీబాయి. సుశీలవతి అయిన సరస్వతీబాయి తన సుగుణాలతో స్వామిని మెప్పించి తనను తానే కాక తన భర్తను కుడా తరింపచేసింది.
3. లోభం చాలా భయంకరమైన దుర్గుణము. సాక్షాత్ ఆ భగవంతునికే శ్రీనివాసనాయకుని లోభగుణం మార్చడానికి అంత శ్రమ పడవలసి వచ్చింది. మనమెన్నడూ ధనకాంక్షులము కారాదని దానధర్మాలు చేయాలని మనకీ కథద్వారా తెలిసినది..
No comments:
Post a Comment