Saturday, November 23, 2024

*****🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹: 3. తంత్ర మార్గం - మంత్ర ఫలితం - యోగ విధానము - కుండలినీ సాధన :

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
3. తంత్ర మార్గం - మంత్ర ఫలితం - యోగ విధానము - కుండలినీ సాధన :

కుండలిని అనగా ప్రతి జీవిలో ఉండే చేతనా శక్తిని జాగృతి పరచడం, అనగా మేల్కొలపడం. ఈ కుండలినీశక్తి సహజంగా పుట్టుక నుంచి ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉన్న వ్యక్తులకు పుట్టుకతోనే జాగృతి అయి ఉంటుంది. 

ఈ విధంగా జాగృతి అవని వ్యక్తులకు మాత్రము ఈ శక్తిని ప్రయత్నం ద్వారా మేల్కొల్పే విధానము, పద్ధతులు ఉన్నాయి. ఈ పద్దతులు ఒక్క మానవుడుకి మాత్రమే తెలుసు. భూమి మీద ఉండే 84 లక్షల జీవులలో ఒక్క మానవుడు మాత్రమే నిద్రాణంలో ఉన్న కుండలినీ శక్తిని ప్రయత్నం ద్వారా మేల్కొలిపి, తనలో దాగివున్న పంచ ప్రాణాల మీద లేదా పంచభూతాల మీద, తన ఆలోచనల మీద నియంత్రణ మరియు పట్టుసాధించి తాను ముక్తి మార్గాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా పూర్తి వివరణ కావాలి అనుకుంటే మనకు కుండలినీ విద్యకు, సప్త చక్రాలు గురించి, శరీరంలో ఉండే 72000 నాడులగురించి సంబంధించిన పుస్తకాలలో లభిస్తుంది. 

ఇక్కడ మనము ప్రాథమిక జ్ఞానం తో ముందుకు వెళదాం. సాధనా విధానమును పూర్తిగా తెలుసుకోగలగడం చాలా ముఖ్యమైనవిషయం., చదువుతూ ఉంటే విజ్ఞానం వస్తుంది, కానీ సాధన చేస్తూ సాధించేటప్పుడు, మరియు మనం స్వతహాగా అనుభవిస్తేనే అది జ్ఞానంగా, అనుభవంగా, ఒక అనుభూతిగా మారుతుంది. సాధనలో వచ్చే అనుభవాలను ప్రతి వ్యక్తి సాధించాలి, ప్రతి వ్యక్తి అనుభూతి చెందాలి, అంతేకానీ పుస్తకాలలో చదివి అంత గొప్ప ఇంత గొప్ప అని అనుకోవడం సరికాదు. ఇందులో ఎంత ఉంది అనేది సాధకుడు పూర్తిగా అనుభూతి చెందాలి. ప్రాక్టికల్ గా అనుభవించాలి. 

అనుభూతులు అనగా యోగ విద్యలలో కానీ మంత్రవిద్యలలో కానీ తంత్రవిద్యలలో కానీ సాధకులు సాధించాలి అనుకుంటున్న బ్రహ్మ విద్య అనగా ఆత్మవిద్య గురించి తెలుసుకోవాలి, దివ్య శక్తులు, అనగా దివ్య దృష్టి ఉందో లేదో తెలుసుకోవాలి. దూర శ్రవణము ఉందో లేదో వినాలి. సాధనలో మన దేహంలో శ్రవిస్తున్న అమృతంను రుచి చూడాలి, కుండలినీ శక్తి ఏ నాడిలోకి ప్రవహిస్తే ఏ దేవతా దర్శనం జరుగుతుందో ఆ దేవత రూపంను దర్శించాలి, నాదబిందు సిద్దయోగం ను సిద్దింపచేసుకోవాలి. సమస్త లోకాలు దర్శనం చేసుకోవాలి. ప్రతి మానవుడికి ఉండే సిక్స్త్ సెన్స్ తాను స్వాధీనం చేసుకోవాలి. అష్ట సిద్ధులను కూడా మనిషి అనుభూతి చెంది వాటిని స్వాధీనం చేసుకోవాలి. పరకాయ ప్రవేశ విద్య గురించి, సూక్ష్మ శరీర యానము చేసే విధానం గురించి, పూర్వం జన్మలో దర్శనం చేయవచ్చు, భూత భవిష్యత్తు వర్తమాన దర్శనాలు జరుగుతాయు. వశీకరణం గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి, మాయలు వదలాలి. ఇంకా ఎన్నో వేల అనుభవాలు సాధకులకు వస్తాయి. వీటిని సాధకులు సాక్షిగా మాత్రమే చూసి అనుభూతి చెందుతారు. ఇవి మాత్రమే వాస్తవాలు, భ్రమలు కావు, ఊహలు కావు.

