"ఆత్రేయగీత"
నాల్గవ భాగం
“సూక్ష్మజ్ఞానము” - 8వ భాగము.
- శ్రీ శాస్త్రి ఆత్రేయ
మనోనిగ్రహానికి, వైరాగ్యంతో కూడిన
అభ్యాసముండాలి. వైరాగ్యముండి అభ్యాసము లేకపోయినా, అభ్యాసము మాత్రమేనుండి వైరాగ్యము లేకపోయినా మనస్సును స్వాధీనపరుచుకొనుట కుదరదు.
ఒక కార్యమును సాధించుటకు నిర్విరామంగా, పట్టుదలతో చేయు ప్రయత్నమే అభ్యాసము. ఈ జన్మలో ఏర్పడిన వికారములు, గత జన్మలనుండి సంప్రాప్తించిన విషయవాసనలు జీవునిలో పూర్తిగా తొలగిపోవాలంటే నిరంతర అభ్యాసముద్వారా మనస్సుపై పట్టుసాధించాలి. ఈ అభ్యాసమంతా వైరాగ్యంతో(విషయవిరక్తితో) సాగాలి. అంటే
శాశ్వతము కానీ ఇంద్రియసుఖముల వెంట నిరంతరం పరిగెత్తు మనస్సుని ధ్యానము ద్వారా శాశ్వతము, సత్యమగు పరమాత్మ వైపు మరల్చాలి.
ఈ కాలంలో అనేక ధ్యానపద్ధతులు అమల్లో
వున్నాయి. ఏ పద్ధతైనా సరే, మనస్సును ఏకాగ్రపరచి దైవచింతన చేయడమే ముఖ్యము. ఆరంభదశలో మనస్సు పరిపరివిధముల పరిగెత్తినా, మెల్లగా ఆత్మయందు స్థాపితము చేయాలి
సులభంగా చెప్పాలంటే ధ్యానమును కొత్తగా
నేర్చుకొనవలసిన అవసరంలేదు. అందరూ నిత్యమూ చేస్తున్నదే. అయితే ఇన్నాళ్లు జీవుడు ధ్యానిస్తున్నది కేవలము ఈ ప్రాపంచిక విషయములు లేదా భోగవిలాసములైతే, ఇప్పుడు ఆ ధ్యానమును పరమాత్మవస్తువుపై మళ్లించడం అంతే. ప్రతిరోజు ఓ నిర్ణీత సమయమందు ధ్యానము చేస్తూ, మెల్లమెల్లగా ధ్యాననిడివి పెంచుకుంటూ పోతే మనస్సు
అధీనంలోకి తప్పక వస్తుంది.
మనస్సు, బుద్ధి ఏకమైనప్పుడు సత్యం తెలుస్తుంది! "ఆత్మ" వికసిస్తుంది! "అద్వైతం” వరిస్తుంది! "బ్రహ్మైక్యం” సిద్ధిస్తుంది. ఇదే ధ్యానం యొక్క పరాకాష్ట. ఇన్నాళ్లూ బయట హడావుడి చేసిన “నేను”ని, అంతరంగంలో గ్రహించడమే అసలైన ధ్యానసాధన. అది “ఎవరో” తెలుసుకుంటే, ఇక తెలుసుకోవలసింది ఏమీ వుండదు!!
హఠయోగం, జఠయోగం, మఠయోగాలతో
మనస్సుని బలవంతంగా బంధిస్తే ఆత్మజ్ఞానం కలగదు! కారణం ఇంద్రియాలు వాటి పనిని ఆపవు కాబట్టీ! యోగమంటే మనస్సు ఆత్మలో లయం కావాలి!
జననమరణ చట్రం నుండి బయటపడడమే అసలైన సాధన. దేనిని తెలుసుకుంటే ఈ చట్రములో తిరిగి ప్రవేసించడో, ఏది తెలుసుకుంటే ఆత్మానందమును పొందునో, ఏది తెలుసుకుంటే ఈ చరాచర జగత్తును సమదృష్టితో చూడగలడో, ఏది తెలుసుకుంటే అసలు సత్యము అవగతమగునో, దానిని ఈ ధ్యానము ద్వారా పొందవలెను.
నారాయణుని ధ్యానించి నరుని దూషిస్తే ప్రయోజనంలేదు. మాధవుని పూజించి మానవధర్మమును విస్మరిస్తే మనుగడలేదు. సత్యమును మరచి సదాశివుని స్మరిస్తే లాభములేదు. ఈ తత్వము నెంగి చేయు సాధనే ధ్యానము.
ఇది గ్రహించక జీవుడు అశాశ్వతములగు ప్రాపంచిక వస్తువులపై బంధము పెంచుకుంటూ, ఇంద్రియముల వశుడై సుఖదుఃఖములు చవిచూస్తూ, మిగిలిన కర్మఫలితములు అనుభవించుటకు జననమరణములు పొందుతూ, ఆత్మవస్తువును విస్మరిస్తూ, సత్యమును తెలుసుకొనక పరమాత్మకు దూరం అవుతున్నాడు. తాను వచ్చిన చోటుకి చేరుకోలేక పోతున్నాడు.
No comments:
Post a Comment