 ఈ విద్యల గురించి బయట సభ్యసమాజంలో, సినిమాలో ఎన్నో బ్రమలు అబద్ధాలు సృష్టించారు, సాధకులు స్వాధీనం చేసుకున్న విద్యలకు బయట మనం అనుకునే విద్యలకు అసలు సంబంధం ఉండదు. అన్నీ భ్రమలు మాత్రమే...

మనం అప్పుడప్పుడు న్యూస్ చానల్స్ లో చూస్తున్న సిద్ధ గురువులు గాలిలో లెగిసి కూర్చుంటున్నారు. భూమిలో తన మీద మట్టి వేసుకుని పూడ్చి పెట్టుకుంటున్నారు. గంటల తరబడి గాలి లేకుండా అనగా గాలి పీల్చకుండా జీవిస్తున్నారు. మరలా బయటకు వచ్చినప్పుడు సాధారణ వ్యక్తి లాగా జీవిస్తున్నారు. జీవసమాది విద్యను అభ్యసించిన సాధకులు, యోగులు ఇప్పటికీ సభ్య సమాజంలో మనతో పాటే జీవిస్తున్నారు. ఇవి వీడియో టెక్నికల్ మార్ఫింగ్ కాదు. వీరు గాలిలోకి లెగిసి కూర్చోవడం, భూమిలో పూడ్చి పెట్టుకోవడం(జీవసమాధి) నిజం. చాలా న్యూస్ చానల్స్ వీటిని ఒప్పుకున్నాయి. ఇటువంటివి ఇంద్రజాలం అనిపించవచ్చు, ఇంకా లోతుగా వెళితే ఇంద్రజాలం కూడా ఉన్నది. అనుభూతి చెందితే ఆహ్లాదాన్ని చూడగలుగుతారు. 

సాధన మాత్రమే వీటన్నిటికీ మూల కారణం సాధన చెయ్యండి, సాధన చేయవలసిందే. సాధనలో అనుభవాలు పొందాలి అనుకుంటే సాధకుడికి సహనం, ఓర్పు అవసరం. అంతేకాకుండా అనుభూతి పొందటానికి చాలా సమయం అనగా సంవత్సరాలు సమయం తీసుకుంటుంది. కొంతమంది వ్యక్తులకు కొద్ది కాలంలోనే వారికి సిద్ధులు వస్తాయి. కొద్దిమందికి ఎక్కువ కాలం సమయం పడుతుంది. ఆ సమయము ఎంత పడుతుంది అనేది మహా సిద్ధ గురువులు కూడా చెప్పలేరు. అది సాధకుడి పుట్టుక, పూర్వజన్మ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. 

నేను చూసిన వ్యక్తులకు కుండలినీ శక్తిని కొద్దిమంది సాధకులకు జాగృతి అవ్వడానికి 2, 3 సంవత్సరాలు టైం పట్టింది. మరి కొద్ది మందికి కేవలం కేవలం అనగా ఆరు రోజుల్లోనే కుండలిని జాగృతి జరిగింది.  మరి కొంత మందికి కొన్ని నెలల్లోనే జాగృతి జరిగింది. ఈ సాధన లో పురుషులకు కన్నా స్త్రీ లకు కుండలినీ జాగృతి అత్యంత తక్కువ సమయంలోనే జరుగుతుంది. స్త్రీల శరీర నాడీమండల వ్యవస్థ కుండలినీ జాగృతికి అత్యంత అనుకూలంగా ఉంటుంది.

ఈ విధంగా వ్యక్తి యొక్క శరీర నాడీ మండల వ్యవస్థ మీద మరియు పూర్వజన్మ సంస్కారం మీద, శరీర ఆరోగ్య పరిస్థితి, ఆలోచనా విధానము, వారి దేహంలో ఉండే మలినాలు, వాటిని శుద్ధి చేసుకునే ప్రక్రియలు, వీటి మీద ఈ కుండలిని శక్తిజాగృతి ఆధారపడి ఉంటుంది మరియు మానసిక బలం మీద కూడా ఈ స్థితి ఆధారపడి ఉంటుంది. మనిషికి కోరికలు సహజం, అదేవిధంగా ఆలోచనలు కూడా. ఈ కోరికలను, ఆలోచనలను బలవంతంగా కాకుండా సంతోషంగా అదుపు చేసుకోగలుగితే సాధకుడుకి కుండలిని జాగృతి తొందరగా జరిగి, ఆధ్యాత్మిక మార్గంలో నడవగలుగుతారు.

వాస్తవానికి యోగాభ్యాసం కానీ, కుండలిని సాధన కానీ చేసే వ్యక్తులు వారి వారి శరీర స్థితిని బట్టి వారికి సిద్ధులు కలుగుతాయి. అసలు సిద్ధులు కలగాలి అంటే ముందుగా శరీరంలో మల దోషం పోవాలి. మలదోషం అనగా మనం తిన్న ఆహారం ద్వారా మాత్రమే ఏర్పడదు. మలము అనగా అసలు అర్థం మలినము. ఈ మలినాలు మనం పీలుస్తున్న గాలి నుంచి, ఆలోచిస్తున్న ఆలోచనలో నుంచి కూడా శరీరంలో మలినాలు ఏర్పడతాయి. ఆలోచనల నుంచి మలినాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే ఇప్పుడు మరలా మన మెదడు గురించి తెలుసుకోవాలి. మన మెదడులో మనకు ఏదైనా ఆలోచన వచ్చింది అంటే మన మెదడు యొక్క నాడీ మండల వ్యవస్థలో జీవ సంబంధమైన రసాయనము ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయనాల కారణంగానే మన శరీరము నిత్య కార్యక్రమములు చేసుకుంటూ ఉంటుంది. ఈ రసాయనాలు శరీరంలో మలినాలుగా ఏర్పడతాయి. కనుక సాధకుడు సాధన చేస్తున్నప్పుడు ఆహార నియమాలు పాటించడం అనగా సాత్విక ఆహారం తీసుకోవడం, మంచి ఆలోచనలతో జీవించడం అదే విధముగా అందరితో ప్రేమభావంతో అనగా ప్రకృతిలోని జీవులతో సహా సమస్తము సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. సంతోషంగా జీవించాలి, మనిషిలో ఉండే ప్రేమ భావము సత్వగుణము ఇవి మనిషికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి. ఈ పాజిటివ్ ఎనర్జీ సాధకుడి శరీరంను ఎంతో కాంతివంతంగా మారుస్తుంది.

సహజంగా మనిషికి సాధన మొదలు కొత్తలో మనిషి తాను ఎలా ఉన్నాడో అలాగే ఉంటారు. సాధన చేస్తున్న కొద్దీ కాలం గడుస్తున్న కొద్దీ తనలో తనకి మార్పులు రావడం గమనిస్తూ ఉంటాడు. ఈ మార్పు తన తోటివారికి కూడా తెలుస్తుంది. ఎంతటి కోపిష్టి అయినా సరే తాను తనకి తెలియకుండానే తనలో సత్వగుణాన్ని, ప్రేమ భావాలు పెరిగినట్లు, తనలో మార్పు వచ్చింది అన్న విషయాన్ని గ్రహిస్తాడు. చాలా సంతోషంగా, ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటాడు.

సాధకుడు ముందుగా సాధించే సిద్ధి ఏంటి అనగా సాధకుడు తనలోని మలిన దోషాన్ని పోగొట్టుకుని తను పరిపూర్ణమైన ఆరోగ్య స్థితిని పొందుతాడు. శరీరంలో ప్రతి కణము, ప్రతి అవయవము ఎంతో ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఎంతో శక్తివంతంగా మారుతుంది. నరాలు, కండరాల మీద పట్టు సాధించగలుగుతారు. ఈ విధంగా పట్టు సాధించడాన్ని పంచభూతాల మీద పట్టు సాధించడం అని అంటారు. సాధకుడు తన మీద తాను ఈ విధమైన పట్టు  సాధించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. తనలో తనమీద సహనం ఓపిక ఏర్పడుతుంది, శ్రద్ధ, భక్తి అనే బీజములు తనలో అణువణువు చేరుతాయి. ఇక్కడ నుండి సాధకుడికి తనకు తెలియకుండానే తనలో సిద్ధుల యొక్క బీజములు పుడుతూ ఉంటాయి. సాధకులకు ఇటువంటి బీజములు పుట్టినవే అన్న విషయం కూడా సాధకుడికి తెలియదు, సాధకుడిలో సాధన స్థిరత్వము లేకపోతే అవి ఆదిలోనే అంతరించిపోతాయి. 

సాధనలో క్రమశిక్షణ, అంకితభావం స్థిరంగా ఉండాలి. కొద్ది రోజులు క్రమశిక్షణతో సాధన చేసిన సాధన కొద్దిరోజులు క్రమశిక్షణ, నియమం తప్పితే పూర్తిగా వ్యర్ధం అయిపోతుంది. అందుకే ఏ సాధకుడు అయినా సరే గురువు సమక్షంలో క్రమశిక్షణతో శ్రద్ధ భక్తి మార్గంలో నడుస్తూ సాధన చేస్తేనే తనలో సిద్ధులు స్థిరంగా ఉండి సాధకుడు యొక్క ఆధ్యాత్మిక జీవిత మార్గానికి సహకరిస్తాయి. సిద్ధులు సాధకుడికి సహకరించడానికి పుడతాయి, అంతేగాని సాధకుడు ఈ ప్రపంచాన్ని శాసించడానికి అవి పుట్టవు, ఉపయోగపడవు. అంతేకాకుండా అవి సాధకుడు యొక్క పతనానికి దారి తీస్తాయి. ఈ బీజములు సాధకుడికి కాంతివంతమైన శరీరమును, ఆహ్లాదమును, మంచి ఆలోచన స్థితిని ఇస్తూ ఉంటాయి. ఈ బీజములు మొక్కలు గా మారి, వృక్షాలుగా మారి సాధకుడు లో సిద్ధులను స్థిరత్వం చేస్తాయి. స్వాధీనం అవుతాయి. 

మరలా గుర్తు చేసుకుందాము, సిద్ధులు మంచి ఆలోచన స్థితి, క్రమశిక్షణ, ప్రేమభావం, అదేవిధంగా అంకితభావం, గురువునందు పూర్తి నమ్మకం ఉన్న సాధకులకు మాత్రమే అవి వస్తాయి, స్వాధీన అవుతాయి. దుష్ట ఆలోచనలతో ఉన్న వ్యక్తులకు ఇవి చేరవు కాదు కదా వారి ఆరోగ్య పరిస్థితి కూడా దుర్లభంగా మారుతుంది.

ఈసాధన ఇన్ని రోజులలో చేయాలి అనిలేదు. ఈ సాధన మోక్షసాధన. జీవితకాలం సరిపోదు. ఎన్నో జన్మల పరంపరనుంచి మనతో వచ్చిన సంస్కారములు కరిగిపోవాలి.

కుండలిని సాధన అనగా లలితా దేవి యొక్క ఉపాసన - శ్రీ విద్య ఉపాసన.

ఈ సాధనను సాధించుటకు మంత్ర మార్గాలు, తంత్ర మార్గాలు, తంత్ర మార్గాలలో వామాచారం, దక్షిణాచారం, అదేవిధంగా శివ తత్వ సాధనలో నాగసాదు సాధన, అగోర సాధన..... ఇలా ఇంకా వేర్వేరు పేర్లతో సాధనలు ఉన్నాయి.

మనం(నేను) ఉత్తరభారతదేశం వెళ్ళినప్పుడు చాలామంది గురువులు శిష్యులకు సంవత్సరాల కొద్దీ వారిని పరీక్షించి, వారితో ఆశ్రమాలలో సేవలు చేపించి, వారికి ముందుగా క్రమశిక్షణ విధానము, నమ్మకమును అలవాటుగా మార్చి, వారిలో ఓపిక సహనం ఏర్పాటుచేసి, ఈ సాధన విధానమును, సాధన యొక్క విలువను నేర్పించి, వారి ఆచారం ప్రకారం వారి గురువుల వద్ద వారు ఏ విద్యలు అయితే వారు నేర్చుకున్నారో ఆ విద్యను తన శిష్యులకు అందులోనూ ఉత్తమమైన అనగా గురువుకి నమ్మకం కలిగిన శిష్యులకు వారు నేర్పిస్తూ ఉంటారు. కుండలిని సాధన విధానము మరియు కుండలిని యొక్క విలువను వారికి క్షుణ్ణంగా వివరించి  వారికి శిక్షణను ఇస్తారు. ఈ కుండలిని సాధన చాలా చాలా గుప్త మైనది, అద్భుతమైనది.

ప్రస్తుతానికి సాధన నేర్పే గురువులు కరువైపోయారు. భజనబృందాలు ఎక్కువైపోయారు. సరైన విద్య ఉన్న గురువే దొరకడం లేదు. భజనబృందాలు, కీర్తనలు పాడుకుంటూ ఉండడం, ధ్యానం చేయడం, బోధనలు బోధించడం... ప్రతీ ఆశ్రమంలోనూ ఇవి మాత్రమే చెప్పేవారు ఎక్కువైపోయారు. సరైన విద్య నేర్పే గురువులు కనుమరుగై పోతున్నారు. సరైన ప్రాణాయామం, విద్య నేర్పించే గురువులు అందుబాటులో లేరు. ఇంటర్నెట్ లోనూ, సోషల్ మీడియాలోనూ ఆసనాలు నేర్పించే గురువులు, మెడిటేషన్ ధ్యాన ప్రక్రియలు చెప్పే గురువులు ఎక్కువైపోయారు. అంతేకాదు పురాణాలకు సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు ఇతరత్రా గ్రంథాల నుంచి వాటిని సేకరించి ఇతరులకు పంపించేవారు కూడా ఎక్కువైపోయారు. అసలు ఈ గ్రంధాలలో శ్లోకాలు, మంత్రాలును రచించినవారు కుండలినీ సాధన యొక్క గుప్త రహస్యాన్ని ఆ అక్షరాల లో పొందుపరిచి, సాధన విధానాన్ని ఒక్కొక్క అక్షరం లో గుప్తంగా ఉంచారు, వీరు వాటిని తప్పుగా అర్థం చేసుకుని ఈ మంత్రం చదివితే ఈ మంచి జరుగుతుంది ఈ శ్లోకం చదివితే ఈ విధమైన మంచి జరుగుతుంది అనే ఒక గట్టి నమ్మకాన్ని ప్రజల్లో ఏర్పరుస్తున్నారు. ఈ విధమైన ప్రక్రియ వలన సాధుకులలో గుడ్డి నమ్మకం ఏర్పడుతుంది, తప్ప సిద్ధి పొందాలి అని అనుకున్నా సాధకులకు అసలు మార్గం లభించదు. వీటిలో సాధకులకు వచ్చే అనుభవాలను వివరించి బోధించే గురువులు ఒక్కరు కూడా దొరకట్లేదు. పుస్తకాలలో ఎవరికి తోచినట్లు వారు పద్ధతులు రాసేశారు, ఈ రాసిన వారిలో ఒక్కరికైనా కుండలిని సాధన వలన వచ్చే అనుభవాలను పొందారో లేదో అన్న అనుమానం కలుగుతూ ఉంది. చాలా అరుదుగా లభించే పురాతన పుస్తకాలలో ఈ విద్యలో వచ్చే అనుభవాలు మాత్రం చాలా చక్కగా వివరించారు. సాధనలో వచ్చే పరిణామాలను కూడా ఎలా ఎదుర్కోవాలో వివరించారు. మనకి సాధనలో ఎటువంటి లోకాలు దర్శనమిస్తాయో కూడా వివరించారు. మరియు వారు ఆయా లోకాలకి ఏ విధంగా ప్రయాణం చేశారో కూడా వివరించారు. ఈ విధంగా రాసిన వారు ఉపనిషత్తుల నుండి గ్రహించి సాధన చేసి మరియు వారు ఆ అనుభవాన్ని పొందిన తరువాత ఎంత చక్కగా అనుభవాన్ని పొందారో వివరించారు. ఇటువంటి పుస్తకాలను మన వద్ద పెట్టుకుని సాధన లో వచ్చే అనుభవాలను మరియు విపరీతమైన పరిణామాలను ఎదుర్కొనే విధానాన్ని తెలుసుకోవాలి, అంతేకానీ ప్రతి పుస్తకంలో రాసిన విధానాలు పద్ధతులు దగ్గర ఉంచుకోకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం  లభిస్తున్న పుస్తకాలలో ఒక అనుభవం కూడా సరైనది కాదు. బ్రమలు, ఊహాజ్నానము తో రాస్తున్నారు , సాధకులకు వేదాలలో ఉపనిషత్తులలో రాసిన విధంగా అనుభవాలు సాధన చేస్తున్నప్పుడు సాధకులకు వస్తాయి. కానీ బయట లభిస్తున్న ఇతర అ గ్రంధాలలో అటువంటి అనుభవాలు వస్తున్నట్లుగా ఎవరు వివరించలేదు. గతంలో సరైన గురువు దొరకట్లేదు అని ఎందుకు అన్నాను అంటే ధ్యానంలో, సాధనలో శిష్యులకు వచ్చే సందేహాలను తీర్చగలిగే గురువు ఒక్కరు కూడా లేరు. ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు అంటే అంతా భగవంతుడే చూసుకుంటాడు అని, అవును. అంతా భగవంతుడే చూసుకుంటాడు, కానీ సాధనలో సాధకులకు కనిపిస్తున్న దృశ్యాలు, వినపడుతున్న శబ్దాలు, మరియు సాధనలో వచ్చే విపరీత పరిణామాలు గురించి విద్య తెలిసిన గురువు తప్ప మరెవరు వివరించి చెప్పలేరు, సరి చెయ్యలేరు. సాధకులు ఇలా బోధనలు చేసే వాళ్ళని, భజన బృందాల దగ్గరకు వెళ్ళకుండా సరైన గురువుని ఎంచుకుని, ఆ గురువు అనుభవాలని మరియు మనకు వస్తున్న అనుభవాలని వివరించగలిగే వాళ్ల దగ్గర విద్యను అభ్యసించాలి. లేకపోతే సాధన లో వచ్చే వైబ్రేషన్స్ మరియు ఇతరత్రా కారణాలవలన వచ్చే అనారోగ్యాలు, శారీరక బాధలు, మానసిక బాధలు తప్పవు.

అసలు మన శరీరంలో ఉంటే సప్తచక్రాలు వివరించడానికి ఇంటికి ఒకళ్ళు ఉన్నారు. అసలు ఈ చక్రాలు అంటే ఏమిటో తెలుసుకోవడం అన్నింటికన్నా ముఖ్యమైనది. సరైన సాధకుడు మాత్రమే ఈ చక్రాలయొక్క ఉనికి తెలుసుకుంటాడు. ఈ చక్రాలవద్ద వచ్చే కదలికలు, నాడులలో కుండలినీ  ప్రయాణం, కుండలినీ ప్రయాణం జరుగుతున్నప్పుడు కనబడే దృశ్యాలు, వినబడే నాదములు, సాధనలో నవరసాలను అనుభవించడం.... ఈవిధంగా సాధకుడు స్వతహాగా  అనుభవిస్తాడు. 
అష్టసిద్ధులను అనుభవించడం మొదలుపెడతారు. 
సూక్ష్మ శరీరయానం చెయ్యగలుగుతారు. 
అనేక రకమైన సిద్ధులను సాధకుడు అనుభవిస్తాడు. బ్రమలు తొలగిపోతాయి.

ఇంకొక విషయం ఏమిటి అంటే కుండలిని సాధన నేర్చుకోవడానికి చాలా సహనం ఓపిక అవసరం. ఈసాధన ప్రారంభించినప్పటి నుంచి సాధకుడు తన జీవితాంతము మోక్షం వచ్చేంతవరకు ఈ సాధన కొనసాగించే ఆలోచన ఉంటేనే ఈసాధన సాధించడానికి సాహసం చేయాలి. 

నిత్యజీవితంలో మనిషి బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. జీవించడానికి సంతోషము, ఆనందము, తృప్తి ఇంకా.... చాలా అవసరం. ఇవి బాహ్యసుఖములు. కుండలినీ సాధనను మొదలుపెట్టిన సాధకుడు తాను ముందుగానే వీటన్నింటిని త్యాగం చేయడానికి సిద్ధం అయ్యి ఈ సాధన మొదలు పెట్టాలి. అప్పుడు అంతర సుఖములు సాధకుడు అనుభవిస్తాడు. సహజంగా కుండలిని సాధన చేస్తున్న వ్యక్తి వేటిని త్యాగం చేయవలసిన అవసరం లేదు. అవసరం అయితే తాను త్యాగం చేయాలి. మనం నిత్యము ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట లేదా మనకు వీలుకలిగిన సమయంలో సాధన చేసుకోవచ్చు. 

కుండలిని సాధన చేసే వ్యక్తులు సాధ్యమైనంతవరకు తంత్ర మార్గాల ద్వారా కాకుండా మంత్ర మార్గాల ద్వారా కాకుండా యోగ మార్గం ద్వారా తాను సాధన చేసుకొనుటయే ఉత్తమం. సాధకులు ఈ మార్గమును ఎంచుకోవడమే సాధ్యమైనంతవరకు గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తులకు ఉపయుక్తంగా ఉంటుంది.

తంత్ర మార్గంలో మరియు మంత్ర మార్గంలో మనసును ఏకాగ్రత కుదుర్చుటకు ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తులు మంత్రాలు, తంత్రాలు మార్గాలుగా ఎంచుకున్న వారికి నియమనిష్టలు ఎక్కువగా ఉంటాయి.

సాధ్యమైనంతవరకు యోగవిద్యద్వారా శక్తిపాతం చేసే గురువును(నిజమైన విద్య తెలిసిన గురువును) ఎంచుకుని కుండలిని సాధన ప్రారంభించుట మరియు గురువు సమక్షంలోనే సాధన చేసే విధంగా తన పరిస్థితులను మార్చుకోవాలి.

ప్రస్తుతానికి సభ్య సమాజంలో చాలా ఆశ్రమాలలో కుండలిని సాధన నేర్పిస్తున్నారు అని అంటున్నారు. ఈసాధన నేర్పించే గురువులు లు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించి ఈ సాధన నేర్పిస్తున్నారు. వాస్తవానికి ఈసాధన ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేర్పించకూడదు. శిష్యులమీద బాధ్యతలేని గురువు మాత్రమే ఇలా నేర్పుతారు. వీళ్ళని గురువు అనికూడా అనకూడదు.  

కుండలిని సాధన చేస్తున్న వ్యక్తి శరీరంలో నిద్రాణమై ఉన్న కుండలినీశక్తి మేల్కొంటే ఆ వ్యక్తి శరీరంలో అనగా సాధకుడి శరీరంలో విపరీతమైన కంపనాలు వచ్చి తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థితిలోకి వచ్చే ప్రమాదం ఉన్నది. కొంతమంది సాధకులు మాత్రం తనని తాను కంట్రోల్ చేసుకోగలరు, కానీ ఈ చేతన శక్తి మేల్కొన్న స్థితి కొంతమంది విషయంలో వారి చేతిలో ఉండదు. ఇటువంటి స్థితులను మేము కళ్లారా చూస్తూ అనుభవిస్తూ ఉన్నాము. ఈ శక్తి శరీరంలో ఏ అవయవాలలో కి ప్రవహిస్తుందో ఆ అవయవాలలో వచ్చే మార్పులు స్వతహాగా అనుభవిస్తున్న సాధకుడికి మాత్రమే తెలుస్తుంది. గురువు వేరే ఊరిలో ఉండి, శిష్యుడు ఇంకొక ఊరిలో ఉండి సాధన చేస్తున్నప్పుడు ఇటువంటి విపత్కర పరిణామాలు సంభవించినప్పుడు ఆ శారీరక ఇబ్బందులను సరిచేయడం సాధ్యం కాదు. ఈ విపత్కర పరిణామాలను గురువు శిష్యులకు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ముందుగానే శిక్షణ ఇస్తాడు. అందుకు శిష్యుడు ముందుగా గురువు గారి సమక్షంలో కుండలినీ శక్తి జాగృతి అయ్యి, కుండలినీ ప్రయాణం కొనసాగించే అంతవరకు అయినా సరే గురువు సమక్షంలోనే సాధన చేయాలి, తదుపరి తాను ఇంటివద్ద సాధన చేసుకోవచ్చు. ఇందులో వస్తున్నా అనుభవాలలో చాలా డెప్త్ గా మేము అనుభవిస్తూ వస్తున్నాము, ఈ పోస్ట్ ఎందుకు పెడుతున్నాను అంటే గురువులు శిష్యులకు ఇటువంటి ఆన్లైన్ క్లాసులు కుండలినీ విషయంలో సాహసించడం సరికాదు. యోగ క్లాసెస్, మెడిటేషన్ ఇతరత్రా ఆధ్యాత్మిక సాధనలను ఆన్ లైన్ ద్వారా నేర్పించవచ్చు. ఇందులో కొంత వరకు పట్టు సాధిస్తారు, కానీ కుండలిని సాధనలో మాత్రం ఒక్క టెక్నిక్ కూడా ఆన్లైన్లో బహిరంగం చేయకూడదు. అందుకే ఈ కుండలిని సాధనను గుప్త సాధన అని అంటారు. అంతేకానీ మరి ఇంకేదో కాదు. పెడర్దాలు తియ్యకూడదు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అసలైన విద్య.

ఈ విద్యను మాత్రం అసలైన విద్య తెలిసిన గురువును సంప్రదించి వారి వద్ద దీక్ష తీసుకుని సాధన చేయడం మంచిది. దీక్ష తీసుకోవడం అని అంటే ఈ యోగ విద్యలో గురువు గారిని మన మంచి ప్రవర్తనతో మెప్పించాలి. ఆయనకు మనమీద మంచి అభిప్రాయము, మంచి శిష్యుడు అవుతాడని, మంచి సాధకుడు అవుతాడని నమ్మకం కలిగించాలి. ఇవి అన్ని కలిగిస్తే గురువు ఉప్పొంగిపోయి మనకు సాధన నేర్పడానికి ఎంతో సహకరిస్తారు. ఉదాహరణకు నేను చేస్తున్న ఈ సాధనను మా గురువుగారిని మెప్పించి ఆయన అనుగ్రహం పొంది ఆయన చెబుతున్న ప్రతి మాటను గౌరవించి ఆయనకు నమ్మకం కలిగించి మేము ఆయన శిష్యులుగా చేరి ఆయన సమక్షంలోనే సాధన చేస్తున్నాము. కుండలిని సాధన విధానంలో గురువు అనుగ్రహం ఎంతో ముఖ్యమైనది.  

Sekarana  

No comments:

Post a Comment